అశాస్త్రీయ దృక్పథం!

గతేడాది 300కి పైగా సైన్స్‌ అవార్డులను రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో తొంభై రెండింటిని రద్దు చేయడం శాస్త్ర విజ్ఞానం పైన, శాస్త్రీయ దృక్పథం పట్ల కమలనాథుల కక్షకు తార్కాణం. సైన్స్‌, హెల్త్‌ రంగాల్లో అవార్డులను నిలిపేయాలని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడెమీ ఈ అవార్డులను నిలిపేసినట్టు ప్రకటించింది. యువ శాస్త్రవేత్తలు, సైన్స్‌ టీచర్లు, అంతర్జాతీయ హోదా కలిగిన శాస్త్రవేత్తలకు ఇవ్వడానికి ఉద్దేశించిన 72అవార్డులను రద్దు చేసింది. నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఇండియా కూడా 20కి పైగా అవార్డులను కూడా పక్కకు పెట్టింది. శాస్త్రవేత్తల కోసం శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన అవార్డులను అర్ధంతరంగా హఠాత్తుగా రద్దు చేయడాన్ని బుద్ధిజీవులు విమర్శించడం సహజం. ఇది మన శాస్త్రీయ సంస్థల స్వయం ప్రతిపత్తిని లాక్కునేందుకు చేపట్టిన ప్రక్రియని కొందరు ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థ ఎవరికి ఎప్పుడు అవార్డులు ఇవ్వాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలన్నది ఇందులోని ఆంతర్యమని ఓ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. స్వయంప్రతిపత్తి సంస్థలుగా పేర్కొనబడే ఆయా సంస్థలను పూర్తిగా సర్కారు పెత్తనంలో నడపడానికేనని అంటున్నారు. యువ శాస్త్రవేత్తలకు, సైన్స్‌ టీచర్లకు అవార్డులు రద్దు చేయడాన్ని కేవలం వారి కెరీర్‌లోని అవకాశాలను గుంజుకోవడంగా కాకుండా వారిలో శాస్త్ర విజ్ఞానం పట్ల గల తృష్ణను చంపేయాలన్న దుర్బుద్ధితో సర్కారు చేసిందని భావించాల్సి ఉంటుంది.
శాస్త్రీయ దృక్పథాన్ని (సైంటిఫిక్‌ టెంపర్‌) అభివృద్ధి చేయడం భారత పౌరుల ప్రాథమిక బాధ్యతగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51 ఎ(హెచ్‌) పేర్కొంది. అందుకు భారతీయ పౌరులందరూ శాస్త్రీయ దృక్పథాన్ని కలిగుండాలి, అలా ఉండేలా ప్రోత్సహించాలి. కానీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణం. రాజ్యాంగంలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రాథమిక బాధ్యతగా పేర్కొన్నది యావత్‌ ప్రపంచంలో ఒక్క భారతదేశమే! జవహర్‌లాల్‌ నెహ్రూ తన ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించవలసిన ఆవశ్యకత గురించి వివరించారు. అది జాతీయోద్యమ భావన. స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పడ్డాక శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు, ప్రోత్సహించేందుకూ ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను స్థాపించారు. సిఎస్‌ఐఆర్‌, ఎన్‌సిఎస్‌టిసి వంటివి ఎన్నో వచ్చాయి. సమకాలీన ప్రపంచంలో సైతం మన శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, డాక్టర్లు అగ్రభాగాన ఉన్నారంటే అటువంటి అవగాహనతో ఎంతో ముందు చూపుతో స్థాపించిన వివిధ ఐఐటిలు, ఐసిఎంఆర్‌, ఎయిమ్స్‌ వంటివీ కారణం.
ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం, హేతువాద దృష్టి, ప్రశ్నించేతత్వం పెరిగితే ఛాందస భావాలు, మూఢ విశ్వాసాలు వంటివాటికి ఎదురుదెబ్బ తగులుతుంది. మత ప్రాతిపదికన ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా గల సంఘపరివార్‌ శక్తులకు శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధత శత్రువుల వంటివే. అందుకే ప్రముఖ హేతువాదులైన ధబోల్కర్‌, గౌరీ లంకేష్‌, పన్సారే లాంటివారిని హత్య గావించారు. భౌతికంగా వారిని మట్టుబెట్టినా, అనేకమందిని బెదిరించినా హేతువును అడ్డుకోవడం సాధ్యం కావడం లేదు. అందుకే ఆ కుదురు నుండే వచ్చిన ప్రభుత్వ పెద్దలు ఈ వ్యవస్థలో భాగంగా ఉన్న శాస్త్రీయ దృక్పథానికి తూట్లు పొడవాలని ఇటువంటి కుయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి కుట్రలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలూ, ప్రగతి కాముకులు ఒక్కటై ఎదిరించాలి. భారత దేశ చరిత్ర, భారతీయ తాత్వశాస్త్రంలో చార్వాకులు, సాంఖ్యులు వంటివారి పాత్ర ఎంతో గొప్పది. వారి వారసత్వంగా సైన్సును, శాస్త్రీయ దృక్పథాన్ని నిలబెట్టడానికి, మరింతగా ప్రోత్సహించడానికీ భారతీయులందరమూ కృషి చేయాలి. ఛాందసత్వానికి, మౌఢ్యానికీ పెద్దపీట వేస్తున్న మోడీ సర్కారు విధానాల్ని తిప్పికొట్టాలి.
-ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌