ఇంటర్‌ వరకు 38 కేజీబీవీల అప్‌గ్రేడ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని 38 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాటిలో ప్రస్తుత విద్యాసంవత్సరం (2023-24)లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం, 2024-25 విద్యాసంవత్సరంలో ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.7.60 కోట్ల భారం పడుతుందని వివరించారు. రాష్ట్రంలో 475 కేజీబీవీలున్నాయనీ, వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 245 విద్యాలయాలను ఇంటర్మీడియట్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేసిందని పేర్కొన్నారు. వాటిలో ప్రస్తుతం 26,027 మంది బాలికలు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారని తెలిపారు. ప్రస్తుతం 38 కేజీబీవీలను అప్‌ గేడ్‌ చేయడం వల్ల ఈ సంవత్సరం అదనంగా 3,040 మంది బాలికలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న 475 కేజీబీవీల్లో మొత్తం 1,33,879 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. నూతనంగా అప్‌గ్రేడ్‌ చేసిన కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ రెండు గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.