– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జార్ఖండ్‌లో వేలాది మంది ర్యాలీ
న్యూఢిల్లీ: అమరవీరుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలోని బుండులో ఆదివాసీలు శుక్రవారం కదంతొక్కారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. అందులో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బహిరంగ సభలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏఐకేఎస్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే పాల్గొన్నారు. సీపీఐ(ఎం) జార్ఖండ్ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ విప్లవ్, సీపీఐ(ఎం), సీఐటీయూ, ఏఐకేఎస్, ఐద్వా నాయకులు సురేష్ ముండా, సుఫల్ మహతో, రంగోవతి దేవి, సుఖ్‌నాథ్ లోహారా, భవన్ సింగ్, వీణా లిండా తదితరులు ప్రసంగించారు. రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆదివాసీల హక్కుల గురించి కనీసం ప్రస్తావన కూడా చేయలేదని విమర్శించారు. ఆదివాసీల భూమిని కార్పొరేట్‌లకు స్వాధీనం చేసుకునేందుకు వీలుగా అటవీ సంరక్షణ చట్టంలో తిరోగమన గిరిజన వ్యతిరేక సవరణలు చేశారని దుయ్యబట్టారు. విపరీతమైన ధరల పెరుగుదల, నిరుద్యోగానికి దారితీసిన బీజేపీ విధానాలను, దేశాన్ని కార్పొరేట్‌లకు అమ్మే ప్రయత్నం, ప్రజలను మతం, కులాల ప్రాతిపదికన విభజించే మతతత్వ కుట్రను కూడా నేతలు బహిర్గతం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, వామపక్షాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.