ఉత్కంఠ భరిత యాత్రికుడు

అనువాదకుడిగా లబ్ద ప్రతిష్టులైన మూర్తి కెవివిఎస్‌ రాసిన కొత్త నవలే ‘నిరంతర యాత్రికుడు’. ఇదొక ఆత్మకథాత్మక నవల. ఇంకోవైపు ట్రావెలాగ్‌ కూడా. ఇందులో నాయకుడికి సివిల్స్‌లో సెలెక్ట్‌ కావాలనీ, యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనే కోరికలు ఉండేవి. కానీ పరిస్థితులు అనుకూలించక ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతంలో ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా వెళ్లాల్సి వస్తుంది. అటవిక ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆ కుగ్రామంలో బడి పరిస్థితులు, ఆ గ్రామపు విషయాలు, అక్కడి ప్రకతి సౌందర్యంతో మమేకమైన ఆ ఉపాధ్యాయుడి అనుభవాలను ఇందులో ఆసక్తికరంగా వివరించారు. ఆ ఉపాధ్యాయుడికి దేశ సంచారం పట్ల ఆసక్తి ఉండటంతో సెలవుల్లో ఉత్తర- దక్షిణ భారతదేశ యాత్రలను చేయడం, వాటి విశేషాలను తెలియజేయడం ఇందులో చూడవచ్చు. బోధన మీద, సాహిత్యం మీద, యాత్రల మీద అతడికున్న ఆసక్తి మనల్ని ఆకట్టుకుంటుంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా కొనసాగే ఈ నవల తప్పకుండా చదవదగింది.