నిరుపయోగంగా రైతు వేదికలు..

– కోట్ల ప్రజాధనం వృధా.. ఖర్చు నిర్వాహణకు నిధులు ఇస్తే ఉపయోగం
నవతెలంగాణ – అచ్చంపేట
గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రైతులకు వ్యవసాయ అధికారులకు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశంతో ప్రతి వ్యవసాయ క్లస్టర్లు రైతు వేదిక భవనాలు నిర్మాణం చేశారు. ఒక్కొక్క రైతు వేదిక భవనానికి రూ.30 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. జిల్లాలో 461 గ్రామపంచాయతీలు ఉన్నాయి 143 రైతు వేదిక భవనాలు నిర్మాణం చేశారు. నిర్వాహనకు నిధులు కేటాయించకపోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. రైతులకు ఉపయోగంలోకి రాకుండానే శిథిలావస్థకు చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోట్ల ప్రజాధనం వృధా ఖర్చు చేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాగు పద్ధతులు , అధిక దిగుబడి వచ్చే అంశాల పైన చర్చ సమావేశాలు నిర్వహించుకునేందుకు, శాస్త్రవేత్తల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు వ్యవసాయ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచనలు సలహలు ఇచ్చేందుకు అనుకూలంగా రైతుకు వేదిక భవనాలు నిర్మాణం చేశారు. నిర్మాణ కోసం నిధులు మంజూరు చేస్తే రైతులకు ఎంతో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. గత కెసిఆర్ ప్రభుత్వం కొన్నాళ్లపాటు ప్రతి రైతు వేదిక నిర్వహణ కోసం నెలకు 9,000 మంజూరు చేసింది. త్రాగునీటి కోసం, స్టేషనరీ జిరాక్స్ పేపర్లు,  విద్యుత్ బిల్లు, పారిశుధ్య నిర్వహణ, భవన మరమ్మతులకు ఖర్చు చేసేవారు. గత ఏడాది నుంచి రైతు వేదికలకు నిర్వహణ నిధులు రావడం లేదు. ఏడాదిగా నిధులు రాకపోవడంతో స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో సొంత నిధులు ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయని కొందరు వ్యవసాయ విస్తరణ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతు వేదికలకు  నిర్వహణకు నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.ప్రభుత్వ నిధులు విడుదల చేస్తే బాగుంటుంది. చంద్రశేఖర్ , జిల్లా వ్యవసాయ అధికారి నాగర్ కర్నూల్ జిల్లా. జిల్లాలో 143 రైతు వేదిక భవనాలు ఉన్నాయి. గత ఏడాది నుంచి ప్రభుత్వం నిర్వహణకు నిధులు విడుదల చేయడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు సొంత డబ్బు ఖర్చు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వము నిధులు మంజూరు చేస్తే రైతులకు చాలా ఉపయోగపడతాయి.