– డిసెంబర్‌లో 1673 కోట్లుగా నమోదు
– 2024లో 46 శాతం వృద్ధి
న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్ చెల్లింపులు నూతన రికార్డ్‌లను సృష్టిస్తున్నాయి. 2024 నవంబర్‌తో పోల్చితే డిసెంబర్‌లో 8 శాతం పెరిగి 1673 కోట్ల లావాదేవీలకు చేరాయి. 2016 ఏప్రిల్‌లో యూపీఐ లావాదేవీలు ప్రారంభమైనప్పటి నుంచి గడిచిన నెలల లావాదేవీలు అత్యధికం కావడం విశేషమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) బుధవారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. 2024 నవంబర్‌లో రూ.21.55 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్‌లో 8 శాతం పెరిగి రూ.23.25 లక్షల కోట్లకు ఎగిశాయి. 2023తో పోలిస్తే 2024లో లావాదేవీలు 46 శాతం పెరుగుదల ఉంది. 2023లో 11800 కోట్ల లావాదేవీలు జరిగితే 2024 డిసెంబర్‌లో 17200 కోట్లకు చేరాయి. 2023లో రూ.183 లక్షల కోట్లకు చేరుకున్న యుపిఐ చెల్లింపులు.. 2024లో రూ.247 లక్షల కోట్లకు ఎగిశాయి. గతేడాది పర్సన్ టూ మర్చంట్ లావాదేవీలు జరగడం వల్లే లావాదేవీల సంఖ్య పెరిగింది. నవంబర్ నెల లావాదేవీలతో పోలిస్తే డిసెంబర్ నెలలో 510 మిలియన్ల నుంచి 540 మిలియన్ల లావాదేవీలు పెరిగాయి. నవంబర్‌లో ప్రతీ రోజూ సగటున రూ.71,840 కోట్ల యుపిఐ చెల్లింపులు జరగ్గా.. డిసెంబర్‌లో ఈ సగటు రూ.74,990 కోట్లకు చేరుకుంది. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 డిసెంబర్‌లో లావాదేవీల్లో 39 శాతం పెరగ్గా.. లావాదేవీల పరంగా 28 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు 2024 నవంబర్ నెలలో 35.9 కోట్ల ఫాస్టాగ్ లావాదేవీలు జరిగితే డిసెంబర్ నెలలో 38.2 కోట్ల లావాదేవీలు జరిగాయి.