రాష్ట్రంలో15 రైల్వేస్టేషన్ల అప్‌గ్రేడ్‌

రాష్ట్రంలో15 రైల్వేస్టేషన్ల అప్‌గ్రేడ్‌– రూ.230.24 కోట్ల వ్యయం : ద.మ.రైల్వే జీఎమ్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని 15 రైల్వేస్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. రూ.230.24 కోట్ల అంచనా వ్యయంతో వీటి పునర్నిర్మాణం జరుగు తుందనీ, త్వరలో ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌లో వీటికి శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. శనివారంనాడిక్కడి రైల్‌ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అప్‌గ్రేడ్‌ చేయనున్న రైల్వే స్టేషన్లు, వాటి అంచనా వ్యయాన్ని వెల్లడించారు. బాసర (అంచనా వ్యయం రూ.11.33 కోట్లు), బేగంపేట (రూ.22. 57 కోట్లు), గద్వాల్‌ (రూ.9.49 కోట్లు), జడ్చర్ల (రూ.10.94 కోట్లు), మంచిర్యాల్‌ (రూ.26.49 కోట్లు), మెదక్‌ (రూ.15.31 కోట్లు), మేడ్చల్‌ (రూ.8.37 కోట్లు), మిర్యాలగూడ (రూ.9.5 కోట్లు), నల్గొండ (రూ.9.5 కోట్లు), పెద్దపల్లి (రూ.26.49 కోట్లు), షాద్‌నగర్‌ (రూ.9.59 కోట్లు), ఉందానగర్‌ (రూ.12.37 కోట్లు), వికారాబాద్‌ (రూ.24.35 కోట్లు), వరంగల్‌ (రూ.25.41 కోట్లు), యాకుత్‌పురా (రూ.8.53 కోట్లు) స్టేషన్లను ఆధునీకరించనున్నట్టు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 49 రోడ్‌ అండర్‌ బ్రిడ్జీలు (ఆర్‌యూబీ), రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జీలు (ఆర్‌ఓబీ)లు నిర్మిస్తామని చెప్పారు. దీనివల్ల రైలు, రోడ్డు రవాణా మార్గాలు అనుసంధానమవుతాయన్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మొత్తంగా రూ.1,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టనున్నామని తెలిపారు. జోన్‌ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలోని 15 రైల్వేస్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 34, మహారాష్ట్రలో 6, కర్నాటకలో రెండు స్టేషన్లను రూ.925 కోట్ల వ్యయంతో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం ద్వారా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే జోన్‌ మొత్తంలో 156 ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలను రూ.927.31 కోట్లతో నిర్మాణం చేయనున్నామని తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా భారతీయరైల్వేలోని 554 అమృత్‌ స్టేషన్లు, 1,500 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలకు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.