ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఉత్తమ స్టేడియం ఉప్పల్‌!

ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఉత్తమ స్టేడియం ఉప్పల్‌!– అవార్డుతో పాటు రూ.50 లక్షల నజరానా
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ఏడు మ్యాచులు. ఆరు మ్యాచుల్లో ఫలితం. ఐదింట హైదరాబాద్‌ ఎదురులేని విజయాలు. నాలుగు మ్యాచుల్లో 200 ప్లస్‌ స్కోర్లు. అందులో ముంబయి ఇండియన్స్‌ రికార్డు 277 పరుగుల అత్యధిక స్కోరు. ఇదీ ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఉప్పల్‌ స్టేడియం నమోదైన గణాంకాలు. ఫుట్‌బాల్‌ సంస్కృతి తరహాలో ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అద్బుత అభిమాన నీరాజనం. పవర్‌హిట్టింగ్‌ సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ అనుభూతి ఆస్వాదించేందుకు అత్యంత సుందరమైన స్టేడియం. దీంతో సహజంగానే ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఉత్తమ పిచ్‌, గ్రౌండ్‌ అవార్డు ఉప్పల్‌ స్టేడియాన్ని వరించింది. ఆదివారం చెపాక్‌లో జరిగిన టైటిల్‌ పోరు అనంతరం బీసీసీఐ పలు అవార్డులు అందజేసింది. అందులో సీజన్‌ ఉత్తమ పిచ్‌, గ్రౌండ్‌ విభాగంలో హైదరాబాద్‌కు అవార్డుతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి దక్కింది. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు చాముండేశ్వరినాథ్‌ చేతుల మీదుగా హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు అవార్డు, ప్రైజ్‌మనీ అందుకున్నారు. ‘క్యూరేటర్‌ చంద్రశేఖర్‌, గ్రౌండ్‌ సిబ్బంది అద్భుతంగా పని చేశారు. ఐపీఎల్‌ మ్యాచులకు ప్రపంచ శ్రేణి పిచ్‌లను అందించారు. హెచ్‌సీఏ సభ్యులు అందరి పడిన కష్టానికి ప్రతిఫలం ఈ పురస్కారం’ అని జగన్‌ అన్నారు.
క్యూరేటర్‌, గ్రౌండ్స్‌మెన్‌కు రూ.25 లక్షలు
క్యూరేటర్లు, మైదాన సిబ్బందికి నగదు బహుమతి అందించే సంప్రదాయాన్ని బీసీసీఐ కొనసాగించింది. రెండు నెలల పాటు కఠోరంగా శ్రమిస్తూ ఐపీఎల్‌ మ్యాచులకు పిచ్‌ల రూపకల్పన, గ్రౌండ్‌ను సిద్ధం చేయటంలో రాజీలేని శ్రమపడిన క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు రూ. 25 లక్షల చొప్పున ప్రకటించారు. ఐపీఎల్‌ పది వేదికలతో పాటు ధర్మశాల, ముల్లాన్‌పూర్‌, గువహటి వేదికల క్యూరేటర్లు, మైదాన సిబ్బందికి తలా రూ.25 లక్షల ప్రోత్సాహకాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.