న్యాయ హక్కు లభించే వరకు..

Right to justice Until available..– ఇదే రాహుల్‌గాంధీ భారత న్యాయ యాత్ర ట్యాగ్‌ లైన్‌
– పార్లమెంటులో మాట్లాడనివ్వట్లేదు..అందుకే ప్రజల వద్దకు
– ప్రతిపక్ష నేతలను బెదిరించేందుకు కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం :భారత్‌ జోడో న్యారు యాత్ర లోగో,నినాద ఆవిష్కరణలో ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌లో సమస్యలు లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందున తమ పార్టీ ‘భారత్‌ జోడో న్యారు యాత్ర’ను చేపడుతు న్నట్టు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్‌ జోడో న్యారు యాత్ర’ లోగో, నినాదాన్ని(న్యారు కా హక్‌ మిల్నే తక్‌) మల్లికార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్‌) జైరామ్‌ రమేష్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ‘భారత్‌ జోడో న్యారు యాత్ర దేశంలోని ప్రాథమిక సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై దృష్టి పెడుతుంది’ అన్నారు. ఇండియా ఫోరం నాయకులు, పౌర సమాజ సభ్యులను కూడా మార్చ్‌లో పాల్గొన డానికి ఆహ్వానించామని తెలిపారు. గతంలో దక్షిణం నుంచి ఉత్తరం వరకు (కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు) భారత్‌ జోడో యాత్ర అత్యంత ప్రభావవంతంగా, పరివర్త నాత్మకంగా జరిగిందని, ఇప్పుడు తూర్పు నుంచి పడమర వరకు (మణిపూర్‌ నుంచి ముంబయి వరకు) భారత్‌ జోడో న్యారు యాత్ర చేపట్టినట్టు చెప్పారు.
‘పార్లమెంటులో ప్రజా సమ స్యలను లేవనెత్తడానికి ప్రభు త్వం మాకు అవకాశం ఇవ్వలేదు. అందు కే కాంగ్రెస్‌ భారత్‌ జోడో న్యారు యాత్రను చేపడుతున్నది. మేం ఈ వేదిక (యాత్ర) ద్వారా ప్రజల సమస్యలను వింటాం’ అని ఖర్గే అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ప్రతిపక్ష నేతలను బెదిరించేం దుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్ను శాఖ వంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.కొత్త కార్మిక చట్టాలు, క్రిమినల్‌ చట్టాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు నియంతృత్వ సంకేతాలను చూపుతున్నాయని ఖర్గే అన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని అన్నారు. ‘బీచ్‌లకు వెళ్తారు. అక్కడ స్విమ్మింగ్‌.. ఫోటో సెషన్‌ నడుస్తుంది. ఆలయ నిర్మాణ ప్రాంతంలో ఫోటోలు దిగుతారు. కేరళ, ముంబాయి వెళ్తారు. వెళ్లిన ప్రతిచోటా ఫోటోలు దిగుతూనే ఉంటారు. ఈ గొప్ప వ్యక్తి మణిపూర్‌కు మాత్రం వెళ్లరు’ అంటూ ప్రధానమంత్రి మోడీపై విమర్శలు చేశారు. జనవరి 22న జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇండియా ఫోరం కన్వీనర్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు…. ‘ఇది కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రశ్న’ అంటూ సమాధానం దాటవేశారు. కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ, తమకు ప్రజల వద్దకు వెళ్లడం మినహా మరో మార్గం లేదనే విషయం ప్రజలకు ఈ యాత్ర ద్వారా తెలియచేస్తామన్నారు. పార్లమెంటులో పలు అంశాలను లేవనెత్తాలని ప్రయత్నించినప్పటికీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనీ, 146 మంది ఎంపీలను పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటి సారని అన్నారు.2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జనవరి 14 నుంచి భారత్‌ జోడో న్యారు యాత్ర ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.