బీజేపీలో అసంతృప్త రాగాలు

బీజేపీలో అసంతృప్త రాగాలు– చర్చనీయాంశంగా జితేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి కలయిక
– తీవ్ర అసంతృప్తిలో ఎంపీ సోయం బాపూరావు
– వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం
– సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నల్లగొండ నాయకత్వం
– వరంగల్‌ సీటు కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఓవైపు వేగంగా అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకెళ్తున్న బీజేపీలో అంతే స్థాయిలో అసంతృప్త రాగాలు తీవ్రమవుతున్నాయి. మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడి తీవ్ర నైరాశ్యంలో ఉన్న జితేందర్‌రెడ్డిని స్వయంగా ఇంటికెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి కలవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌రెడ్డి తరుచూ వచ్చిపోతుంటారనీ, టికెట్‌ రాలేదన్న బాధలో ఉన్న తనకు ఓదార్పు ఇచ్చేందుకు వచ్చారని జితేందర్‌రెడ్డి కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. ఆదిలాబాద్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఆదివాసీనేత, ఎంపీ సోయంబాపూరావు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. బీజేపీకి ఏమాత్రం పట్టులేని సమయంలో కాంగ్రెస్‌ను వీడి ఆదివాసీల సహకారంతో ఎంపీగా గెలిచిన తనను పార్టీ పక్కనబెట్టడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. జితేందర్‌రెడ్డి, సోయం బాపూరావు త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం కోడై కూస్తున్నది. వారిద్దరికీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు కూడా ఆఫర్‌ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. నల్లగొండ పార్లమెంటరీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని ప్రకటించడంపై రాష్ట్ర నాయకత్వమే రెండుగా చీలిపోయింది. ఆయన్ను చేర్చుకునే సమయంలోనే పార్టీ శ్రేణులను కొట్టించిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజరు తన అసంతృప్తిని వ్యక్తపరిచిన విషయం విదితమే. సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని నల్లగొండ జిల్లా బీజేపీ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆయన్ను మార్చాల్సిందేనని రాష్ట్ర నాయకత్వం వద్ద పట్టుపడుతున్నది. దీనిపై ఆ పార్టీ పార్లమెంట్‌ బోర్డు కమిటీ సభ్యులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ స్పందిస్తూ..’దాడి చేసిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్న నేతలకు మేం జవాబు చెప్పుకుంటాం. నచ్చజెప్పుకుంటాం. పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించే చేర్చుకుంటున్నది’ అని చెప్పారు. వరంగల్‌ సీటును బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఆయన ఇంకా పార్టీలోనే చేరలేదు. బుధవారం వరంగల్‌ జిల్లాలో ఆయన కోసం బీజేపీ-బీఆర్‌ఎస్‌ శ్రేణులు బాహాబాహికి దిగడం, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయన్ను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు దగ్గరకు తీసుకెళ్లడం దాకా మొత్తం సీన్‌ సినిమా తరహాలో రక్తికట్టించింది. అయితే, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌ తనకు వరంగల్‌ సీటు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ, అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా, ఆయన మొరను ఎవ్వరూ పట్టించుకోకవడంతో ఆయన కూడా నైరాశ్యంలో ఉన్నారు. తీవ్ర పోటీ మధ్య మెదక్‌ సీటు దక్కించుకున్న రఘునందన్‌రావుకు మరో నేత అంజిరెడ్డి ఏమేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. ఇప్పటిదాకా బీజేపీ ప్రకటించిన 15 మంది అభ్యర్థుల్లో 8 మంది వారం, పది రోజుల కింద పార్టీలో చేరిన వారే కావడం గమనార్హం. అందులో బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినవారు ఆరుగురు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు, ఏ పార్టీకి సంబంధం లేకుండా డైరెక్ట్‌గా హైదరాబాద్‌ స్థానం దక్కించుకున్న మాధవిలత ఉన్నారు. వీరంతా ఒక పార్టీలో స్థిరంగా ఉండరనీ, ఎవరు అధికారంలో ఉంటే వారివైపు కొమ్ముకాసే వారికి పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి సీట్లు ఇచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీనే నమ్ముకుని దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను అవమానించడమేనని హార్డ్‌కోర్‌ కార్యకర్తలు వాపోతున్నారు. మాధవిలతకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై రాజాసింగ్‌ ఫైర్‌ అయ్యారు. ‘ఆ స్థానంలో పోటీచేయించేందుకు మొగోడే దొరకలేదా?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. సంగారెడ్డిలో జరిగిన మోడీ బహిరంగ సభలోగానీ, హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో జరిగిన అమిత్‌షా సభలోగానీ రాజాసింగ్‌ కనిపించలేదు. ఆయన ఇంకా అలక వీడలేదు. దీనిని కవర్‌ చేసుకునేందుకు అగ్రనేతలు తిప్పలు పడుతున్నారు.