అమెరికా అధ్యక్ష ఎన్నికలు

us-presidential-election– బైడెన్‌కు బదులుగా పోటీ చేసేదెవరు ?
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్‌ తప్పుకోవడంతో డెమోక్రటిక్‌ పార్టీ కొత్త అభ్యర్థి ఎవరనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై పోటీ చేసేందుకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కే అవకాశం లభిస్తుందని అంతర్జాతీయ మీడియాలన్నీ ఒకే గొంతుకలో చెబుతున్నాయి. బైడెన్‌ కూడా కమలా హారీస్‌కే మద్దతు పలకడంతో ఆమె బరిలోకి దిగుతారని అంతా భావిస్తున్నారు. కమలా హారిస్‌ కోసం తాను పనిచేస్తానని బైడెన్‌ చెప్పారు. బైడెన్‌ వ్యాఖ్యలను అనుసరించి, అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ కోసం డెమొక్రాటిక్‌ పార్టీ ఖాతా పేరును హారిస్‌ ఫర్‌ ప్రెసిడెంట్‌ అని కూడా మార్చారు. తొలి ఐదు గంటల్లోనే 4.67 మిలియన్‌ డాలర్లకు పైగా విరాళాలు వచ్చినట్లు సమాచారం. కమలా హారిస్‌ కూడా బైడెన్‌ తనను అధ్యక్ష అభ్యర్థిగా అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని, ట్రంప్‌ను, ఆయన ఎజెండాను ఓడించేందుకు డెమోక్రటిక్‌ పార్టీని, దేశాన్ని ఏకం చేయడం తన బాధ్యత అని ఇప్పటికే ప్రకటించారు. హిల్లరీ క్లింటన్‌, బిల్‌ క్లింటన్‌, ఎలిజబెత్‌ వారెన్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌ సహా సీనియర్‌ నేతలు కూడా కమలా హారిస్‌కు తమ మద్దతు ప్రకటించారు. అయితే డెమోక్రటిక్‌ పార్టీ కొత్త అభ్యర్థి రేసులో కమలా హారిస్‌తో పాటు పెన్సిల్వేనియా గవర్నర్‌ జోష్‌ షాపిరో, నార్త్‌ కరోలినా గవర్నర్‌ రారు కూపర్‌, మిచిగాన్‌ గవర్నర్‌ గ్రెట్చెన్‌ విట్మర్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌, అరిజోనా సెనేటర్‌ మార్క్‌ కెల్లీ ఉన్నారు. వీరికి ఉన్న అవకాశాలను కూడా కొట్టి వేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే మరోవైపు కమలా హారిస్‌ ట్రంప్‌ను ఓడించలేరని, కమలా హారిస్‌ను బలిపశువును చేయకూడదనే అభిప్రాయాలు కూడా పార్టీలో ఉన్నాయి. అలాగే బైడెన్‌కు ప్రత్యామ్నాయ పేర్లలో ప్రముఖమైనది మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా భార్య మిచెల్‌ ఒబామా. ఓటర్లు ఎక్కువగా ఇష్టపడే అభ్యర్థి మిచెల్‌ అని ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. గతంలో బైడెన్‌ను అధ్యక్ష అభ్యర్థిగా అంగీకరించిన బరాక్‌ ఒబామా.. కమలా హారిస్‌ను అంగీకరించకపోవడం కూడా గమనార్హం. కన్వెన్షన్‌ ద్వారానే నామినీని ఎన్నుకోవాలని బరాక్‌ ఒబామా అభిప్రాయపడ్డారు. మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. బైడెన్‌ను రేసు నుండి తప్పించడంలో ఒబామా, నాన్సీ పెలోసీ ప్రధాన పాత్ర పోషించారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు చర్చించే అభ్యర్థిని ఎన్నుకోవాలని కొంత మంది డెమోక్రటిక్‌ పార్టీ నాయకులు చెబుతున్నారు. ‘అందరు నామినీలు తప్పనిసరిగా వినాలి, వారి ఎజెండాలను చర్చించాలి. ప్రజాస్వామ్యం డెమోక్రటిక్‌ పార్టీ యొక్క ప్రాథమిక సూత్రం. మనం దానిని ఆచరించకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేము’ మరియాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 19న చికాగోలో జరిగే డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీ సమావేశంలో అభ్యర్థిని ప్రకటిస్తారు. దేశ వ్యాప్తంగా 4,000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వీరిలో 3,800 మందికి పైగా ప్రతినిధులు బైడెన్‌కు అండగా నిలిచారు. అందువల్ల, బైడెన్‌ ఆమోదించిన కమలా హారిస్‌కు అభ్యర్థిత్వానికి మార్గం సులభం అవుతుంది. అధ్యక్షురాలిగా ఎన్నికైతే కమలా హారిస్‌ అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా, బరాక్‌ ఒబామా తర్వాత రెండో నల్లజాతి అధ్యక్షురాలిగా అవతరిస్తారు. దక్షిణాసియాకు చెందిన తొలి మహిళా అధ్యక్షురాలిగా కూడా కమల రికార్డు సృష్టించనున్నారు. అయితే బైడెన్‌ను ఓడించడం కంటే కమలాను ఓడించడం సులభమని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి.