వివాదాస్పద యూసీసీ అమలుకు సిద్ధమైన ఉత్తరాఖండ్‌

డెహ్రాడూన్‌: వివాదాస్పద ఏకరూప పౌరస్మృతి (యుసిసి)ని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. యుసిసి ముసాయిదాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ శుక్రవారం పత్రాన్ని సమర్పించినట్లు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం యుసిసిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలుస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి రంజన్‌ ప్రకాష్‌ దేశారు నేతృత్వంలో ఐదు గురు సభ్యులతో 2022 మేలో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో ఫిబ్రవరి 5 నుండి 8 వరకు నిర్వహించనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ఆమోదించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. ఈ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.