– 30-49తో గుజరాత్ చిత్తు
– ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11
నవతెలంగాణ-హైదరాబాద్: డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్ టాప్ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్ 19 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్ ఆటగాళ్లలో ఆకాశ్ షిండె (11 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరువగా.. పంకజ్ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్ ( 5 పాయింట్లు), ఆమన్ ( 5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమన్ సింగ్ ( 13 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్ జెయింట్స్ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.