– బాలురతో బలవంతంగా మూత్రం తాగించి..
– ప్రయివేట్ పార్ట్‌లో మిరపకాయలు రుద్ది..
సిద్ధార్థనగర్ : ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఇద్దరు బాలుర పట్ల అతిదారుణంగా వ్యవహరించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇద్దరు బాలురతో మూత్రం తాగించి, వారి మలద్వారంలో పచ్చిమిర్చి రుద్దారు. పెట్రోలు ఇంజక్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోళ్ల ఫారమ్‌లో రూ.2 వేలు దొంగిలించారని ఆరోపిస్తూ 10, 15 ఏండ్ల వయసున్న అఫ్జల్, విజరు సాహ్నిలను గత శుక్రవారం చేతులు కట్టేసి, పత్రబజార్‌లోని కొంకటి క్రాసింగ్ వద్ద ఉన్న చికెన్ షాపులో ఉంచారు. ఆ అబ్బాయిలను పచ్చి మిరపకాయలు తినేలా చేసి, బాటిల్‌లో నింపిన మూత్రాన్ని తాగాలని బలవంతపెట్టారు. కొంతమంది వ్యక్తులు వారిని దుర్భాషలాడడం, కొడతామని బెదిరించడం ఆ వీడియోలో కనిపించింది. మరొక వీడియోలో అబ్బాయిల చేతులను వెనుకకు కట్టి, ప్యాంటు కిందికి లాగి నేలపై పడుకుని ఉండగా, ఒక వ్యక్తి వారి మలద్వారంలో పచ్చి మిరపకాయలను రుద్దడం కనిపించింది. నొప్పితో అరుస్తున్న అబ్బాయిలకు పెట్రోలు ఇంజెక్ట్ చేశారు. పిల్లలిద్దరూ సహాయం కోసి అరిచినా, వారిని రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆగస్టు 4న చిత్రీకరించిన ఈ వీడియో జిల్లాలోని పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంకటి చౌరాహా సమీపంలోని అర్షన్ చికెన్ షాప్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాలలలో ఒకరి తండ్రి మహ్మద్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ తెలిపారు.