ఊపర్‌ షేర్వానీ…

– మేడిపండు చందంగా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
– లెక్కలతో తప్పుదారి పట్టిస్తున్న మోడీ సర్కారు
– సర్వే గణాంకాల్లో పారదర్శకత లోపం
– జీడీపీపై ప్రభుత్వ వాదనలు నిరాధారం, నమ్మశక్యం కానివి
– ఆర్థికవేత్తలు, నిపుణులు అభిప్రాయం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు పూర్తవుతున్నది. ఈ తొమ్మిదేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సమున్నతంగా జరిగిందని మోడీ టీం ప్రచారం చేసుకుంటున్నది. ముఖ్యంగా, దేశ ఆర్థికవృద్ధిపై మళ్లీ పెద్ద ఎత్తున వాదనలు వెల్లువెత్తుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున.. ఇవి మరింతగా తీవ్రమవుతున్నాయి. 5 ట్రిలియన్ల నుంచి 25 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి చర్చలు జరుగుతున్నాయి. మోడీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, రానున్న రోజుల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని మోడీ, ఆయన టీం ప్రచారాలు చేసుకుంటున్నారు.
న్యూఢిల్లీ:
దేశ ఆర్థికం, అభివృద్ధి విషయంలో కేంద్రం ప్రచారాలు నిరాధారమైనవనీ, గణాంకాలతో తప్పుదారి పట్టిస్తున్నదని ఆర్థికవేత్తలు, నిపుణులు అంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానానికి చేరుకోవటానికి గత ప్రభుత్వాల విధానాలు, కృషి ఉన్నాయనీ, అయితే మోడీ ప్రభుత్వం ఇదంతా వారి గొప్పతనంగా ప్రచారం చేసుకుంటున్నదని తెలిపారు. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణనను, కొన్ని అంశాల ఆధారంగా దాని ఆర్థికవృద్ధి రేటును విశ్వసించలేమని అన్నారు. జీడీపీ, ఉపాధి, ద్రవ్యోల్బణం, తలసరి ఆదాయం మొదలైన అంశాల్లో ప్రభుత్వ వాదనలు నమ్మదగినదిగా లేదనీ, ఇవి నిరాధారమైనవని ఆర్థికవేత్తలు, నిపుణులు అంటున్నారు.
ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా ‘అనధికారమే’
మరిన్ని వివరాల్లోకి వెళ్లేముందు, జీడీపీ గణాంకాలకు వాటి గణన పద్ధతి, పాత వాస్తవాల కారణంగా ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఉదాహరణతో అర్థం చేసుకుందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా అనధికారిక లేదా అసంఘటిత రంగంలోనే ఉంది. ఇందులో వ్యవసాయం మాత్రమే కాకుండా తయారీ మరియు సేవా రంగాలలోని పెద్ద భాగాలు కూడా ఉన్నాయి. ఖాతాలు, గణాంకాలు అందుబాటులో లేనందున దీనిని అనధికారికం అంటారు. కాబట్టి, జీడీపీని లెక్కించేటప్పుడు, ఈ భాగాన్ని అంచనా ఆధారంగా మాత్రమే జోడించాలి. అంచనా పద్ధతిలో లోపం కారణంగా వీటిలో భారీ వ్యత్యాసం వస్తుంది. అందువల్ల, ఈ పద్ధతి తార్కికంగా, పారదర్శకంగా ఉండటం అవసరమనీ ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అధికారిక రంగానికి సంబంధించినంత వరకు, పరిశ్రమల వార్షిక సర్వే నుంచి దాని ఉత్పత్తి డేటాను ముందుగా పొందారు. అధికారిక, అనధికారిక రంగాల నుంచి డేటాను కలపడం ద్వారా జీడీపీ గణనలో స్పష్టత ఉండదని చెప్పారు. కాబట్టి, స్థూల జీడీపీ డేటా కోసం అధికారిక, అనధికారిక రంగాలు ఎలా మిళితం చేయబడతాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.
మోడీ పాలనలో సర్వేల ప్రక్రియ నిలిపివేత
వాస్తవానికి, అంచనాల కారణంగా, ఇంతకుముందు కూడా ఇందులో తప్పులు జరిగాయని నిపుణులు గుర్తు చేశారు. కానీ కాలానుగుణంగా, ఈ అంచనాలు తనిఖీ చేయబడ్డాయనీ, అనధికారిక రంగం అంటే కంపెనీయేతర వ్యాపారాల జాతీయ సర్వే నిర్వహించడం ద్వారా సరిదిద్దబడ్డాయని చెప్పారు. అంతేకాకుండా, సాధారణ ఆర్థిక గణన, వినియోగదారుల వ్యయ సర్వే, ఉపాధి సర్వే మొదలైనవి కూడా గణాంక గణనలను ధృవీకరించడంలో చాలా వరకు సహాయపడిందని చెప్పారు. కానీ మోడీ ప్రభుత్వం ఈ సర్వేల ప్రక్రియను నిలిపివేసిందన్నారు. ”13 ఏండ్లుగా కంపెనీయేతర ఆక్రమణ సర్వే చేయలేదు. 9 ఏండ్లుగా ఆర్థిక గణన జరగలేదు. వినియోగదారుల వ్యయం, ఉపాధి సర్వేలు 12 సంవత్సరాల క్రితం జరిగాయి. 2015-16లో 5 సంవత్సరాల తర్వాత వినియోగదారుల వ్యయ సర్వే కూడా నిర్వహించబడింది. కానీ దాని ఫలితాలు, ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా, ఆదాయం, పేదరికం విషయంలో ప్రభుత్వానికి ప్రతికూల గణాంకాలను అందించాయి. దీంతో ప్రభుత్వం తన స్వంత సర్వేను రద్దు చేసిందనీ, దాని డేటాను విడుదల చేయడానికి నిరాకరించిందని ఆర్థిక నిపుణులు తెలిపారు.
తగ్గిన అనధికారిక రంగం వేగం
ఎస్‌బీఐ ప్రిన్సిపల్‌ ఎకనామిస్ట్‌ సౌమ్య కాంతి ఘోష్‌ సమర్పించిన అంచనా ప్రకారం.. 2020-21లో ఆర్థిక వ్యవస్థలో 15శాతం నుంచి 20 శాతం అనధికారిక రంగం చాలా వేగంగా తగ్గిపోయింది. దీనికి విరుద్ధంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తున్న లండన్‌కు చెందిన వరల్డ్‌ ఎకనామిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనాల ప్రకారం, ఇది 2023లో ఇప్పటికీ 43.1 శాతం స్థాయిలోనే ఉంది. ఈ రెండు వ్యతిరేక అంచనాల ఆధారంగా జీడీపీ లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నదని చెప్పారు.