వాడని స్కూల్‌ గ్రాంట్‌ నిధులు రూ.43.98 కోట్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు స్కూల్‌ గ్రాంట్‌ నిధులు రూ.43.98 కోట్లు వినియోగించలేదు. ఇందులో బాలికల హాస్టళ్ల కోసం ఉన్న నిధుల్లో రూ.1.23 కోట్లు, కేజీబీవీల్లో రూ.12.85 కోట్లు, యూఆర్‌ఎస్‌లో రూ.19.92 లక్షలు, పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల్లో రూ.29.70 కోట్లు కలిపి మొత్తం రూ.43.98 కోట్ల నిధులున్నాయి. మొదటి విడతలో ప్రభుత్వం మంజూరు చేసినా పాఠశాలల్లో వాటిని ఖర్చు చేయకపోవడం గమనార్హం. దీంతో రెండో విడత నిధుల విడుదల ప్రక్రియ జాప్యం జరుగుతు న్నదని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల్లో ఉన్న గ్రాంట్‌ను వెంటనే చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అయితే నిధులు వినియోగించని జిల్లాల్లో అత్యధికంగా రంగారెడ్డిలో రూ.22.13 కోట్లు, మహబూబాబాద్‌లో రూ.2.72 కోట్లు, వికారాబాద్‌లో రూ.1.88 కోట్లు, ఖమ్మంలో రూ.1.33 కోట్లు, నాగర్‌కర్నూల్‌లో రూ.1.24 కోట్లు, నిర్మల్‌లో రూ.1.20 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెంలో రూ.1.03 కోట్ల చొప్పున ఉన్నాయి. నిధులు వినియోగించని జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నవి జోగులాంబ గద్వాలలో రూ.15.37 లక్షలు, యాదాద్రి భువనగిరిలో రూ.15.38 లక్షలు, ములుగులో రూ.15.55 లక్షల చొప్పున ఉన్నాయి.