– ఫైనాన్స్‌లో రెట్టింపు మార్కెట్ లక్ష్యం : కార్స్24 వ్యవస్థాపకుడు గజేంద్ర వెల్లడి
హైదరాబాద్ : వినియోగించిన కార్ల (యూజ్డ్ కార్ల)కు ఫైనాన్సింగ్‌లో తమ సంస్థకు ప్రస్తుతం ఐదు శాతం మార్కెట్ వాటా ఉందని కార్స్ 24 ఫౌండర్ గజేంద్ర జంగిడ్ తెలిపారు. కార్స్24 ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్ (సిఎఫ్‌ఎస్‌పిఎల్) వచ్చే ఐదేండ్లలో రుణాల జారీలో రెట్టింపు వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2034 నాటికి దేశంలో యూజ్డ్ కార్ల అమ్మకాల మార్కెట్ రూ.8.3 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం ఇది రూ.2.07 లక్షల కోట్లు (25 బిలియన్ డాలర్లు)గా ఉందన్నారు. ఈ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో 69 శాతం యూజ్డ్ కార్లను ఫైనాన్స్ పద్ధతిలోనే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ ఒక్క నగరంలోనే రూ.497 కోట్లకు మించి రుణాలను పంపిణీ చేశామని తెలిపారు. రుణాల జారీలో ప్రతీ ఏడాది సగటున 30 శాతం వృద్ధిని సాధిస్తున్నామన్నారు. ఐ10, ఐ20, బలెనో మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడంతో కార్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారన్నారు. తెలంగాణలో ప్రతీ నెల 1000 కార్లపైగా అమ్మకాలు చేస్తున్నామని, దీంతో యూజ్డ్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తమ కార్యకలాపాల విస్తరణకు పెట్టుబడులు కొనసాగుతాయన్నారు. దేశంలోని 200 నగరాల్లో కార్యకలాపాలు కలిగి ఉందని, మరో 50 పట్టణాలకు విస్తరించాలని నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు. జారీ చేస్తున్న రుణాల్లో సగటు విలువ రూ.5.9 లక్షలుగా ఉందన్నారు. యూజ్డ్ కార్లకు గరిష్టంగా ఆరేండ్ల కాలపరిమితితో రుణాలు జారీ చేస్తున్నామన్నారు. వడ్డీ రేటు 15 శాతం నుంచి ప్రారంభమవుతుందన్నారు.