యూపీఎస్ వద్దు, ఓపీఎస్ అమలు చేయాలి..

No UPS, OPS should be implemented..– పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రమేష్ 
నవతెలంగాణ – పెద్దవంగర
యూనిఫైడ్ పెన్షన్‌ పథకం (యూపీఎస్‌) వద్దు, పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గంగిశెట్టి రమేష్ కుమార్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 24న జారీ చేసిన యూనిఫైడ్‌ పెన్షన్‌ విధానం(యూపీఎస్‌) నోటిఫికేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సోమవారం మధ్యాహ్నం బోజన విరామ సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాజు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్న యూపీఎస్‌కు సంబంధించిన గెజిట్‌ ను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిందని పేర్కొన్నారు. దీని ద్వారా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ వసూలు చేసి పెన్షన్‌ అమలు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మరోసారి ఉద్యోగుల సంక్షేమం, కుటుంబ సామాజిక భద్రత ఆలోచించకుండా కేవలం షేర్‌ మార్కెట్‌ ద్వారానే ఉద్యోగి భవితవ్యాన్ని నిర్ణయించే విధంగా ఉన్నా ఈ యూపీఎస్‌ విధానం సరికాదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ద్వారా కాంట్రిబ్యూషన్‌ లేని పెన్షన్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక హక్కుగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ అమలు సిఫారసు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కార్పొరేట్ల కడుపు నింపే విధంగా ఈ పెన్షన్‌ విధానం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి వెలిదె సురేష్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా, రాష్ట్ర, జిల్లా బాధ్యులు అంజయ్య, శ్రీధర్, నరేందర్ రెడ్డి, నరసింహారావు, నరసింహా రావు, సింహాద్రి, విద్యా సాగర్, సోమన్న, ఉమాదేవి, విజయ లలిత, కన్నా శ్రీనివాస్ రావు, రవి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.