అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా సంయుక్త నావికా విన్యాసాలు

యుఎస్‌ఎస్‌ థియోడర్‌ రూజ్‌వెల్ట్‌లో : వివాదాస్పద తూర్పు చైనా సముద్ర జలాల్లో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియాలు సంయుక్తంగా మూడు రోజుల పాటు నావికా విన్యాసాలు నిర్వహించాయి. అమెరికాకు చెందిన యుఎస్‌ఎస్‌ థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ నేతృత్వంలో అమెరికా విమాన వాహక నౌకల బృందం ఈ విన్యాసాల్లో పాల్గొంది. మరోవైపు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌, ఫిలిప్పీన్స్‌ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాంతంలో చైనాను ఎదుర్కొనేందుకు గానూ భాగస్వామ్య దేశాల మధ్య సంఘీభావాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఒకవైపు సైనిక విన్యాసాలు, మరోవైపు దౌత్య చర్చలకు సిద్ధపడ్డారు. ఏప్రిల్‌ 10 నుండి 12వరకు జరిగిన ఈ విన్యాసాల్లో దక్షిణ కొరియాకు చెందిన గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్లు, జపాన్‌ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. అమెరికన్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ క్రిస్టోఫర్‌ అలెగ్జాండర్‌ ఈ విన్యాసాలపై మాట్లాడుతూ, సముద్ర గర్భంలో యుద్ధ విన్యాసాలను మూడు దేశాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. కమ్యూనికేషన్‌, డేటా షేరింగ్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో ఒకవేళ సంక్షోభం తలెత్తిన పక్షంలో మరింత మెరుగైన కమ్యూనికేషన్‌ వుండేలా చూడడమే లక్ష్యమన్నారు.