నిలకడలేని కాలం

గతమూ వర్తమానమూ భవిష్యత్తూ
అసలీ కాలానికి నిలకడ ఉందా
ప్రతి క్షణం నడిచే కాలం ఇప్పుడూ నడుస్తుంది
ఎప్పుడూ జరిగేదే ఇప్పుడూ జరుగుతుంది
మనకు వేరే దారి లేదు కొత్త దర్వాజా లేదు
కాలాన్ని అనుసరించడమే తెలిసిన రహదారి
ఇదేదో కొత్త ముచ్చట కాదు
నాతోపాటు అందరికీ తెలిసిందే
అనుభవంలోకి వచ్చిందే అయినా మరిచిపోతాం
అనంతమయిన లోకమేదో ఎక్కడో వుందనుకుంటాం
మరణం తర్వాత శాంతి
శాశ్వతత్వం లభిస్తుంది అనుకుంటాం
ఎంత ఉదాసీనంగా చూసినా ఉపేక్షించినా
గతం మనల్ని వదలదు భవిష్యత్తు తెలవదు
అందుకే వర్తమానంలో బతుకుదాం
హాయిగా కురుస్తున్న వర్షాన్ని గురించి
అందంగా విచ్చుకుంటున్న పూల గురించి
పక్కవాడి గురించీ ఎదుటివాడి గురించీ
శ్రమ గురించీ సేవ గురించీ
స్నేహం గురించీ ప్రేమ గురించీ
బంధాల గురించీ ఆలోచిద్దాం
సుందరమయిన అర్థవంతమయిన
వర్తమానమే భవిష్యత్తులోకి దారితీస్తుంది
– వారాల ఆనంద్‌