రెండోగుండె లాంటిది గతం ..అది లోలోపల లోలకంలా కొట్టుకుంటుంది… అందరి మానసిక స్థితీ అంతోఇంతో అంతే కానీకొందరు మాత్రమే మనసు అనే స్టెత్ తో దాని వేగాన్ని కనిపెట్టగలరు. గతంలో ఏముంటుంది ఏమున్నా ఉండకపోయినా కోల్పోయినతనం ఉంటుంది కోల్పోయిన బాల్యం, స్నేహాలు, అనుబంధాలు ఆప్యాయతలు, ఇవి అందరిజీవితాల్లోనూ ఉంటాయి. కానీ సొంతఊరినే కోల్పోతే ఉనికినేకోల్పోవటం అది ఆఊరందరికీ ఊరంతటి విషాదం. ఇది చెల్లాచెదురైన జీవితాలకోసం గాలింపు , మొన్నల్లో మాయమైన మనుషులకై వెతుకులాట.. స్నేహాలు, ఆప్యాయతల్ని కోల్పోయిన ఒక పసివాడి పరితాపం.. సింగరేణి ఇనుపకాళ్ల కిందనలిగిన అల్లీపూలకు కు ఊరిచెరువు రాసుకున్న ఎలిజీ..
అందరికీ నోరున్నా కొందరు మాత్రమే పాడగలరు.. అందుకే ఊరందరి కంఠాల్ని తన గొంతులో కూర్చుకొని ఆ బ్లాక్ అండ్ వైట్ గురుతుల్ని మన కళ్లముందు రంగుల్లో నిలిపే యత్నమే ఈ పుస్తకం.. కవి, కథకుడు, ఆక్టివిస్ట్ నరేష్ కుమార్ సూఫీ వెలువరించిన
‘మెమొరీస్ ఆఫ్ మంగలి పల్లె’ పుస్తకం నిండా గుండెను తడిచేసే అనేక యాదుల మనాదులు. గుల్ దస్తా లాంటి ఈ పుస్తకానికి అరుణాంక్ లత రాసిన ముందుమాట కథల ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తుంది.
ఇసుక తింటూ బొగ్గు విసర్జిస్తూ లోలోపల కుములుతున్న కుప్ప కూలుతున్న అండర్ మైనింగ్ కాదు.. ఇది ఊరిని ఉమ్మడి సంస్కతిని, చెరువుని చెట్టుచేమని నోరుతెరిచి మింగిన ఓపెన్ కాస్ట్..
చెట్టును నరికేశాక పిట్టలదైన్యం ఈ పుస్తకంలోని కథనాల సారాంశం. మరో తావుకు ఎగరలేక గొడు కూలిన చోట ఉండలేక గుండె తండ్లాట. అక్కడ మాయం చేయబడ్దది భౌతికంగా ఊరినే కాదు పల్లె అనుబంధాలను. ఆప్యాయతలను తవ్విన ఆ శిధిలాలనిండా గతం తాలూకు అస్థి పంజరాలు. చుట్టూ పరిచిన ఎత్తు గుట్టల్లాంటి మట్టిదిబ్బలు గతం సమాధులు. ఖమ్మంలోని ఎన్ ఎస్ పీ క్యాంపు క్వార్టర్స్ కూల్చివేసి స్థానికులను నిర్వాసితులను చేసిన సందర్భంలో ఉప్పొంగిన కన్నీళ్ళు, వియోగాలు, చెల్లా చెదురైన స్నేహాలు, బంధుత్వాలు మరింత భారంగా మారిన బడుగు బలహీనుల బ్రతుకులు స్వయంగా చూసినవాడ్ని..శిథిలాల్లో మొలిచిన అక్షరాలపేరుతో కన్నీళ్ళకు కవిత్వం కట్టిన కవుల్లో నేనూ ఒకడ్ని.. ఒక ప్రాంతాన్ని ధ్వంసం చేస్తేనే అంత విషాదం విస్ఫోటనమైతే ఇక ఊరికి ఊరినే ఊడ్చేస్తే మరెంత ఉత్పాతమో… మీఎది మీదే మాది మాదే అన్న వేర్పాటు వాదం నేపద్యంలో, తెలంగాణలో కథ ఉందా లేదా, కవిత్వం ఉందాలేదా అన్న చర్చల సందర్భంలో వెలువడిన నిఖార్సు తెలంగాణ సమాధానం.
తెలంగాణదే సంస్కతి సౌరభం.. అందులో నల్ల వజ్రాల గని సింగరేణిది మరింత వత్తైన నిశానీ.. సింగరేణి ఫ్లేవర్ తో వొచ్చిన ఈ కథలు నల్లబొగ్గు పెళ్ళలంత అందంగా, ఎర్ర నిప్పుకణికలంత భావసాంధ్రంగా ఉన్నాయి.. రోజూ ఉదయాన్నే ఇళ్ల ముందు వెలిగే బొగ్గు పొయ్యిలు, ఆవాసన సింగరేణి అస్థిత్వాన్ని పట్టిచూపుతుంది. 7వ తారీకు జీతాలు ఆ హడావుడి ఆ పండుగ ఆ దావత్ లు, ఆప్రభావంతో వెలిగే వ్యాపారాలు కోల్ బెల్ట్ నల్లమట్టిలో విరిసే రంగు సింగిడి ప్రత్యేకత. కొత్తగూడెం, ఇల్లెందు, 8 ఇంక్ లైన్, వెంకటేష్ ఖని బొగ్గుబాయి ముంగిళ్ళలో గడిపిన నా.. నాన్ సింగరేణి బాల్యానికి ఆదశ్యాలు పరిచితమే.
ఈ పుస్తకంలో ఇరవైఒక్క కథలున్నాయి కథలన్నీ రచయిత పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతాయి.. పుస్తకానికి ఎంచుకున్న ముఖ చిత్రమే గాఢమైన భావనను కలిగి ఉంది.. ఎడారి లాంటి ఊరినుంచి తన తల్లితో కలిసి నడుస్తున్న పిల్లవాడి దుఖపువెక్కిళ్ళకు చిత్రరూపం. విచ్చిన్నమైన ఉమ్మడి సంస్కతికి దశ్యరూపం ఈ కథలు. విధ్వంసానికి గురికాబడ్డ పల్లె తనానికి దర్పణాలు.
తెలంగాణ మాండలిక మాధుర్యం ఈ కథలకు ఆయువుపట్టు.. గుండెను కదిలించే మనస్సును చెమ్మబరిచే అంశాలను వస్తువులుగా ఎంచుకోవటంతోపాటు రచయిత తనదైన శైళిలో చెక్కిన శిల్పం మరో ఆకర్షణ. గతంఉన్న ప్రతివారికీ కనెక్ట్ అయ్యే కథలివి..ఇవి ఉబుసుపోని ముచ్చట్లు కావు దశాబ్దాలుగా మోస్తున్న గుండెనుండి దించుకున్న ఆవేదనా భారాలు.
ఈతరహా తలపోత కథలు తెలుగు సాహిత్యానికి కొత్తేం కాదు గతంలో నామిని, ఖదీర్ బాబు అనేకమంది తమ అస్థిత్వ యాదులను తలపోతలను కథలుగా పరి చారు. ఆ కథలు ఎంతటి విశిష్ట స్థానాన్ని పొందాయో ఈకథలూ వాటికి తక్కువ కాకుం డా ఉన్నాయి. పల్లె మంత్రసానులు, వీధి బళ్ళు, గ్రామీణ ఫొటొగ్రాఫర్లు, మెకానిక్‌లు, పంచరు దుకాణాలు, టైలరింగ్ షాపులు, చిల్లర కొట్లు, కాకా హౌటళ్లు, ఇట్లా ఎన్నో చేతివత్తులు చిరు వ్యాపారాలు కళ్లముందు మెదులుతాయి.
అగ్రవర్ణాల అహంకారాలకు గురైన కొన్ని కులాల దైన్యం ఈకథల్లో ఉంది.. ఆనాటి ఆవేదనకు ఇప్పటి అక్షర రూపం.. అమా నుషం మరిచిపోలేదన్న సాక్ష్యం.. వేటికవే విభిన్నతను కలిగిఉన్న ఈకథలను అన్నీ చదివి తీరాల్సిందే ప్రత్యేకంగా ఒకటో రెండో కథలను పరిచయం చేయటంకన్నా అన్ని కథలతో స్నేహం చేయాలి.. అనపపూల వాసన, మా ఊరిసమ్మక్క జాతర, మోంబత్తీల పండుగ, మావాడ చెట్ల తీర్థాలు, అల్లీపూలు, పోశమ్మ శిలుకలు ఔసులోళ్ళ రమేష్, మా అమ్మ మంత్ర సాని, గంగ నీళ్ల తొవ్వ, నారాయణ సావుకారి, పాటల దావత్, జమాల్ ఓటల్ కథల శీర్షికలన్నిటిలో తెలంగాణ పరిమళం…కథలు చదివాక అనేక పాత్రలు మనకళ్లల్లో చిరస్థాయిగా మిగులుతాయి.
కంచర్ల శ్రీనివాస్ 9640311380