అర్బన్ కాలనీ రైల్వే బ్రిడ్జి మోరి డిజైన్ మార్చాలి: గడ్డం వెంకటేష్

నవతెలంగాణ – భువనగిరి

భువనగిరి మున్సిపల్ కేంద్రంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరు తెచ్చుకున్న అర్బన్ కాలనీలో ప్రస్తుతం నిర్మిస్తున్న డ్రైనేజీ మోరి నిర్మాణాన్ని డిజైన్ మార్చి ప్రజలకు భవిష్యత్తులో ఉపయోగపడేలా నిర్మించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు.  గురువారం అర్బన్ కాలనీ నుండి భువనగిరి కేంద్రానికి రావడానికి ప్రత్యామ్నాయంగా రైల్వే అండర్ బ్రిడ్జి ద్వారా వెసులుబాటుగా ఉన్నదన్నారు. రాత్రి సమయాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు సమయభావంతో తొందరగా వెళ్లడానికి అట్టి రోడ్డు కాలనీవాసులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వేస్తున్న మొరి ద్వారా వర్షాకాలంలో కాలనీ నీళ్లు మొత్తం రోడ్డుపై చేరి భువనగిరి నుండి వరంగల్ వెళ్లే రహదారి పైకి వచ్చి వాహనదారులకు, కాలనీ ప్రజలకు అనేక ఇబ్బందులు జరిగే అవకాశం ఉన్నదన్నారు. దాదాపు ఒకటవ వార్డు, 13వ వార్డు, 16వ వార్డుకు సంబంధించిన డ్రైనేజీ నీళ్లు మొత్తం అట్టి మోరి ద్వారానే బయటికి రావాలి దాన్ని గమనించకుండా అనుభవం లేని ఇంజనీర్లతో సలహా తీసుకొని నిర్మాణాన్ని చేపట్టడం వల్ల భవిష్యత్తులో కాలనీ ప్రజలు వాహనాదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. వెంటనే నిర్మిస్తున్న డ్రైనేజీ మోరి పనులను నిలిపివేసి ప్రత్యామ్నాయంగా మోరీ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.లేనియెడల ప్రజలతో ఆందోళన పోరాటాలు  చేస్తామని హెచ్చరించారు.