– విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలి
– ప్రభుత్వ పాఠశాలలకు జీరో బిల్లు సదుపాయాన్ని కల్పించాలి
– ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రమోషన్లలో మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూటీఐ భవన్లో జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎడ్ల సైదులు, అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు, ప్రమోషన్లను, సమర్ధవంతంగా, అన్ని కోర్టు కేసులను పరిష్కరించి వేగంగా, విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి జరిపించినందున ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.అయితే స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో ఒకే ఉపాధ్యాయునికి రెండు లేదా మూడు పోస్టుల్లో ప్రమోషన్ కి అర్హత ఉన్నందున ప్రమోషన్ల తర్వాత నాన్ జాయినింగ్ పోస్టులు చాలా మిగిలిపోయాయి, వీటిని కూడా ప్రస్తుత ప్రమోషన్ లిస్ట్ నే కొనసాగిస్తూ అన్ని ఖాళీలను ప్రభుత్వం చొరవ తీసుకొని, ఇదే మాసంలో నింపినట్లైతే విద్యాశాఖలోని అన్ని పాఠశాలల్లో ఎలాంటి ఖాళీలు లేకుండా ఉంటుందని కోరారు.అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు, సర్వీస్ పర్సన్లు లేక శుభ్రత కొరవడిందని, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలల శుభ్రతను పట్టించుకోవట్లేదని, పాఠశాలలు ప్రారంభమై ఒక నెల కావస్తున్నందున ప్రతి పాఠశాలకి సర్వీస్ పర్సన్ ను లేదా స్కావెంజర్ను తక్షణమే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ బకాయిలు భారీగా పెరిగి పోయాయని ప్రభుత్వం వాటిని మాఫీ చేసి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు జీరో ఎలక్ట్రిక్ బిల్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల రెసిడెన్షియల్ పాఠశాలలో, మోడల్ స్కూల్లలో, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరారు. కస్తూర్బా పాఠశాలలో పనిచేస్తున్న సి ఆర్ టి లకు మినిమం బేసిక్ పే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో నమోదు చాలా తక్కువగా ఉందని ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పాఠశాల పై నమ్మకం కల్పించినట్టయితే తల్లిదండ్రులు విద్యార్థులను క్రమంగా బడికి పంపించడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని తద్వారా పాఠశాలల్లో నమోదు పెరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షులు బక్కా శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షురాలు బడుగు అరుణ, కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్. అరుణ, జిల్లా కార్యదర్శులు సిహెచ్. రామలింగయ్య, ఎం. శ్రీనివాస్ రెడ్డి, గేర నరసింహ, రాసమల్ల రమాదేవి, నలపరాజు వెంకన్న, ఎం. మురళయ్య, యాదగిరి, సంస్కృతిక కమిటీ కన్వీనర్ గిరి యాదయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్లా మధుసూదన్ రెడ్డి, ఆడిట్ కమిటీ సభ్యులు తాటికాయల నరసింహమూర్తి, అకాడమిక్ కమిటీ కన్వీనర్ పగిడిపాటి నరసింహ, నరసింహమూర్తి, అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొనినారు.
ఆమోదించిన తీర్మానాలు..
– అన్ని పాఠశాలలకు వెంటనే స్కావెంజర్లను నియమించాలి
– 5000 పిఎస్ హెచ్ఎం పోస్టులను వెంటనే అప్గ్రేడ్ చేయాలి
– మిగిలిపోయిన గెజిటెడ్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి
– పండిట్, పిటి పోస్టులకు అప్ గ్రేడేషన్ పూర్తయినందున, మిగిలిన పోస్టులను కామన్ సీనియార్టీ ప్రకారం నింపాలి