– పంజాబ్‌పై రాజస్థాన్ గెలుపు
– ఛేదనలో రాణించిన హెట్మయర్
– పంజాబ్ 147/8, రాజస్థాన్ 152/7
నవతెలంగాణ-ముల్లాపూర్
ఐపీఎల్ 17లో రాజస్థాన్ రాయల్స్ ఐదో విజయం సాధించింది. గత మ్యాచ్‌లో ఓటమి నుంచి పుంజుకున్న రాజస్థాన్ శనివారం పంజాబ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 148 పరుగుల స్వల్ప ఛేదనలో రాయల్స్‌కు పంజాబ్ కింగ్స్ గట్టి పోటీ ఇచ్చింది. కగిసో రబాడ (2/18), శామ్ కరన్ (2/25) విజృంభణతో రాయల్ ఒత్తిడిలో పడింది. జైస్వాల్ (39), తనుశ్ (24), సంజు శాంసన్ (18), రియాన్ పరాగ్ (23) మెరిసినా.. ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేదు. షిమ్రోన్ హెట్మయర్ (27 నాటౌట్, 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. 19.5 ఓవర్లలో 152 పరుగులు చేసిన రాయల్స్ సీజన్లో ఐదో విజయంతో అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. వికెట్ కీపర్ జితేశ్ శర్మ (29, 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), ఆషుతోశ్ శర్మ (31, 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్ (21, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) సమయోచిత ఇన్నింగ్స్‌లతో పంజాబ్ కింగ్స్‌కు గౌరవప్రద స్కోరు అందించారు.
టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ ఛేదనకు మొగ్గుచూపింది. సొంతగడ్డపై తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు పదునైన పేస్‌తో స్వాగతం పలికారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు అతర్వ (15), జానీ బెయిర్‌స్టో (15) మంచి ఆరంభమే అందించారు. 3.4 ఓవర్లలో 27 పరుగులు జోడించారు. కానీ అవేశ్ ఖాన్ పవర్‌ప్లేలోనే వికెట్ల వేటకు తెరతీశాడు. రెండు ఫోర్లతో జోరుమీదున్న అతర్వ నిష్క్రమణ తర్వాత పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. ప్రభుసిమ్రన్ సింగ్ (10) మరోసారి విఫలం కాగా.. జానీ బెయిర్‌స్టో కథను స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ముగించాడు. ఫామ్‌లో ఉన్న శామ్ కరన్ (6) సైతం మహరాజ్ ఉచ్చులో పడ్డాడు. 52/4తో పంజాబ్ కింగ్స్ ఒత్తిడిలో పడింది. రాయల్స్ పేసర్లు, స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో పంజాబ్ కింగ్స్ రన్‌రేట్ పడిపోయింది. 8.6 ఓవర్లలో 50 పరుగులు చేసిన పంజాబ్.. 100 పరుగుల మార్క్‌ను 16 ఓవర్లకు అందుకుంది. వికెట్ కీపర్ జితేశ్ శర్మ (29) మిడిల్ ఓవర్లలో పంజాబ్‌ను ఆదుకోగా.. డెత్ ఓవర్లలో లియాం లివింగ్‌స్టోన్ (21), ఆషుతోశ్ శర్మ (31) నిలబెట్టారు. ఆషుతోశ్ శర్మ మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో మెరువగా.. లివింగ్‌స్టోన్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.