సెప్టెంబర్ 5 వచ్చిందంటే చాలు పిల్లల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఎంతో అందంగా ముస్తాబై పిల్లలే ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ స్వయం పాలనా దినోత్సవం జరుపుకుంటారు. తమ పాఠశాలలోని ఉపాధ్యాయులకు చిన్నచిన్న కానుకలు ఇచ్చుకుంటారు. వారం రోజుల నుంచీ సాధన చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమ గుండెల్లో ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవాన్ని, తమ టీచర్ల పట్ల అంతులేని ప్రేమను పెంచుకుంటారు. భవిష్యత్తులో తాము కూడా మంచి టీచర్లు అవ్వాలని కోరుకుంటారు. అసలు ఇలా ప్రతీ ఏటా ప్రత్యేక దినోత్సవాలను జరుపుకోవడం ఏందుకు.. అని ప్రశ్నించుకుంట.. మానవీయ విలువలు పలుచనైపోతూ, మానవ సంబంధాలకు, అనుబంధాలకు అర్థం మారిపోతున్న ఈ రోజుల్లో ఇలా ప్రత్యేక దినోత్సవాలు జరుపుకోవడం చాలా అవసరమే అనిపిస్తున్నది.
దేశవ్యాప్తంగా అందరూ ఒకే రోజున అమ్మలను, నాన్నలను.. మహిళలను, డాక్టర్స్‌ను ఇంజనీర్లను.. ప్రత్యేకంగా గుర్తుచేసుకుని గౌరవించడం అవసరం. తద్వారా మన బాధ్యతలను, బంధాలను మరోసారి గుర్తుచేసుకున్న వాళ్ళమవుతాం. వీటికి వేదికలు పాఠశాలలైతే విద్యార్థులు అందుకునే స్ఫూర్తి చాలా గొప్పది. ఎప్పటికప్పుడు ఆయా ప్రత్యేక దినాల సందర్భాన్ని, దాని విశిష్టతను వివరిస్తూ ఆయా దినోత్సవాలను ఒక వేడుకగా జరపడం ద్వారా.. పాఠశాల విద్యార్థుల్లో వీటి పట్ల అవగాహన కలుగజేసి, నూతన ఉత్సాహాన్ని ప్రేరణను కలగజేస్తాయి. అసలు పిల్లల మధ్య ఏ వేడుకైనా కడు రమ్యమే కదా!
మన భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 5న మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 1962 మధ్య.. భారత ఉప రాష్ట్రపతిగా, 1962 నుంచి 1967 వరకు భారతదేశ రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. 1947లో UNESCOలో భారత ప్రతినిధిగా వున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప మేధావి. ఆంధ్ర, బెనారస్ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌గానూ వ్యవహరించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారు. ప్రతిష్టాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో బోధించిన తొలి భారతీయ వ్యక్తి. విద్యార్థులంటే వారికి ఎనలేని ప్రేమ. విద్యార్థులు కూడా వారిని అమితంగా అభిమానించేవారు. ఈ సందర్భంగా మైసూర్ మహారాజా కాలేజీలో జరిగిన ఓ సంఘటనను మనం గుర్తు చేసుకుందాం. రాధాకృష్ణన్ మైసూర్‌లోని మహారాజా కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కొంతకాలం తర్వాత అక్కడి నుంచి బదిలీ అయ్యారు. విద్యార్థులంతా వారికి మర్చిపోలేని విధంగా వీడ్కోలు ఇవ్వాలనుకున్నారు. రాధాకృష్ణన్‌ని గుర్రంపై ఊరేగించాలనికుని వారిని బలవంతంగా ఒప్పించారు. అయితే సమయానికి గుర్రం కనిపిచలేదు. అప్పుడు విద్యార్థులు ఆయన్ని వారి భుజాలపై ఊరేగింపుగా మోసుకొని రైల్వేస్టేషన్ వరకు తీసుకెళ్లారు. అంతగా విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను అభిమానించేవారు. వారి జన్మదినం ఘనంగా నిర్వహించాలనుకున్న వారికి గురువులందరినీ గౌరవించాలని బోధించిన వ్యక్తి. అందుకే వారి జన్మదినాన్ని గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇలా ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీని మనం ఎంతో గౌరవించే గురువులను మరోసారి గౌరవించే రోజుగా.. గురు పూజోత్సవం దినంగా జరుపుకుంటున్నాం.
నాటి గురువులు
ఒకనాటి గురువులు ఎంతగానో గౌరవించబడ్డారు, పూజించబడ్డారు. గురువులు అంటే వేతనం తీసుకుని ఒక్కో తరగతికి ఒక్కో గంట పాఠం చెప్పేవారు కాదు. గురువు నివాసమే విద్యాలయంగా వుండేది. గంట కొట్టగానే టీచరూ, పిల్లలూ.. ఇళ్లకు మళ్లడం కాకుండా నాటి గురుకులాలు నిత్య విద్యాలయాలుగా వుండేవి. విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం, బట్టీ పట్టి పరీక్షలు రాయడం మాత్రమే కాదు.. ఎన్నోరకాల శాస్త్రాల బోధన ఉండేది. గురువుల చెంత విద్యార్థులు శిష్యరికం చేసేవారు. గురువును తల్లి, తండ్రి కంటే ఎక్కువ గౌరవించి విద్యను అభ్యసించేవారు. గురువులు కూడా శిష్యులను కేవలం విద్యార్థులుగా మాత్రమే చూడకుండా తమ కన్నపిల్లల కన్నా ఎక్కువగా చేరదీసి ఆదరించేవారు వారు. శిష్యులలో వున్న వ్యక్తిగత ప్రతిభ గుర్తించి వారికి అనేక రకాల విద్యలను నేర్పేవాళ్ళు. ఆ కాలాలు మారాయి. ఓనాటి మెకాలే విద్యావిధానం బ్రిటీష్ వారికి అవసరమైన ఉద్యోగులను తీర్చి దిద్దే విద్యావిధానమే అయ్యింది. స్వాతంత్రానంతరం జాతీయ విద్యా విధానం అయితే వచ్చింది రావాల్సినంత మార్పు రాలేదు.
గురు శిష్యుల సంబంధాలు
తల్లిదండ్రుల తర్వాత పిల్లలు ఎక్కువకాలం గడిపేది గురువుల వద్దనే. టీచర్లు కేవలం అక్షర జ్ఞానం కలిగించడమే కాకుండా.. పిల్లల నడక, నడత.. ఇట్లా అన్ని విషయాల్లో బాధ్యత వహిస్తారు. పిల్లల వ్యక్తిగత శుభ్రత, సమయపాలన, మాట తీరు, మన్ననా ఇవన్నీ క్రమశిక్షణలో భాగమే. చదువుతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడంలో పిల్లలపై తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఉపాధ్యాయులకు తెలియని విషయమంటూ ఉండదని పిల్లలు నమ్ముతారు. ఎవరు ఎన్ని చెప్పినా తమ టీచర్లు చెప్పిందే నిజమని విశ్వశిస్తారు. వారి నుంచి అత్యన్న ప్రమాణాలను ఆశిస్తారు. కేవలం పిల్లలే కాదు తల్లిదండ్రులు, సమాజం కూడా ఉపాధ్యాయులను అంత ఎత్తున నిలబెట్టి వారి నుంచి తమ పిల్లలకు ఉన్నత విజ్ఞాన ప్రమాణాలు అందాలని, వారినుంచి సత్ప్రవర్తనను అలర్చుకుని క్రమశిక్షణతో మెలగాలని ఆశిస్తారు.
సమాజం చూపు గురువులవైపే
విద్యార్థులు ఎప్పుడు, ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా ‘ఇవేనా మీ చదువులు?’ అంటారు. పిల్లల చదువులకే కాదు, సమాజంలో ఎక్కడ ఏ అనర్థాలు జరిగినా.. వారి ప్రవర్తనకు ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ ‘మీ ఉపాధ్యాయులు మీకేమి నేర్పారు?’ అని అడుగుతారు.. ‘గురువులు సరైన విలువలు నేర్పలేదని’ ఆరోపిస్తారు. సమాజంలో ఏ వ్యక్తులు ఎట్లా ప్రవర్తించినా వారిని చూసీ చూడనట్లు వదిలేస్తుందేమోగానీ ఓ ఉపాధ్యాయుడు ఏదైనా పొరపాటు చేస్తే ఎంత మాత్రం అంగీకరించరు. ఇలా ఉపాధ్యాయుల నుంచి సమాజం సమున్నతమైన విలువలను ఆశిస్తుంటుంది. సత్ప్రవర్తనను కోరుతుంది. ఇక ఉపాధ్యాయులే సక్రమంగా ప్రవర్తించకుంటే.. అది క్షమార్హం కాదు. ఉపాధ్యాయులు వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తూ సత్ప్రవర్తన కలిగి ఉండడం ఎంతో అవసరం.
ఉపాధ్యాయులే బాధ్యత వహించాలి
అసలు ఉపాధ్యాయ వృత్తి అంటేనే ఒక ధవళ వస్త్రధారణ వంటిది. ఎందుకంటే ఆ వస్త్రాలపై ఏ చిన్న మరక పడినా స్పష్టంగా అందరికీ కనిపిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి కూడా అలాంటిదే. ఉపాధ్యాయులు జీవిత పర్యంతం తమ వృత్తికి ఏ చిన్న కళంకం అంటకుండా జాగరూకతతో ప్రవర్తించాల్సి ఉంటుంది. పిల్లలు ఏది వింటారో అది అంటారు, ఏది చూస్తారో అది చేస్తారు. ఉపాధ్యాయుల వ్యక్తిత్వం, వారి ప్రవర్తనా, వారి అలవాట్లు, మాట తీరు పిల్లలను ప్రభావితం చేస్తుంది. విద్యార్థులంటే రేపటి పౌరులు, వారే భవిష్యత్ మేధావులు. పిల్లల ప్రవర్తనకు పరోక్షంగా ఉపాధ్యాయులే బాధ్యత వహించాలి. ఉపాధ్యాయ వృత్తి వేతన సంబంధమైన ఉద్యోగం అయినప్పటికీ, ఈ వృత్తిని కేవలం ఉపాధి పొందుతున్న ఉద్యోగంగా భావిస్తే న్యాయం చేయలేరు. పిల్లలను ప్రేమించలేని వాళ్ళు.. ఉపాధ్యాయ వృత్తిలో మనలేరు. పిల్ల మనో వికాసానికి, మేధో వికాసానికి కృషి చేయవలసిన బాధ్యత గల ఉద్యోగం ఉపాధ్యాయ వృత్తి. ఇది ఎంతో ఇచ్ఛా పూర్వకంగా, మనః పూర్వకంగా చేయవలసిన పవిత్రమైన వృత్తి. అత్యున్నత గౌరవాన్ని అందుకోవాల్సిన ఉపాధ్యాయుల పరిస్థితి రోజురోజుకీ మారిపోవడానికి కారణాలను ప్రస్తుత ఉపాధ్యాయులపై వున్న ఆరోపణలను ఓసారి పరిశీలిద్దాం.
ప్రస్తుత ఉపాధ్యాయ ఉద్యోగ స్థితి
గతంలో ఉపాధ్యాయుల బాధ్యతలు పిల్లకు విద్య నేర్పడం, పాఠశాలను సక్రమంగా నిర్వహించడం వరకే పరిమితమై ఉండేవి. పాఠశాల పర్యవేక్షణ అంటే.. ప్రధానంగా పిల్లల విద్యా సామర్థ్యాల పర్యవేక్షణ మాత్రమే. ఇప్పుడు ఉపాధ్యాయుల బాధ్యతలు పెరిగాయి. ఉపాధ్యాయులు అనేక భోదనేతర బాధ్యతలను నిర్వహించవలసి వస్తున్నది. ఉద్యోగులందరిలో అధిక సంఖ్యలో వున్నది ఉపాధ్యాయులే కాబట్టి వారికి జనాభా గణన, ఇతర సర్వేలు, పల్స్ పోలియో, ఎన్నికల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించడంలో అనౌచిత్యం ఏమీ లేదు. అయితే మొదట్లో విద్యర్థులకు నెలకు ఒక్క రోజు బియ్యం పంపిణీ చేసేవారు. మధ్యాహ్న భోజన పథకం వచ్చాక బోధనతో పాటు వంటల దగ్గర, వడ్డనల దగ్గర సమయం కేటాయించవలసి వస్తున్నది. ఈ లెక్కలు, నిల్వలు పట్ల అప్రమత్తంగా వుండవలసి వస్తున్నది.
విద్యా కమిటీలు
పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగ్యస్వామ్యం కోసం ఏర్పరిచిన విద్యా కమిటీలు కొన్ని చోట్ల అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ రంగులు పులుముకుని ఉపాధ్యాయులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. మరి కొన్నిచోట్ల కమిటీ సభ్యులందరూ విద్యావంతులు కాకపోవడం వల్ల ఇది పాఠశాల విధి విధానాలలో గ్రామస్తుల భాగస్వామ్యంలా కాకుండా ఉపాధ్యాయుల మీద పెత్తందారి వ్యవస్థగా మారింది. నిర్బంధ విద్యా పథకం ద్వారా అందరికీ విద్య అందాలన్న సత్ సంకల్పంతో మారుమూల ప్రాంతాలలో కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు నెలకొల్పడం జరిగింది. అక్కడి జనాభాని బట్టి ఒక్కో ప్రాధమిక పాఠశాలలో కేవలం ఇరవైమంది పిల్లలే ఉన్న బడులూ వున్నాయి, నూటా యాభైకి పైగా విద్యార్థులున్న పాఠశాలలూ వున్నాయి. ఒక్క టీచర్ అయిదు తరగతులు, అయిదు సబ్జెక్టులు, మధ్యాహ్న భోజనాలు.. తనిఖీలు నిర్ణేతర రిపోర్ట్‌ల మధ్య ప్రభుత్వ ఉపాధ్యాయుని పాట్లు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య
ప్రభుత్వ ఠశాల్లో రోజురోజుకీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. కాస్త నిశితంగా ఆలోచిస్తే గతంలో ఒక్కో ఇంట్లో అయిదారుగురు పిల్లలు ఉండేవాళ్లు. అన్నీ ప్రభుత్వ పాఠశాలలే ఉండేవి. ఆ పిల్లలందరూ తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేవారు. ప్రైవేట్ పాఠశాలలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. వాళ్లు ఊరిలో ఉండే ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివిన తర్వాత వేరే ఊర్లకి వెళ్ళిపోతున్నారు. ఒక ఊరి జనాభాలో ఉండే బడి పిల్లలు సంఖ్య ఎంత ఉంటుంది? ఊరిలో వున్న పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలకే వస్తున్నారా? దీనికి తల్లిదండ్రుల అభిరుచి మారటం కారణమా? ఇప్పటి విద్యా, ఉద్యోగ అవసరాలు మారటం కారణమా? ప్రభుత్వ ఉపాధ్యాయులు కారణమా? అన్నది ఆలోచించాలి. గతంలో తమ పిల్లలను డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేయించేవారు. ఇప్పుడు బీటెక్, ఎంటెక్, వైద్య, ఇతర సాంకేతిక విద్య అభ్యసించాలని అనుకుంటున్నారు. ఈ ఉన్నత విద్యలన్నీ ఆంగ్ల మాధ్యమంలో ఉండడం వలన ప్రాథమిక స్థాయిలోనే మాధ్యమం మార్చడం అవసరమని భావిస్తున్నారు. మారుతున్న అనేక పరిస్థితులను పరిశీలించకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులపై నేరం మోపుతున్నారు. ఫలితంగా వున్న పాఠశాలల్లోనే ఆంగ్ల మధ్యమాలు వెలిశాయి. వాటి సామర్థ్యం అందరూ ఊహించిందే.
ఆంగ్ల మాధ్యమాల పట్ల ఆకర్షణ
కాన్వెంట్ స్కూల్లో చదువులు చాలా ఖర్చుతో కూడుకున్నవని. అవి అందరికీ చేరని ఫలాలని ఒకప్పుడు భావించేవారు. రాను రాను సందుకో పాఠశాలలు పెట్టడం, తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ఆంగ్లమాధ్యంలో చదివించాలన్న తపన పెరగడంతో ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పడిపోయి ప్రైవేట్ పాఠశాల్లో సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే, రిజిస్ట్రేషన్ చేయించకుండానే, ఒక పాఠశాలకి మరొక పాఠశాలకు కనీసం మూడు మైళ్ళ దూరం ఉండాలన్న నిబంధనను తుంగలో తొక్కి మరీ.. పుట్ట గొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. అయిదేండ్లు వస్తేగానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశం ఉండదు. కానీ రెండేండ్లకే క్రచ్‌లు, మూడేండ్ల నుంచే ప్లే స్కూల్స్ వెలసి ఇళ్లకు వచ్చిమరీ పిల్లలను బడుల్లో చేర్చుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం అంగన్ వాడీలను కూడా పాఠశాల ఆవరణలోనే ఉండేలాగా చూసి పిల్లలను ప్రాథమిక పాఠశాలకు అలవాటు చేస్తున్నారు. అయినప్పటకీ సామాన్య జనాన్ని ప్రైవేట్ పాఠశాల భవనాలు, పసుపు రంగు బస్సులూ, రంగు రంగుల డ్రెస్సులే ఆకర్షిస్తున్నాయి. వీటన్నిటికంటే చిలుక పలుకుల ఇంగ్షీషు మరింత ఆకర్షణగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాలు పెట్టినప్పటికీ అవి అంతగా ప్రతిభావంతగా సాగడంలేదు.
శిక్షణా తరగతులు జరుగుతున్నాయా?
అకస్మాత్తుగా తెలుగు మాధ్యమాల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు దానికి తగిన స్థాయిలో అవసరమయిన శిక్షణ ఇస్తున్నారా? రెండుమూడు రోజుల శిక్షణ తెలుగు మాధ్యపు టీచర్లను ఆంగ్ల విద్యా బోధకులుగా మార్చగలుగుతుందా? ఇలాంటి అనేక వ్యవస్థాగత లోపాలకు ఉపాధ్యాయులు బలవుతున్నారా లేక విద్యార్థులు బలవుతున్నారా? నిజంగానే ప్రయివేట్ ఆంగ్లమాధ్యమ బడులు అంత శక్తివంతంగా పనిచేస్తున్నాయా.. ఇవన్నీ మనముందున్న ప్రశ్నలే.. కనీసం రెండేండ్ల పాటు వేసవి సెలవులు, పండుగ సెలవుల్లో ఆంగ్ల భాష శిక్షణలతో విద్యా నైపుణ్యాలను పెంచవచ్చునేమో పరిశీలించాలి.
నేటి ఉపాధ్యాయులు…
ఒకప్పుడు సమాజంలో ఎంతో గౌరవం పొందిన ఉపాధ్యాయులు ఇవాళ సరైన గౌరవాన్ని పొందలేకపోవడానికి కారణం మారుతున్న విలువలు. కన్న తల్లిదండ్రులను, పెద్దలను, అయినవాళ్ళలనే పట్టించుకోని ప్రస్తుత కాలంలో విద్య నేర్పిన గురువులను గౌరవించే పద్ధతుల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. నాటి గురువులు పూజించబడ్డారు, గౌరవించబడ్డారు, మన జ్ఞాపకాలలో నిలిచిపోయారు. మరి నేటి గురువుల పరిస్థితి ఏమిటి? ఎప్పుడైతే ఒక వృత్తి వేతన సంబంధమైనది అవుతుందో అప్పుడు దాని విలువ మారుతుంది. విద్యార్థులతో నిరంతరం మమేకమవుతూ వారి అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడే గొప్ప ఉపాధ్యాయులెందరో ఉన్నారు. ఇలాంటి అనుబంధాలను ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువగా చూస్తాం. కిటికీల దగ్గర నిల్చుని ఫీజులు కట్టి వెళ్ళిపోయే ప్రైవేట్ పాఠశాలల కంటే.. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకి.. విద్యార్థుల తల్లిదండ్రులతో, ఊరి వారితో సత్సంబంధాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాలు తెలుసుకుని వారిని పట్ల శ్రద్ద తీసుకునే వీలు ఉంటుంది.
అరకొర సౌకర్యాలు
చాలా పాఠశాలల్లో ఇప్పటకీ లాబొరేటరీస్ ఉండవు, క్రీడా స్థలాలు ఉండవు, లైబ్రరీ సదుపాయాలు ఉండవు. ఇలా పాఠశాలల్లో ఉండవలసిన మౌలిక సదుపాయాలు మెరుగుపర్చబడకుండానే.. ముఖ్యంగా విద్యుత్తు, నెట్ సదుపాయాల పరికల్పన సరిగ్గా జరగకుండానే సాంకేతిక పరికరాల అవసరం వచ్చి పడింది. క్రమక్రమంగా వాటి వాడకం ఎక్కువయ్యింది కానీ ఎంత విలువైన సాంకేతిక పరికరాలైనా గురువు స్థానాన్ని పూరించలేవు. పాఠశాలలను, విద్యను ఒక అత్యవసర విభాగంగా ప్రభుత్వం గుర్తించకపోవడం అనేది నేటి విద్యా వ్యవస్థలో పెద్ద లోటు. ఒక టీచర్ ఉద్యోగ విరమణ పొంది వెంటనే ఆస్థనంలో తిరిగి మరొక ఉపాధ్యాయున్ని నియమించడం లేదు. అందువల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి?
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి చూస్తే.. ఆచార్యదేవోభవ, గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః అన్న శ్లోకంలో ఒక్క అక్షరం కూడా వారిపట్ల నిజం కాదేమో అనిపిస్తుంది. గురుబ్రహ్మలు తరగతి గదిలో కూర్చోకూడదు. హాజరు తీసుకుంటున్నప్పుడు, నోట్స్‌లు దిద్దుతున్నప్పుడు, కనీసం అలసటగా అనిపించినప్పుడు కూడా వాళ్ళు ఒక్క నిమిషం కూడా కూర్చోకూడదు. వాళ్ళని పర్యవేక్షిస్తూ జైలర్లలాగా ఆ పాఠశాల యాజమాన్యం గమనిస్తూనే వుంటుంది. ఉపాధ్యాయులు పిల్లలందరికీ కనిపించేలా నిల్చుని పాఠాలు చెప్పాలన్నది అందరం సమర్థించవలసిన విషయమే! అలాగని మిగతా ఏ ఒక్క క్షణం కూర్చోకూడదా? అన్నది అందరూ ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వ సూచనల మేరకు గతంలో మాస, త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక పరీక్షలు ఉండేవి. ఇప్పుడు వాటిని ఎఫ్‌ఎలు, ఎస్‌ఏలుగా మార్చారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో పరీక్షల విషయంలో కాస్త సరళతరమైన నిబంధనలు వున్నాయి కానీ ప్రైవేట్ పాఠశాలలో ప్రతిరోజు విద్యార్థులకు పరీక్ష వుండవలసిందే. దీంతో ప్రతిరోజు ఉపాధ్యాయులు పేపర్లు దిద్దవలసిందే. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 లేదా 8 వరకు పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు నిలబడి పనిచేయటమే కాకుండా, ఇంటికి వచ్చాక కూడా పేపర్లు దిద్దుతూ, లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటూ, రిపోర్టులు తయారు చేసుకుంటూ అమితంగా శ్రమిస్తున్నారు. వీరి వేతనాలు చాలా తక్కువ. వీరికి ఉద్యోగ భద్రత కూడా లేదు. ఫిబ్రవరి సమయానికే సగం మంది ఉపాధ్యాయులను ఉద్యోగంలో నుంచి తీసేస్తుంటారు. మండుటెండల్లో ఇంటింటికి పంపి పిల్లలను చేర్చుకునే ప్రచారానికి పంపిస్తుంటారు. ఇలా చెప్పుకుంటూపోతే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు అనేకం.
విద్యార్థులు ఎలా ఉన్నారు
ఇక విద్యార్థుల విషయానికొస్తే వేగంగా మారుతున్న కాలం, సినిమాలు, టీవీలు, యూట్యూబ్ ఛానల్స్ ప్రభావంతో అన్నింటిలోనూ మార్పులు వచ్చాయి. పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాళ్ళ స్వభావాలు మారిపోయాయి. పిల్లలు కూడా రీల్స్ చూస్తూ, రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. చూడకూడనివెన్నో చూస్తన్నారు. వాడకూడని ఊ పదాలు మాట్లాడుతున్నారు. పిల్లలను క్రమశిక్షణలో ఉంచే శిక్షలు, దండనలు పెద్ద చర్చనీయాంశాలుగా మారాయి.
సంబంధాలు మెరుగుపడాలంటే…
ఎప్పుడైతే ఉపాధ్యాయులందరూ తాము చేస్తున్న వృత్తి, అన్ని వృత్తులలాంటింది కాదు అని గ్రహించగలుగుతారో అప్పుడు తమ వృత్తిని అత్యంత అంకిత భావంతో నిర్వహించగలుగుతారు. అలాగే పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సయోధ్యతో పనిచేయాలి. పిల్లలను ప్రేమతో, తమ మాట తీరుతో, తమ విజ్ఞానంతో గెలుచుకోవాలి. వారితో స్నేహంగా ఉండాలి. ఒక్క విద్యలోనే కాదు జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీ వెనుక మేమున్నామన్న భరోసాను ఉపాధ్యాయులు ఇవ్వగలగాలి.
– సమ్మెట ఉమాదేవి, 9849406722