అన్‌ ‘వాల్యూ ఎడ్యుకేషన్‌’

An 'Value Education'నాడు పాఠశాల విద్యలో గుణాత్మక మార్పుకు దోహదపడటమే ప్రధాన లక్ష్యంగా…కులమతాలకు అతీతంగా మానవతా విలువలకు పట్టంకట్టే ‘వాల్యూ ఎడ్యుకేషన్‌’ను స్వప్నించింది ఎన్సీఈఆర్‌టీ (జాతీయ విద్యా పరిశోధన మండలి). కానీ, నేడు అదే ఎన్సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో అహేతుక మార్పులను తలపెడుతోంది. తాజాగా ఎన్‌సీఈఆర్‌టీ మార్కెట్‌లోకి విడుదల చేసిన 12వ తరగతి రాజనీతి శాస్త్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మార్పులు చేసింది. అయితే దీనిపై ఎన్సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ స్పందిస్తూ..”దేశంలో గుజరాత్‌, బాబ్రీ సహ ఎన్నో అల్లర్లు జరిగాయి. వాటన్నింటిని విద్యార్థులకు ఎందుకు బోధించాలి. పెద్దయ్యాక ఎలాగు తెలుసుకుంటారు. ఏడాదికోసారి సిలబస్‌ సవరిస్తూ ఉంటాం. అది సహజ ప్రక్రియ. దానికెందుకింత గగ్గోలు” అని ప్రశ్నించారు. వాస్తవానికి తాజాగా సవరించిన పాఠ్యాంశాలే ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నాయి. చరిత్రను వక్రీకరిస్తూనే వారి చర్యను సమర్ధించుకున్న సక్లానీ వ్యాఖ్యలు విద్యావేత్తలను, మేధావులను మరింత నిర్ఘాంతపరుస్తున్నాయి.
1528లో మీర్‌ బాబరు బాబ్రీ మసీదును నిర్మించారు అని పూర్వ పాఠంలో ఉండగా, దానిని శ్రీరాముని జన్మభూమిలో 1528లో ఇది నిర్మాణమైందంటూ సవరించింది ఎన్‌సీఈఆర్‌టీ. బాబ్రీ మసీదు అని రాయాల్సి వచ్చిన చోట ‘మూడు గుమ్మటాల కట్టడం’ అని పేర్కొంది. అంతే కాదు అయోధ్య గురించి గతంలో నాలుగు పేజీలు ఉన్న పాఠాన్ని రెండు పేజీలకు కుదించింది. హిందువుల పూజల కోసం మసీదు తలుపులు తెరవాలని 1986లో ఫైజాబాద్‌ జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు మత హింసకు దారితీశాయని పూర్వ పాఠంలో ఉండగా, దాన్నంతా దాదాపుగా తొలగించారు. ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును పూర్తి పాఠంగా కొత్తగా చేర్చారు. ఇలా కత్తిరింపులు, కుదింపులు చేసి సవరించిన 12వ తరగతి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకం మార్కెట్‌లోకి రాగానే గగ్గోలు రేగింది. ప్రజల సులోచనాలను పగలగొట్టడం, వారి కళ్లకు గంతలు కట్టడం, మెదడుకు పదును పెట్టే అంశాలను తుడిచిపెట్టడం వంటివన్నీ అటువంటి ఏలికలకే సాధ్యం. విద్యార్థులను పరిపూర్ణ విజ్ఞాన వంతులుగా చేసే చదువును ఉత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దాల్సిన ఎన్సీఈఆర్‌టీ చాకచక్యం, ప్రభు పక్షపాతం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
‘చరిత్రను విస్మరించే వారు చరిత్రను నిర్మించలేరు’ అని అన్న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మాటలు అక్షర సత్యాలు. గతకాలపు చరిత్రను తుడిచేసి, తమకనుకూలమైన చరిత్రను తిరగరార ుుంచుకునే వాళ్లు నియంతలు. వీళ్లంతా హీన చరితులుగా కాలగర్భంలో కలిసిపోతారు. ఇది చరిత్ర చెబుతున్న పాఠం. చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు. చరిత్ర పునాది మీదనే వర్తమానం, భవిష్యత్తు కొనసాగుతుంది. ఈ భవిష్య గమనాలను తమ ఆలోచనల చుట్టూ తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్లు గత కాలపు వాస్తవాలపై మసిపూసే పనికి పూనుకుంటున్నారని సక్లానీ వ్యాఖ్యలు మరోసారి రుజువు చేస్తున్నాయి.
ఇప్పటికే జాతిపిత మహాత్మాగాంధీ, విప్లవ వీరుడు భగత్‌ సింగ్‌ నిర్వహించిన జాతీయోద్యమ సంఘటనలను, వారి జీవిత విషయాలను సిలబస్‌ నుండి తొలగించింది. మనదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఏ పాత్రలేని బీజేపీ, సంఫ్‌ు పరివారం, కీలక భూమిక పోషించిన వారిని చరిత్ర నుండి తొలిగించే పనికి సిద్ధమైంది. క్రమేనా హంతకుల చరిత్రను, ఉదాత్త నాయకులుగా సిలబసులో ప్రవేశపెట్టినా ఆశ్చర్యం పడవలసింది లేదు. విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు ఆదాన ప్రదానాలతో భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న నేటి సమాజాన్ని మత ప్రాతిపదికన విడదీయాలన్న ఆలోచనలో భాగమే ఈ చర్యలన్నీ. ఈ వికృత చేష్టకు పాల్పడుతున్న వారి పన్నాగాలను పసికట్టి, పనిపట్టవలసివుంది!
విద్యలో కాషాయీకరణ, మతోన్మాద ధోరణులు పెరగడమంటేనే హీన సంస్కృతిని పెంచి పోషించడమే. ఒక ప్రగతిశీల రాజ్యం అవతరణకు శాస్త్రీయ దృక్పథం గల ప్రజలు అవసరం. అందుకే శాస్త్రీయ పురోగతిని సాధించడం మన రాజ్యాంగ లక్ష్యాలలో ఒకటిగా నిర్దేశించుకున్నాం. కానీ ఏడున్నర దశాబ్దాలుగా లక్ష్యానికి చేరువ కాలేకపోతున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడం సమాజానికి ప్రమాదం. ఇలాంటి అనుచిత మార్పులు నాణ్యమైన విద్యా పునాదుల్లేని నవతరాన్ని తయారు చేస్తాయనడంలో సందేహం లేదు. అసత్యాలు, అర్ధసత్యాల్నే పాఠాలుగా నిర్ణయిస్తే సమకాలీన ప్రపంచంతో మన పిల్లలు ఎలా పోటీ పడగలరు? దేశ భవితకు చుక్కానులుగా ఎలా ఎదుగుతారు?
”నేడు భారతదేశం అజ్ఞానం, మత ఛాందసం, మతోన్మాదాల అగాధంలోనూ, అన్ని రకాల జడ పదార్థాల పూజల్లోనూ మునిగిపోయి ఉంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి దేశాన్ని ఏ శక్తి బయటపడేయగలదు? మన జీవితంలో ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నింటినీ ఒక్క దెబ్బతో ఏ శక్తి పరిష్కరించగలదు? అంటే… అదే విజ్ఞాన శాస్త్రం” అని సర్‌ సి.వి.రామన్‌ చెప్పిన మాటలు అప్పటికంటే నేటి పాలకులు, ముఖ్యంగా ఎన్సీఈఆర్‌టీ బుర్రకు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది.