– నిక్షేపాల కోసం ఏరియల్ సర్వే
– నల్లమల అడవి, కృష్ణా నది పరివాహకంలో పరిశీలన
– నాగార్జునసాగర్‌లో ఢిల్లీ బృందం మకాం..
– భయాందోళనలో గిరిజనులు
నవతెలంగాణ -పెద్దవూర
నల్లమలలో మళ్లీ యురేనియం అలజడి రేగింది. నల్లమల అడవితోపాటు కృష్ణా నది పరివాహకంలో కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా సర్వే చేయడమే ఈ భయాందోళనకు కారణం. నల్లమలలో అరుదైన చెంచు జాతి వారున్నారు. కొన్ని వందల గిరిజన కుటుంబాలున్నాయి. యురేనియం వివిధ ఖనిజాల మిశ్రమంగా ఉంటుందని, దానిని వేరు చేసే ప్రక్రియలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా గిరిజనుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వారిని వేరే ప్రాంతాలకు తరలించినా, తవ్వకాలతో కృష్ణా నది కలుషితమవుతుందని, దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలకు ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. యురేనియం నిక్షేపాల అన్వేషణను తెలంగాణ అటవీ శాఖ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్నా మళ్లీ నిక్షేపాల కోసం సర్వేల పేరుతో ఉచిత బోరు తవ్వకాలు చేస్తున్నారు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా యురేనియం అన్వేషణ కొనసాగిస్తున్నారని తెలిసింది.
నల్లమల అభయారణ్యం ప్రకృతి రమణీయతకు, అపురూప జంతుజాలానికి నెలవు. ఇక్కడి ప్రాచీన గిరిజన తెగలకు విస్తారంగా ఉన్న కొండలే ఆవాసాలు. ఇప్పుడు వారి భవిత ప్రశ్నార్థకమవుతున్నది. నల్లమల బేసిన్‌లోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో విస్తరించిన ఈ ప్రాంతం యురేనియం అన్వేషణలో పెద్ద యంత్రాల మోతలతో, తవ్వకాలతో తన రూపు కోల్పోనుందని చర్చ సాగుతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం నిక్షేపాల అన్వేషణకు కేంద్ర అటవీ సలహా మండలి కేంద్ర అణుశక్తి సంస్థకు అనుమతి ఇచ్చింది. అదే జరిగితే అక్కడి చరిత్ర కనుమరుగు కానుంది.
మకాం వేసిన ఢిల్లీ బృందం
నల్లగొండ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం వేట మళ్లీ మొదలైంది. ఐదు, పది రోజులుగా నాగార్జునసాగర్‌లో ఢిల్లీ బృందం మకాం వేసింది. యురేనియం నిక్షేపాల కోసం వచ్చిన అధికారులు బృందం హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తున్నారు. నంబాపురం, పెద్దగట్టు, కోమటికుంట తండా ప్రాంతాల్లో ప్రతి రోజూ 10 గంటల సమయంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. 2003లో యురేనియా కోసం ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతి తీసుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయనీయకుండా అధికారులను అడ్డుకున్నారు పెద్దగట్టు గ్రామస్తులు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బీఆర్‌ఎస్ పాలనలో యురేనియం తవ్వకంపై పోరాటం చేశారు. దీంతో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభమైంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని గతంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా.. దానిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం, యురేనియం కార్పొరేషన్ ముందుకు సాగుతుండటం గమనార్హం.
2002 నుంచే సర్వే
దేవరకొండ, చందంపేట, పీఏపల్లి మండలాల్లో యురేనియం నిక్షేపాల కోసం 2002 నుంచే అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత అణుపరిశోధన సంస్థలకు అప్పగించింది. అప్పటి నుంచి ఆయా సంస్థల అధికారులు దేవరకొండ నియోజకవర్గంలో సంచరిస్తూ యురేనియం నమూనాలు సేకరిస్తున్నారు. చందంపేట మండలం చిత్రియాల గుట్టల్లో, పెద్దమూల గ్రామంలో 2500 ఎకరాలు, పీఏపల్లి మండలంలో 1104.64 ఎకరాల అటవీభూమి, 196.71ఎకరాల పట్టా భూముల్లో యురేనియం నిల్వలు ఉన్నట్టు గతంలోనే యూసీఐఎల్ అధికారులు నిర్ధారించారు. కానీ, యురేనియం సర్వే, తవ్వకాలను మొదటి నుంచే స్థానికులు వ్యతిరేకిస్తూ పలు ఆందోళనలు కూడా చేశారు.
దేవరకొండ మండలం శేరిపల్లి, ముదిగొండ పరిధిలో 200 ఎకరాలు, చందంపేట మండలం చిత్రియాల, పెద్దమునిగల్ గుట్టల్లో 2500 ఎకరాలు, పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం, పెద్దగట్టు పరిసర గ్రామాల్లో 210 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు కనుగొన్నారు. యురేనియం కోసం తవ్వకాలు చేపడితే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా కృష్ణా జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో స్థానికులు ఆ తవ్వకాలను అడ్డుకున్నారు. 2003 ఆగస్టులో అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్‌పీ సిసోడియా ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ ప్రయత్నాలను ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. 2005లో శేరిపల్లి వద్ద యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. 2008 నుంచి అణుశక్తి సంస్థ ఖనిజాన్వేషణ మొదలు పెట్టింది. 2014 వరకు ఈ అన్వేషణ కొనసాగింది. ఇవి లభ్యం కావడంతో పెద్దగట్టు, నమ్మపురం, కోమటికుంట తండా ప్రాంతాల్లో డ్రిల్లింగ్ అనుమతుల కోసం అణుశక్తి విభాగం ప్రతిపాదన పంపింది. నాగార్జున సాగర్ ప్రాంతంలోని నిడ్గుల్ రక్షిత అటవీ ప్రాంతంలోని 7 చదరపు కిలో మీటర్లు, అమ్రాబాద్ టైగర్ రిజర్వాయర్‌కు సంబంధించిన 87 చదరపు కిలో మీటర్లలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, సర్వేకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
గతంలోనూ శాస్త్రవేత్తల బృందం పర్యటన
నాగార్జునసాగర్ ప్రాంతంలో గతంలోనూ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. అప్పట్లో నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు సమీపంలోని నల్లమల గుట్టలను సందర్శించి సర్వే నిర్వహించారు. యువ శాస్త్రవేత్తలు యూసీఐఎల్ ఆధ్వర్యంలో పెద్దగట్టు, నంభాపురంలో యురేనియం నిక్షేపాలను గుర్తించిన గుట్టలను పరిశీలించారు. నమూనాల కోసం గతంలో తవ్విన బోరుబావులను పరిశీలించారు. మట్టి నమూనాలు సేకరించారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పరిసరాల్లో యురేనియం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పెద్దగట్టు, నంభాపురం ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు అటామిక్ మినర్స్ డైరెక్టర్ ఇచ్చిన నివేదిక సంచలనం రేపుతోంది. పెద్దగట్టు, నంభాపురం పరిసరాల్లో గతేడాది 25బోరు బావుల్లో నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఎల్ 21శాంపిల్స్‌లో అత్యంత ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్టు వెల్లడైంది. ఇప్పటికే దశాబ్ద కాలంగా పెద్దగట్టు గ్రామస్తులు భూగర్భ జలాలను తాగునీటికి వినియోగించడం లేదు. కేవలం వ్యవసాయానికి మాత్రమే వినియోగిస్తున్నారు. నంభాపురం నుంచి 8 కిలో మీటర్ల పరిధిలో నీటి నమూనాలను అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ సేకరించింది. దాదాపు 8 నెలలపాటు శాంపిల్స్ సేకరించి జరిపిన పరీక్షల్లో యురేనియం స్థాయి 2 వేల 168 పీపీబీ ఉన్నట్టు నిర్ధారించింది. అప్పట్లో రాజుకున్న వివాదం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.