ఉత్తమ్‌…మౌనముద్ర

– బీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం
– అసంతృప్తి రేవంత్‌ పైనా…పార్టీ పైనా?
– కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ ప్రచారమంటున్న సీనియర్లు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దూకుడుగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తాజాగా కొన్ని కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నది. పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు ఆపార్టీని వీడతారనే వదంతులు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో గత వారం రోజులుగా ఏదో ఒక రూపంలో ప్రచారం సర్క్యులేట్‌ అవుతూనే ఉంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో హస్తం పార్టీ నుంచి కూడా బీఆర్‌ఎస్‌లోకి సీనియర్‌ నేతలు వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంటున్నది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌పై ఈ ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారం వెనుక బీఆర్‌ఎస్‌ ఉందంటూ కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఉత్తమ్‌తోపాటు మరికొందరు నేతలు కారెక్కుతారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు బలంగా వాదిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చాలా మంది నేతలు తమ పార్టీలోకి వస్తారని తెలంగాణ భవన్‌ వర్గాలు అంటున్నాయి. బీఆర్‌ఎస్‌ కీలక నేతలతో ఉత్తమ్‌ చర్చలు జరుపుతున్నారనీ, ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌, ఆయన భార్య పద్మావతికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆ వర్గాలు పదే పదే లీకులు ఇస్తున్నాయి. ఏడేండ్లపాటు పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఎంపీగా ఉన్న ఆయనపై ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని హస్తం నేతలు తప్పుపడుతున్నారు. అతి త్వరలోనే సీబ్ల్యూసీ ఆహ్వానితులుగా నియమించడంతోపాటు ఏదో ఒక రాష్ట్రానికి స్వతంత్ర ఇంచార్జిగా ప్రమోషన్‌ ఇస్తారంటూ ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉత్తమ్‌ను నమ్ముకుని చాలామంది నాయకులు ఉన్నారనీ, ఆయన తన భవిష్యత్తు చూసుకుంటే, తమ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. పార్టీ మారుతున్నారంటూ సోషల్‌మీడియాలో కొనసాగుతున్న ప్రచారాన్ని ఉత్తమ్‌ ఖండించకపోవడంతో దీనికి మరింత బలం చేకూరుతున్నదని గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. ఆయన మౌనంగా ఉండటంతో ఉత్తమ్‌ నిజంగా పోతున్నారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి అధ్యక్షుడయ్యాక తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. నల్లగొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని రేవంత్‌ ప్రకటించిన వెంటనే తమతో సంప్రది ంచకుండానే ప్రకటించడం సరైందికాదని ఉత్తమ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి జోక్యం చేసుకుని ఇరువర్గాలతో సంప్రదించి ఎట్టకేలకు బహిరంగ సభ నిర్వహింపజేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక విషయంలోనూ వారిద్దరి మధ్య కొన్ని అభిప్రాయభేదాలు తలెత్తినట్టు తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో తన అనుచరులను ఉత్తమ్‌కు వ్యతిరేకంగా రేవంత్‌ ప్రోత్సహిస్తున్నారనే టాక్‌ వినబడుతున్నది. ఈ క్రమంలో పాత నాయకులకు అన్యాయం జరుగుతుందని ఉత్తమ్‌ వర్గీయులు అంటున్నారు. రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తగిన సమయం ఇవ్వరనీ, ఫోన్లు చేసినా ఎత్తరనే విమర్శలున్నాయి. ఏదైనా బాధలు చెప్పుకుందామన్నా సమయం ఇవ్వరనీ, ఇప్పటికీ ఆయన చుట్టూ కంచెలాగా కొంత మంది ఉంటారనీ, దాన్ని చేధించుకుని ఆయన దగ్గరకు చేరుకోవడం సాధ్యం కావడం లేదని గాంధీభవన్‌లో నాయకులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయినప్పటికీ ఉత్తమ్‌ పార్టీ మారేంత బలహీనమైన నేత కాదనీ, ఆయనకు ఏఐసీసీ స్థాయిలో పదవి ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదంతా కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్‌లోని సీనియర్లు కొట్టేస్తున్నారు.