ఊరూరా ఎర్రజెండా..

ఊరూరా ఎర్రజెండా..– కదం తొక్కిన కష్టజీవులు
– రోడ్‌ షోలు, బైక్‌ ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తుతున్న ప్రచారం
– అగ్రనేతల సుడిగాలి పర్యటనలతో కామ్రేడ్లలో ఫుల్‌ జోష్‌
‘అంగబలం, అర్థబలం, మందీ మార్బలమున్న ధనస్వామ్యం వైపా..? ప్రజల కోసం, దేశం కోసం నికరంగా పోరాడే ఎర్రజెండా వైపా..?’ అంటూ కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రశ్నల కొడవళ్లై ఊరూరా కదం తొక్కుతున్నారు. సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటేయాలంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కష్టజీవులు వారితో గొంతు కలుపుతున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి వివిధ నియోజకవర్గాల్లో సీపీఐ (ఎం) నిర్వహిస్తున్న రోడ్‌ షోలు, బైక్‌ ర్యాలీలు, బహిరంగ సభలు, సమ్మేళనాలకు శ్రామిక ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. సీపీఐ (ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాణిక్‌ సర్కార్‌, బృందా కరత్‌, సుభాషిణీ అలీ, బీవీ రాఘవులు, మాజీ ఎంపీ పి.మధు తదితర అగ్రనేతలు పార్టీ పోటీ చేస్తున్న 19 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటలను చేస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. విలువలను వలువలుగా విసిరి పారేస్తున్న బూర్జువా పార్టీల తీరు తెన్నులను ఉదాహరణలతో వివరిస్తూ ఓటరన్నను జాగృతం చేస్తున్నారు. వారి ఉత్తేజభరిత ప్రసంగాలతో ‘ఒరేరు బిడ్డా.. ఇది పోరాటాల తెలంగాణ గడ్డ… సీపీఐ (ఎం) జిందాబాద్‌.. ఎర్రజెండా వర్థిల్లాలి…’ అంటూ జనం ఎర్రజెండాకు నీరాజనాలు పలుకుతున్నారు.
బీజేపీని ఓడించండి సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి: తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీపీఐ(ఎం) పోటీ చేస్తున్న 19 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులను ఓడించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఐదేండ్ల అనుభవం చూసిన తర్వాత శాసనసభలో కమ్యూనిస్టుల అవసరం మరింత పెరిగిందని తెలిపారు. డబ్బు, మద్యం పెద్దఎత్తున ప్రవహిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజలు సీపీఐ(ఎం)ను ఆదరించాలనీ, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. వారు మాత్రమే శాసనసభను ప్రజా సమస్యలమీద చర్చించటానికి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి ఒక వేదికగా వినియోగిస్తారని తెలిపారు. ఇతర పార్టీలకు ఇవి పట్టవని విమర్శించారు. స్వార్థ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలే వారికి ముఖ్యమని పేర్కొన్నారు.
కమ్యూనిస్టులు లేని శాసనసభలో అధికార, ప్రతిపక్షాలనే తేడా లేదని తెలిపారు. పరస్పర నిందలు తప్ప ప్రజా ప్రయోజనాల గురించి పట్టించుకోలేదని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు లేని ఈ లోటును ఈ ఎన్నికల సందర్భంగా పూడ్చటం అవసరమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓట్ల కోసం బీజేపీ నాయకత్వం మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. కులాన్ని, మతాన్ని పాచికగా ప్రయోగిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క సీటులో కూడా బీజేపీ గెలవకుండా ప్రజలు విజ్ఞతను ప్రదర్శించాలని కోరారు. ఆ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో దాన్ని ఓడించగల పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెంలో సీపీఐ, పినపాకలో సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, శేర్‌లింగంపల్లిలో ఎంసీపీిఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మిగిలిన స్థానాల్లో ఎవరిని బలపరచాలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీలు తగు నిర్ణయం తీసుకుని, ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక, పోరాట శక్తులకు మద్దతిస్తాయని తెలిపారు.