అశాస్త్రీయంగా కేంద్రం మద్దతు ధరలు : పోతినేని

 రైతు సంఘాలకు కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : టి.సాగర్‌
నవతెలంగాణ-అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ధాన్యం పంటలకు మద్దతు ధర అశాస్త్రీయంగా ఉందని, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మొక్కుబడిగా మద్దతు ధర ప్రకటించటం దారుణమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శనరావు అన్నారు. ఈ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని లహరి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రైతు రాజకీయ శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోతినేని మాట్లాడారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా మద్దతు ధర ఎలా అమలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మొక్కజొన్న, పత్తి పంటల మద్దతు ధర అదే పరిస్థితి నెలకొన్నదని, పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేసారు. రాష్ట్రంలో నెలకొన్న పోడు భూముల సమస్య పరిష్కరించి పట్టాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ధరణి పథకం ఉన్నా ఎటువంటి అభ్యంతరం లేదని కానీ ధరణిలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రుణమాఫీ ప్రకటించాలని, ఏడాదిలో దేశవ్యాప్తంగా 13 వేల రైతు ఆత్మహత్యలు నమోదు కావటం కేంద్ర పాలనకు నిదర్శనం అన్నారు.
సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ సవరణ బిల్లును రైతులకు వ్యతిరేకంగా పార్లమెంటులో పెట్టి దొడ్డిదారిన తీర్మానం చేయటం సబబు కాదన్నారు. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల సంఘాలతో కలసి జులై నుంచి దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుందన్నారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం దేశంలోనే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. విడతల వారీగా ఆందోళనలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహా రెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యలమంచిలి వంశీ క్రిష్ణ, అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.