”అవకాశాలు ఆరుబయట… అవమానాలు ఇంట, వెంట”
స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా భారత రాజ్యాంగానికి వికలాంగులు ఆమడ దూరంలో ఉన్నారు. రాజరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యం వరకు అన్ని అవకాశాలకు వికలాంగులను దూరంగానే ఉంచుతున్నారు. వికలాంగులకు అవకాశాలు అవసరమా? లేదా? అన్నది చర్చనీయాంశం. పుట్టిన పిల్లవాడికి తల్లి పాలు ఎంత అవసరమో పుట్టిన ప్రతి మనిషికి కూడా అవకాశాలు అంతే అవసరం, అయినా నేటికీ ప్రభుత్వాలు అవకాశాల్లో కులానికి, మతానికి ఇచ్చిన ప్రాధాన్యత కులాలల్లో, మతాలల్లో ఉండే వికలాంగులకు లేదు.
”కుల, మతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో…” అన్న దాశరథి మాటకు మరొక మాట జోడిస్తే బాగుంటుంది. మనుషులతో పాటు రాజ్యాంగం కూడ కులమతాల సుడిగుండాలలో కొట్టుమిట్టాడుతుంది. రాజ్యాంగంలో ఉన్న ఏ ప్రాథమిక హక్కును కూడా భారతదేశంలో ఉన్న ఒక్క వికలాంగునికి సైతం వర్తించదన్న మాట నగ సత్యం. కాని రాజ్యాంగంలోని విధులకు సైతం వికలాంగులు బానిసలే.
భారతదేశంలో ఉన్న ప్రతియొక్క వికలాంగుడు నాలుగు అవకాశాలు లేక బాధపడుతున్నాడు.
1. రవాణా సౌకర్యం
2. సాంకేతిక సౌకర్యం
3. ఉపాధి అవకాశాలు
4. సమానత్వం
తెలుగు ఇరురాష్ట్రాలలో నేడు రోడ్డు విస్తీర్ణత విపరీతంగా పెరిగింది. వాహనాలు పెరిగినప్పుడు రోడ్ల విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉంది. కాని పాదచారులను మరిచి కేవలం వాహనదారులను మాత్రమే పట్టించుకుంటుంది. తద్వారా అనేక మంది సకలాంగులు రోడ్డు ప్రమాదాల వల్ల వికలాంగులు అవుతున్నారు. వికలాంగులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక రోడ్డు దాటి వంతెనలు జాతీయ రహదారులలో పట్టణాలలో ఖచ్చితంగా నిర్మించాలి.
సాంకేతిక పరిజ్ఞానం కేవలం ధనికులకు మాత్రమే కాకుండా పేదలకు, వికలాంగులకు కూడా చేరాల్సిన అవసరం ఉంది. నేడు పేదలకు, వికలాంగులకు ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే పాస్ ఇస్తున్నారు కాని మెట్రో, డీలక్స్, ఏసి బస్సులలో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. ఇటీవల వచ్చిన ఏసి బస్సుల్లో రెండు కాళ్ళు లేని వికలాంగుడు సైతం బస్సులో ఎక్కవచ్చు. మెట్రో, డీలక్స్, ఏసి బస్సుల్లో ప్రతి బస్ స్టాపును తెలియజేస్తుంది. తద్వారా అంధులకు చాలా సులువు. కాని ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోలేక పోతున్నారు. తప్పనిసరిగా వికలాంగులకు ఆర్డినరీ బస్సు పాసులతో పాటు ఇతరేతర బస్సులలో పాసును చెల్లేవిధంగా వెసులుబాటు కల్గించాలి.
”సాంకేతికం సంఖ్యల్లో… జ్ఞానం గంగలో”
అనేక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచీకరణలో వచ్చిన భారతదేశ వికలాంగులు మాత్రం ఆ విద్యకు నోచుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా వికలాంగుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంలేదు. నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న సమానత్వపు హక్కు అనే మాటకు ప్రభుత్వాలు నిర్వచనాన్నే మార్చేశాయి. సమానత్వం అన్న మాట కేవలం ఖద్దర్ బట్టకు మాత్రమే వర్తిస్తున్నది. ఆ ఖద్దర్ బట్టకు నేటికి కూడా వికలాంగులు అస్పృశ్యులుగానే మిగిలి పోతున్నారు. కనుక నిజమైన అంబేద్కర్ వాదులు, ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
”గతకాలం మేలు వచ్చు కాలము కంటే” అన్న మహాకవి నన్నయ మాటలు అక్షరాల సత్యం. నేడు వికలాంగులు సైతం ఉపాధ్యాయ వృత్తి మొదలుకొని ఐ.ఏ.ఎస్ రంగాల వరకు కూడా ఉండటం గర్వకారణం. ఇదంతా కేవలం సాంకేతిక పరిజ్ఞాన భిక్ష మాత్రమే. దీనితో పాటు సమాజం, ప్రభుత్వ సహకారాలు ఎంతైనా అవసరం. నేడు అనేక రంగాలలో వికలాంగులకు ఉపాధి అవకాశం ఇవ్వడం లేదు. ఉదాహరణకు పోలీసు రంగం, ఆర్.టి.సి ఇంకా అనేక రంగాలు వికలాంగులను చిన్నచూపు చూస్తున్నాయి. వారితో పని చేయించుకోకపోవడం మీ మానసిక లోపం తప్ప వారి లోపం కానేకాదు. ప్రతిరంగంలో మానవ వనరుల అవసరం.
”సమానత్వం సంతలో సరకు”
నేడు ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే మాట సమానత్వం. వార్డు మెంబర్ నుండి మొదలుకొని ఎం.పి. వరకు కులం, మతమే సమానత్వమై రాజ్యమేలుతుందే తప్ప సామాన్య ప్రజానికానికి సమానత్వం అన్నది కొనుక్కుందామన్నా దొరకని సరుకైంది. సామాన్య ప్రజానికానికి అందని సమానత్వపు సరకు వికలాంగులకు దరిదాపుల్లో కూడా లేదన్న మాట వాస్తవం. విద్య, వైద్య, ఉపాధి, రాజకీయాలు, ఆర్థిక, శాస్త్రీయ సాంకేతిక రంగాలలో ఇలాంటి అవకాశాలన్నింటిని ప్రభుత్వం దూరం చేస్తుంది.
రాజ్యాంగం సైతం వాసన చూడని వికలాంగుల అస్థిత్వాన్ని వికలాంగులమైన మనమే చైతన్యమై అన్ని ఫలాలను వీలైతే సానుకూలంగా, లేదంటే ఉద్యమ రూపంలో పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి అవకాశాలన్నీ కేవలం కులాలకు, మతాలకు దక్కుతున్నదనే మాటను విడిచి మన వాటా మనం మూడు శాతం నుండి కనీసం పది శాతం వాటాని సాధించుకోవాలి.
సామాజిక ఉద్యమాలకు సాహిత్యమే ఆత్మ. ఆ సాహిత్యం, కాలం, సందర్భాన్ని బట్టి కొన్ని వివాదాలకు వజ్రాయుధంగా మారుతుంది. అనేక సామాజిక అంశాలకు పరిష్కారం కూడా చూపుతుంది. ఇలాంటి సాహిత్యంలో వర్ణము, వర్గము, లింగభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యారు. సామాజిక అవగాహన, స్పృహ, చైతన్యం, మార్పు లాంటివాటికి సాహిత్యమే ప్రధాన జ్ఞానదీపం. కాలాన్ని సందర్భాన్ని పరిస్థితులకనుగుణంగా ప్రతిదానికి మద్దతుగా నిలిచేది కూడా సాహిత్యమే. ఈ సాహిత్యాన్ని అనేక కోణాలలో అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తులు రాసిన సాహిత్యం, శక్తులుగా వచ్చిన సాహిత్యం, వాదాలుగా మారిన సాహిత్యం, సమాజాన్ని మార్చిన సాహిత్యం, కుల సాహిత్యం, మతసాహిత్యం, లింగ సాహిత్యం, ప్రాంతీయ సాహిత్యం ఇంకా అనేకం. ఇలా సాహిత్యంలో ప్రతీ అంశాన్ని వ్యక్తిగత అవగాహన మేరకు లేదా హేతువాద దృక్పథంతో సాహిత్యాన్ని అన్వేషించాలి.
ప్రపంచ సాహిత్యం అంతా మనిషే ప్రధాన వస్తువు అయితే ఒక తెలుగు సాహిత్యం మాత్రం మతంతో ప్రారంభమై కులంతో నడుస్తూ ఉన్నది. నాటి మహాభారతం నుండి మొదలుకొని నేటివరకు అనేక సాహితీ ప్రక్రియలు వెల్లివిరుస్తూనే ఉన్నాయి. పూలే, అంబేద్కర్ ప్రభావం చేత సామాన్యులు కూడా అక్షరాస్యులై వాస్తవ చరిత్రను సాహిత్య విలువలను అవగాహన చేసుకుని వాటి మూలాలను అన్వేషించడం ఆరంభించారు. సాహిత్యంలో, సమాజంలో అగ్రవర్ణస్తులు దళితులపై, స్త్రీలపై ఇంకా చెప్పాలంటే వికలాంగులపై హైందవ మత ఆధారంగా నిందారోపణ చేసిన సాహిత్యమే ఎక్కువ మనది. అటువంటి సందర్భంలో గౌతమ బుద్ధుని బోధనలు, జ్యోతిబాపూలే, సావిత్రిభాయి పూలే, మార్క్స్, అంబేడ్కర్ ప్రభావాల చేత తెలుగు సాహిత్యంలో హేతుబద్ధమైన వాదాలు ఉద్యమంలా వచ్చాయి. అలా స్త్రీ వాదం, దళిత వాదం, బహుజన వాదం, మైనారిటీ వాదం, ఇప్పుడిప్పుడే వస్తున్న వికలాంగ వాదం. వీటిలో కొన్ని వాదాలు సాహిత్యోద్యమంలా రాగా మరికొన్ని సాహిత్య ఉద్యమంతో పాటు సామాజికోద్యమంగా కూడా వచ్చాయి.
ఆధునిక కాలంలో వచ్చిన ప్రతీ సాహిత్య ప్రక్రియ ఒక చైతన్యాన్ని చూపించింది. ప్రతీ సాహిత్య ప్రక్రియలోనూ నేను, నా వాదం, మా వాదం, మా మూలాలు, మా అస్తిత్వం, మా చైతన్యం అన్న కోణాలను అన్వేషిస్తున్న సమయమిది. ఈ సమయంలో రాజ్యాంగంలో భాగస్వామ్యం లేని, సాహిత్యంలో స్థానం కలిగిన వికలాంగుల సాహిత్యాన్ని వికలాంగవాదాన్ని వికలాంగులే స్పృశించి రాసిన సాహిత్యాన్ని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాస్తవానికి విద్యకు, సాంస్కృతిక, సాంఘిక ఆచారాల వల్ల ఈ సమాజానికి ఎంతో దూరంగా జీవితాన్ని గడిపినటువంటి బ్రతుకులు వికలాంగులవి. హక్కులూ, ఆత్మగౌరవం, రాజ్యాంగంలో భాగస్వామ్యం లాంటి ప్రధాన అంశాలకే వీరిని సమాజం దూరం చేసింది. మతాచారాల పేరిట, సకలాంగుల అహంకారానికి అనేక వికలాంగ జీవితాలు నేల రాలిన సందర్భాలు అనేకం. ఇటువంటి సందర్భంలో కాలు, చేయి లేని వికలాంగుడు, కళ్లు లేని అంధుడు, కలాన్ని పట్టి గళాన్ని వినిపించే సాహిత్య నేర్పు ఉన్నదా? సాహితీ ప్రక్రియల్లో వీరి ప్రయాణం అసలు సాగిందా..? తెలుగు సాహిత్యానికి ఆద్యం అయిన పద్య సాహిత్యం మొదలుకొని నేటి వచన సాహిత్యం వరకు ఆ వాసన వీరికేమయినా ఉందా? అని ప్రశ్నిస్తే నిక్కచ్చిగా అవును అనే సమాధానం దొరుకుతుంది. వికలాంగులు సైతం అందుడైన సర్ లూయిస్ బ్రెయిల్, బహుళ వైకల్యం కల్గిన హెలెన్ కెల్లర్, సూరదాస్, కదలలేని కాలజ్ఞాని స్టీఫెన్ హాకింగ్ లాంటి వారి చైతన్య మార్గాల్లో నేడు వికలాంగులు పయనిస్తున్న కాలమిది.
సమాజంలో ఉన్న ప్రతి వస్తువూ ఎవ్వరి సొంతమో, ఎవ్వరి విజయమో కాదు. అది ఎవ్వరు అందిపుచ్చుకుంటే వారిది. అలా సాహితీ సాగరంలో పయనించిన కవులెందరో ఉన్నారు. వారు వికలాంగులన్న విషయం మాత్రం ఎప్పుడూ, ఎక్కడా ఏ సందర్భంలోనూ వ్యక్తపరుచుకోలేదు. ఎందుకంటే సాహిత్యంపై వారికున్న ప్రేమ అటువంటిది. ఇంకా చెప్పాలంటే వికలాంగుల్లో కవులే కాక శతావధానులు, అష్టావధానులు కూడా ఉన్నారు. వారిలో 19 వ దశకంలోనే అంధుడైన డోకూరు బాల బ్రహ్మచారి, పాలమూరు జిల్లా వాస్తవ్యులు. గద్వాల్ సంస్థానంలో శతావధానిగా కీర్తిని ఘడించాడు. ఇంకా అనేకమంది వికలాంగ, అంధకవులు పద్యసాహిత్యంలో అనేక కృతులను, శతకాలను రాసారు. నేటికాలంలో ఆచార్య జక్కంపూడి మునిరత్నం (అం), రుద్రాక్షల మఠం ప్రభులింగ శాస్త్రి (శా.వి), డా||డి.శ్యాంసుందర్ లాంటి పద్యకవులతో పాటు ఇంకా వెలుగులోకి రాని అనేకమంది ఉన్నారు.
సాహిత్యం అనేది ప్రకృతి లాంటిది. ఎవ్వరు ఎంత అందిపుచ్చుకుంటే అంత అందుకోగలరు. అయినా సాహిత్యానికి సమాజాన్ని చైతన్యపరిచే జ్ఞాన చకువు అవసరం కానీ అవయవాలు అవసరం కాదు. అందుకే నాటి నుండి నేటి వరకు అనేక మంది వికలాంగ కవులు తెలుగు సాహిత్యంలో వారి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సాహిత్యం అంటేనే ఆనందం, ఉపదేశం ఈ రెండింటితో పాటు చైతన్యానికి ప్రాధాన్యతనిస్తుంది ఆధునిక సాహిత్యం.
ఈ క్రమంలో తెలుగు సాహిత్యంలో స్త్రీ, దళిత, బహుజన, మైనారిటీ కవులకు దక్కినంత గౌరవం వికలాంగ రచయితలు, విమర్శకులు, పాత్రికేయులు, సాహితీవేత్తలకు దక్కలేదు. అందుకే వికలాంగులు రచించిన సాహిత్యంపైన పరిశోధనలు రావలసిన, చేయాల్సిన అవసరం కల్గింది. సాహిత్యంలో ఉనికి అన్న విషయాన్ని పక్కన పెడితే వికలాంగులు రచించిన రచనల్లో ఇటు శైవ, వైష్ణవ భక్తి వాదాన్ని; అటు సాంప్రదాయ, ఆధునిక, సామాజిక అస్థిత్వవాద సాహిత్యాన్ని నిరంతర చైతన్య స్రవంతిలా సాహిత్యాన్ని విరివిగా రచించిన వికలాంగ కవులు అనేకమంది ఉన్నారు. ఆధునిక ప్రక్రియల్లో ఒకటైన నవల మోపురి పెంచల నరసింహం (అం) రచించిన వెన్నెల వర్షం, కథాసాహిత్యంలో అవిటి కథలు సంపంగి శంకర్ (శా.వి), వేముల ఎల్లయ్య, మేము సైతం డా. అసిలేటి నాగరాజు (అం), డా||చిక్కా హరీష్ కుమార్ (అం), శివలెంక నాగ ఉదయలక్ష్మి (శా.వి), సత్యవాడ సోదరీమణులు (అం) వీరు రాసిన సాహిత్యం సమాజ చైతన్యానికి ఎంతో ఉపయోగపడింది.
ఆధునిక సాహిత్యంలో వచనకవిత్వానికి ఉన్న ప్రత్యేకత అందరికి తెలిసిందే. ఆ ప్రక్రియలో సైతం వికలాంగులు రాణించారు, రాణిస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయుడైన బిల్లా మహేందర్ (శా.వి) ప్రత్యేక ప్రతిభావంతులపై కవితా సంకలనం, నల్లేల్ల రాజయ్య (శా.వి), జ్యోత్స్న ఫణిజ, ముళ్లపూడి సత్యగణేష్ (శా.వి) లాంటి అనేకమంది వికలాంగ కవులు సమాజ చైతన్యానికై వారు కలాన్ని పట్టి అనేక సాహిత్య సృష్టిని చేశారు. వ్యాసం, నాటకం, పాట లాంటి ప్రతీ ప్రక్రియలోనూ వారి రచనలు ఉన్నాయి. వికలాంగ కవులు కొందరే ఉన్నా వారు స్పృశించిన సాహిత్యం మాత్రం ఎక్కువగానే ఉన్నది.
డా||చిక్క హరీష్ కుమార్, 9885159138
అసిస్టెంట్ మేనేజర్ (బ్యాంక్ ఆఫ్ బరోడ)