– యోగి సర్కార్‌పై అఖిలేశ్ వ్యంగ్యాస్త్రాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బిజెపిలో ముసలం నెలకొంది. పార్టీలో చీలికలు ఖాయమంటూ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన పోస్టు ఆసక్తి రేపుతోంది. ‘వర్షాకాల బొనాంజా..వంద మందిని తీసుకురండి..కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయండి’ అంటూ ఆయన పోస్టు పెట్టారు. 2022 మధ్యలోనూ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉద్దేశించి అఖిలేశ్ దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘ముఖ్యమంత్రి కావాలన్నది కేశవ్ కల. ఆయన 100 మందిని తెస్తే ఆయనకు మా పార్టీ మద్దతిస్తుంది’ అని అప్పట్లో అఖిలేష్ పోస్టు చేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో యుపిలో బిజెపి ఘోర పరాభవాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఓటమికి మీరంటే మీరే కారణం’ అంటూ అధికార పార్టీలో చిచ్చు రేగుతోంది.