– ఏవీ కొత్త నియామకాలు కావు
– పదోన్నతులనూ కలిపేస్తున్నారు
– మోడీ సర్కార్ ప్రచారార్భాటం
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక..నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్షలాది పోస్టులు ఖాళీలున్నా..భర్తీ చేయటంలేదు. నిన్న అగ్నివీర్ పేరుతో ఆర్మీలో నియామకాలంటూ..ఇపుడు రోజ్‌గార్ మేళా అంటూ నిరుద్యోగుల్ని మభ్యపెడుతోంది. ఉద్యోగ నియామక సర్టిఫికెట్లు అందజేస్తున్నట్టు ప్రచారార్భాటం చేస్తోంది. వాస్తవానికి ఏవీ కొత్త నియామకాలు కావు. పదోన్నతులని కలిపేస్తూ బీజేపీ ప్రభుత్వం మాయచేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
న్యూఢిల్లీ : నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న సమాచారంలో డొల్లతనం బయటపడింది. ఈ మేళాలలో ఇస్తున్న ఉద్యోగాలన్నీ నూతన నియామకాలు కావు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారికి కల్పిస్తున్న పదోన్నతులను కూడా కొత్త ఉద్యోగాలుగా చూపిస్తున్నారని టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. 2022 అక్టోబర్ నుంచి నెలకు ఒకసారి చొప్పున జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. షరా మామూలుగానే వీటిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రసంగిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నారు. ఈ నెలవారీ కార్యక్రమాలను 45 నగరాలలో ఒకే సమయంలో నిర్వహిస్తున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు ఈ కార్యక్రమాలకు మీడియాలో విస్తృత స్థాయిలో ప్రాచుర్యం కల్పిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద టెలిగ్రాఫ్ పత్రిక అడిగిన వివరాలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని విశ్లేషిస్తే పదోన్నతులను సైతం కొత్త ఉద్యోగాలలో చేర్చి గొప్పలు చెప్పుకుంటున్నారని అర్థమవుతోంది.
అసలు బండారం ఇదే…
ఉదాహరణకు మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 15 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది. అదే సమయంలో 21 మందికి పదోన్నతులు కల్పించింది. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారితో పాటు పదోన్నతులు పొందిన ఉద్యోగులకు కూడా రోజ్‌గార్ మేళాలో పత్రాలు అందజేశారు. అదే విధంగా ఏప్రిల్‌లో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ 38 మందికి నియామక పత్రాలు అందజేసింది. అయితే వీరిలో 18 మంది పదోన్నతులు పొందిన వారే. పదోన్నతులను కూడా కొత్త ఉద్యోగాలలో చూపడం వెనుక హేతుబద్ధతపై కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సంజరు మూర్తిని వివరణ కోరేందుకు టెలిగ్రాఫ్ ప్రయత్నించగా ఆయన ఇంకా స్పందించలే దు. ‘పదోన్నతులు పొందిన వారు ఇప్పటికే సర్వీసులో కొనసాగుతున్నారు. వారి హోదా మారిం ది. అంతే. వారిని కొత్త ఉద్యోగులుగా చూపడంలో అర్థం లేదు. పదోన్నతులు పొందిన వారి సంఖ్యను నూతన ఉద్యోగాలలో కలపడం రికార్డుల పరంగా ప్రభుత్వానికి ఉపయోగపడవచ్చు. కానీ ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది’ అని ఐఐటీ బోధనా సిబ్బంది ఒకరు తెలిపారు.
ప్రచార ఆర్భాటమే…
వాస్తవానికి రోజ్‌గార్ మేళాలు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న లక్ష్యాలకు అనుగుణంగా లేవు. ప్రతి నెలలో రోజ్‌గార్ మేళా ప్రారంభానికి ముందు, ఆ తర్వాత ఓ పథకం ప్రకారం ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణలో నడిచే దూరదర్శన్, ఆకావాణితో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా గరిష్ట స్థాయిలో ఈ మేళాలకు ప్రచారం కల్పిస్తున్నాయి. ఈ మేళాలలో ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని మోడీ ప్రసంగాన్ని భారీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రోజ్‌గార్ మేళాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ కొత్తగా నియమితులైన అభ్యర్థుల వాయిస్ బైట్లను వినిపిస్తున్నాయి. ఈ వీడియోలలో వారు తమ పేర్లు, ఉద్యోగాల వివరాలు చెబుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్న నరేంద్ర మోడీకి ఉద్యోగాల కల్పన చాలా కీలకమైనది. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా మోడీ హయాంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాలు లేకపోవడంతో యువతలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో పెల్లుబుకుతోంది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ రేటు 7.95 శాతంగా ఉన్నదని భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న కేంద్రం (సీఎంఐఈ) విడుదల చేసిన నివేదిక చెబుతోంది.