ఎంఈవో క్యాడర్‌ స్ట్రెంత్‌ అప్‌డేట్‌ చేయండి

– విద్యాశాఖ సంచాలకులకు టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంఈవో క్యాడర్‌ స్ట్రెంత్‌ అప్‌డేట్‌ కాకపోవడం వల్ల బదిలీపై వచ్చిన రెగ్యులర్‌ ఎంఈవోలు వేతనాలు పొందడానికి ఇబ్బందులు పడుతు న్నారని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌ జీహెచ్‌ఎంఏ) కోరింది. ఎంఈవో క్యాడర్‌ స్ట్రెంత్‌ను అప్‌డేట్‌ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోని డైట్‌, సీటీఈ, ఐఏఎస్‌ఈ, ఎస్‌సీఈఆర్టీ, జీసీపీఈ వంటి సంస్థల్లో చేసిన హేతుబద్ధీకరణ తర్వాత ఎక్కువ పోస్టులు గురించిన ఉమ్మడి జిల్లాల డీఈవోల పరిధిలో ఉన్న అన్ని రకాల ఖాళీ పోస్టులతోపాటు వాటి క్యాడర్‌ స్ట్రెంత్‌ వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు. ఆ వివరాలను ట్రెజరీకి సమర్పించాలని సూచించారు.148 నూతన మండలాల్లో ఎంఆర్సీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరైనా నిర్మాణాలు పూర్తికాలేదనీ, వాటిని పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదించి ట్రెజరీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.