అకాల వర్షం…అపార నష్టం

– వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
– ఉన్నతాధికారులకు నివేదిస్తాం : ఏఓ
నవతెలంగాణ-ఇల్లందు
ఒక అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షంతో మండలంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్నదాతలనే కాకుండా సామాన్యులను సైతం కోలుకోలేని సమస్యలను సృష్టించింది. మండలంలోని రాఘబోయిన గూడెం, పోలారం, కొమరారం, మాణిక్యారం, చల్ల సముద్రం, మామిడి గుండాల తదితర మండలాలలో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంజనేయపురం గ్రామ సమీపంలో మొక్కజొన్న పంట నేల వాలింది. మరి కొన్ని రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో అన్నదాతలకు అపార నష్టం మిగిలింది. పంట చేతికి వస్తుందని ఆశతో ఉన్న సమయంలో నెల వాలిందని నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతు బన్స ఆవేదన వ్యక్తం చేశాడు.
విరిగిన విద్యుత్‌ స్తంభాలు : నేలకొరిగిన వృక్షాలు
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇల్లందు పట్టణం మండలంలోని గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఉరుములతో దద్దరిల్లింది. ఈదురు గాలాలతో అస్తవ్యస్తమైంది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మండలంలోని నెహ్రూ నగర్‌లో ఈదురు గాలులు వర్షం తీవ్రతకు విద్యుత్‌ స్తంభాలు వాలిపోగా కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. అదే మార్గంలో ఇల్లందు, మహబూబాబాద్‌ ప్రధాన రహదారిపై విద్యుత్‌ తీగలు చెట్టు పడిపోవడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సమీపంలోని కోళ్ల ఫారాలు మీద ఉన్న రేకులు ఎగిరిపోవడంతో ఈదురు గాలులు వర్షాల తీవ్రతకు కోళ్లు చనిపోయాయి. తీవ్రమైన ఈదురుగాలులతో పలు గ్రామాల్లో చెట్లు నేల కొరిగాయి. పట్టణంలోని మిషన్‌ స్కూల్‌ సమీపంలో ఒక మహిళ నిర్వహించుకునే చిన్న దుకాణం మీద చెట్టు పడిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పరిశీలించాం…ఉన్నతాధికారులకు నివేదిస్తాం : ఏఓ సతీష్‌
దెబ్బతిన్న పంటలను సోమవారం పరిశీలించామని మండల వ్యవసాయ శాఖ అధికారి పి.సతీష్‌ తెలిపారు. ముఖ్యంగా రాబోయిన గూడెం, నెహ్రు నగర్లలో వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని తెలిపారు. మొక్కజొన్న 70 ఎకరాలు, వరి 20 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేశామన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్టు తెలిపారు.