ఉయ్యాలా.. ఉయ్యాలా..

 – సీతానగరిపై డోల సేవ
 – పరవశించిన భక్తజనం
నవతెలంగాణ- భీంగల్: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టపై శ్రీ లక్మీ నృసింహుని కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి సీతానగరిపై డోల సేవ శోభయమానంగా నిర్వహించారు. అలర చంచలమైన ఆత్మలందుండి నీ అలవాటు చేసేనే ఉయ్యాలా… ఉయ్యాలా అంటూ పాటలు పాడుతూ ఆ దేవదేవుని డోల సేవలో అర్చకులు మునిగితేలారు. అలాంటి అబ్దుత సన్నివేశం ( డోలసేవ ) తిలకించిన భక్తజనం ఆనందపరవశం లో మునిగి తేలారు. స్వామి వారి ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న జోడు లింగముల మార్గమునకు వెళ్లే దారిలో ఉన్న సీతా నగరములో ఉన్న నాలుగు స్తంభముల రాతి మండపం లో డోల సేవ జరిపారు. కార్తీక వైకుంఠ చతుర్దశి నాడు హరి హరులను ఒకే చోట దర్శించుకోవడం వలన పాప పరిహారం పొందెదరు. అందుకొరకు శ్రీ లక్మీ నృసింహుని ఉత్సవ విగ్రహములను పల్లకిలో వేద మంత్రోచ్చరణముల మధ్య మేళ తాళలతో సీతానగర మండపానికి తీసుకోచ్చి కన్నుల పండువగా డోలసేవ నిర్వహించారు. లాలి పాటలు పాడుతూ స్వామికి డోల సేవ జరిపారు. స్వామి తిరుగు ప్రయాణం లో జోడు లింగముల కేదురుగా స్వామిని నిలిపి, అట్టి శ్రీ లక్మీ నృసింహుని నుండి జోడు లింగముల దర్శనం అందరు చేసుకోవడం జరిగింది.