వందేండ్ల స్ఫూర్తి – వైకోమ్‌ పోరాటం

One Hundred Years of Inspiration - Vaikom's Struggleచదువుకోవటం, గౌరవనీయమైన వృత్తిని ఎంచుకోవటం, మంచి బట్టలు వేసుకోవటం, స్వేచ్ఛగా అన్ని ప్రదేశాల్లో తిరగటం ఈరోజుల్లో సాధారణ విషయాలు. కానీ, 19వ శతాబ్దంలో కిందిస్థాయి కులాలపై అణచివేతలు, అవమానాలు అన్నీఇన్నీ కావు. మనుషులను అసమాన విలువలతో వర్గీకరించి వారిని ఊరికి దూరంగా ఉంచేవారు. ఫలానా విధంగానే నడుచుకోవాలని ఆంక్షలు విధించేవారు. ఒక కులం వారు కంటపడితేనే హిందూ సమాజానికి అరిష్టమని ‘అస్పృశ్యులు’ అని పేరు పెట్టారు. వారు పగటి సమయాల్లో ఎక్కడా సంచరించే అవకాశం ఉండేది కాదు. ఏ కులం వాళ్లు దేవాలయాలకు ఎంతెంత దూరంలో ఉండాలో, గ్రామాల్లో ఏయేస్థానాల్లో ఉండాలో కూడా బ్రాహ్మణులే నిర్ణయించేవారు. అదే మన హైందవ సాంప్రదాయమని చెప్పి రాజుల చేత శాసనాలు చేయించి మరీ అమలు చేయించేవారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సంస్థానాల్లో కింది కులాలకు చెందిన స్త్రీలు బహిరంగ ప్రదేశాల్లో చాతిని కూడా కప్పుకునే అవకాశం ఇచ్చేవారు కాదు. దుర్మార్గమైన కుల ఆచారాలు, పురుషాధిపత్యం, బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థలకు వ్యతిరేకంగా తమిళనాడులో పెరియర్‌ ఇవి రామసామి ఆరెడు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశాడు. తదానంతరం కేరళలోని వైకోమ్‌ అనే చిన్న పట్టణంలో 1924లో ప్రారంభమైన తిరుగుబాటు చరిత్ర గతినే తిరగరాసింది. ఇది భారతదేశంలోనే తొలి మానవహక్కుల పోరాటంగా చరిత్రకెక్కింది.2024 డిసెంబర్‌కు ఈ పోరాట విజయానికి వందేండ్లు నిండిన సందర్భంగా వైకోమ్‌ చారిత్రక నేపథ్యాన్ని మననం చేసుకోవాల్సిన సందర్భం ఇది.
రాచరిక పరిపాలనలో ఉన్న తిరువితాంకూర్‌ సంస్థానం (ప్రస్తుత కేరళ రాష్ట్రంలో ఉంది)లో గల వైకోమ్‌ పట్టణంలో మహదేవ దేవాలయం ఉన్నది. ఆవీధుల నుండి దళితులు, వెనుకబడిన తరగతుల వాళ్లు (శూద్రులు) నడవకూడదని శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్లకు కఠిన శిక్షలు ఉండేవి. టి.కె. మాధవన్‌ అనే (ఎజవా) వెనుకబడిన కులం న్యాయవాది తిరువితాంకూర్‌ మహా రాజు కోటలో ఉన్న కోర్టుకు రోజూ వెళ్లాలి. అయితే ఆ రోజు ఆలస్యమైంది. గుడి చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్‌ తిరిగి వెళ్తే ఆలస్యమవుతుందని గుడి ముందు గల రోడ్డులో వెళ్తే కోర్టుకు టైముకు చేరుకోవచ్చుననే తొందరలో, దేవాలయం వీధులగుండా వెళ్లడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్న బ్రాహ్మణులు తనని కులం పేరుతో దూషించి, చేయిచేసుకున్నారు. న్యాయవాది అయిన టి.కె. మాధవన్‌ అవమానంతో కుమిలిపోయి స్థానిక కాంగ్రెస్‌ నాయకులకు తన బాధ చెప్పుకున్నాడు. కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కయిన గాంధీజీకి లేఖ రాసి, వ్యక్తిగతంగా కూడా కలిసి తనకు జరిగిన అవమానాన్ని వివరించాడు. కానీ గాంధీజీ స్పందించకపోగా ”సనాతన వాదులు వారి ధర్మాలను వాళ్లు పాటిస్తారు, అనుసరిస్తారు. దానికి మనమేం చేయగలం” అంటూ దాన్ని పెద్ద సమస్యగా తీసుకోలేదు. సంఘసంస్కర్త అయిన స్ధానిక నారాయణ గురు ప్రభావం కలిగిన మాధవన్‌ స్థానిక కాంగ్రెస్‌ నాయకులను ఒప్పించి నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాడు. నిరసన కార్యక్రమాలకి తీవ్రంగా స్పందించిన తిరువితాంకూర్‌ రాజు గుడి వీధులగుండా నడవకూడదని, శాసనాలను ఉల్లంఘించడమే కాకుండా, నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించి నిరసనకారులందరినీ అరెస్ట్‌ చేసి, జైల్లో పెట్టించాడు.
వైకోమ్‌ ఉద్యమాన్ని నడపడం ఎలా అని అంతా ఆందోళనపడి, ఉద్యమాన్ని నడిపించే సమర్థవంతమైన నాయకుడు కావాలని, అప్పటికి కాంగ్రెస్‌ పార్టీ తమిళనాడు అధ్యక్షుడుగా ఉన్న పెరియార్‌ ఇవి రామసామిని అభ్యర్థించారు. కేరళలో జరుగుతున్న వైకోమ్‌ పోరాటం గురించి వివరంగా లేఖ రాసి, టెలిగ్రామ్‌ కూడా పంపించారు. అది అందిన సమయానికి పెరియార్‌ మధురై జిల్లా పర్యటనలో ఉన్నాడు. ఆ బాధ్యతలు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాజగోపాలచారి అప్పగించి, వైకోమ్‌ పోరాటంలో పాల్గొనడానికి వెంటనే బయలుదేరాడు. పెరియార్‌ వైకోమ్‌ వస్తున్నాడని తెలిసి ట్రావెన్‌ కోర్‌ (తిరువితాంకూర్‌) రాజు తన సిబ్బంది ద్వారా పెరియార్‌కు ఆహ్వానం పంపిం చాడు. అప్పటికే ఆయనకు తిరువి తాంకూర్‌ రాజుకు పరిచయాలు న్నాయి. ఈరోడ్‌ పట్టణానికి పెరియార్‌ ఈవి రామసామి మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు రాజుఢిల్లీకి ప్రయాణం చేసిన ప్రతిసారి ఈరోడ్‌లోని పెరియర్‌ అతిథి గృహలో విశ్రాంతి తీసుకునేవాడు. అందుకే పెరియార్‌కి రాజు ఆహ్వానం పలికాడు. కానీ ఆ ఆహ్వానాన్ని, మర్యాదను పెరి యార్‌ తిరస్కరించి వైకోమ్‌ పోరాటానికి నాయకత్వం వహిం చాడు. నిరసన కార్యక్రమాల్ని ఉధృతం చేశాడు. పెరియర్‌ అక్కడి ప్రజలను తన తార్కికమైన, హేతుబద్ధమైన ప్రసం గాలతో వైకోమ్‌ పోరాటం న్యాయమైన దని ప్రచారం చేశాడు. ‘మనిషిని మనిషిగా గౌరవించలేని, ప్రేమించలేని కులవ్యవస్థ ఒక దారుణమైన అంటరాని వ్యవస్థ అని, దాన్ని పాటిస్తున్న సమాజం ఎప్పుడూ సామాజికంగా అభివృద్ధి సాధించలేదని’ చైతన్యపర్చాడు. ‘దళితులు, వెనుకబడిన కులాల వాళ్లు గుడి వీధుల గుండా నడిస్తే దేవుడికి అంటూ అవుతుంది అనుకుంటే అలాంటి దేవుడు మాకు అవసరం లేదు. ఆ దేవుడి శిల్పం చాకిరేవులో బట్టలు ఉతికే బండతో సమానం’ అన్నాడు. ట్రావెన్‌ కోర్‌రాజు వైకోమ్‌ ఉద్యమం తీవ్రమవటం గమనించి పట్టణంలో అన్ని నిరసన కార్యక్రమాలనూ నిషేధించాడు. ఆ నిషేధాల్ని పెరియార్‌ కావాలనే ఉల్లంఘిం చాడు. ఉద్యమం మరింత ఉవ్వెత్తున లేచింది. ట్రావెన్‌ కోర్‌ రాజు పెరియార్‌ని నెలరోజుల పాటు జైల్లో పెట్టాడు. జైలు నుండి విడుదలైన పెరియార్‌ తమిళనాడు వెళ్లిపోతాడని రాజు భావించాడు. కానీ జైలు నుండి విడుదలైన ఆయన మళ్లీ అంతే తీవ్రంగా ఉద్యమంలో పాల్గొన్నాడు.
విషయం తెలుసుకున్న తమిళనాడు రాష్ట్ర సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు రాజగోపాలచారి (రాజాజీ) వైకోమ్‌ ఉద్యమాన్ని భగం చేయాలని పెరియార్‌పై ఒత్తిడి తెచ్చాడు. ‘అది తమిళనాడుకు చెందిన ఉద్యమం కాదు. ఇక్కడికొచ్చి రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మీ బాధ్యతలు నిర్వహించాలి’ అని లేఖ రాశాడు. మరో కాంగ్రెస్‌ నాయకుడు ఎస్‌ శ్రీనివాస అయ్యంగార్‌ అనే ఒక భాద్యున్ని వైకోమ్‌ పంపి పెరియార్‌ను తీసుకురమ్మని చెప్పాడు. అంటే వైకోమ్‌ ఉద్యమాన్ని నిలిపి వేయడానికి కాంగ్రెస్‌లో ఉన్న బ్రాహ్మణులు ఎంత ప్రయత్నం చేశారో ఒక్కసారి ఆలోచించండి. కానీ పెరియార్‌ తన పోరాటాన్ని ఆపలేదు. ఈ విషయం ఇతర రాష్ట్రాలకూ పాకింది. పంజాబ్‌ లాంటి వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా కార్యకర్తలు స్వచ్ఛందంగా వైకోమ్‌ ఉద్యమంలో పాల్గొనటానికి సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న గాంధీ వైకోమ్‌ ఉద్యమం హిందువులకు సంబంధించినది. ఇందులో ఇతర మతాలవారు కల్పించుకోకూడదని ప్రకటన చేశాడు. అయినా ఉద్యమ ఉధృతి ఆగలేదు. పెరియార్‌ తన ఉపన్యాసాలతో ప్రజలను ఉత్సాహపరుస్తూ బ్రాహ్మణిజం, మనువాద వ్యవస్థలపై నిప్పులు చెరిగారు. రాజు కోపంతో పెరియార్‌ను మళ్లీ అరెస్టు చేసి, ఈసారి ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించాడు. విషయం తెలుసుకున్న పెరియార్‌ భార్య, చెల్లెలు నాగమ్మాల్‌, కన్నమ్మాల్‌ తమిళనాడు నుండి వచ్చి వైకోమ్‌ పోరాటం ఆగి పోకుండా ప్రచారం చేశారు. వైకోమ్‌లో ఉవ్వెత్తున లేస్తున్నటువంటి పోరాటాలను చూసి భీతిల్లిన బ్రాహ్మణులు రాజుతో మాట్లాడి పెరియార్‌ను చంపాలని శత్రు సంహార యాగం చేశారు. కానీ అనుకోకుండా రాజుయే ఆకస్మిక మరణం చెందారు. ఆయన స్థానంలో రాజసు భార్య రాణి సంస్థాన బాధ్యతలు చేపట్టారు. వైకోమ్‌ పోరాటానికి భయపడి పోయిన ఆమె ఉద్యమకారులతో రాజీ కుదుర్చుకోవాలనుకున్నారు. కానీ, ఈ విషయం తెలుసుకున్న తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాజగోపాలచారి ఈ ఘనత పెరియార్‌కి చెందకుండా ఉండాలని గాంధీకి సమాచారం అందించాడు. 1925లో సంధి కుదుర్చడానికి గాంధీజీ వైకోమ్‌ పట్టణానికి వచ్చి, రాణిని కలసి మాట్లాడి ఆమె అభిప్రాయాన్ని పెరియార్‌కి వివరించారు. దేవాలయం వీధుల్లో నడవడానికి రాణి అంగీకరించారు. కానీ, ‘మీరు దేవాలయ ప్రవేశం అడుగుతారామోననే భయాన్ని ఆమె వ్యక్తపరుస్తున్నదని’ గాంధీజీ పెరియార్‌కి చెప్పాడు. అప్పుడు పెరియార్‌ ‘ముందు దేవాలయం వీధిలో నుండి నడవనీయండి, తర్వాత గుళ్లోకి పోయే ప్రయత్నం చేస్తాం’ అని గాంధీతో చెప్పాడు.
సంధి కుదిరింది. వైకోమ్‌ పోరాటం విజయవంతమైంది. ఈ సందర్భంగా పెరియార్‌ అన్న మాట ప్రతి ఒక్కరి రక్తం సలసల కాగేలా చేసింది. ” మలం తినే కుక్కలు, పందులు స్వేచ్ఛగా తిరుగాడే వీధుల్లోకి దళితులకు ప్రవేశం లేదనే ఆ హక్కు కోసం మేము పోరాటం చేయలేదు. మనిషికి మనిషికి మధ్య అంతరాలు తొలగించి మానవత్వం సాధించడమే మా ఉద్దేశం. అందుకోసమే దేవాలయం వీధుల్లో నడవడానికి మేము పోరాటం చేయవలసి వచ్చింది’ అన్నాడు.
ఆ తర్వాత 1936 సంవత్సరంలో ఎర్నాకులంలో జరిగిన కులనిర్మూలన సదస్సులో పెరియార్‌ హిందూమతంలో దళితులకు, వెనుకబడిన శుద్ర కులాలకు సామాజిక గౌరవం లేదని, అంటరానితనం లేని ఇస్లాంలో కలవండి, అందులో కులం లేదంటూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. అప్పుడు బ్రాహ్మణులు భయపడి అన్ని దేవాలయాల్లో దళితులకు, శూద్ర వెనుకబడిన కులాలవాళ్లకు కూడా ప్రవేశాన్ని కల్పించారు. కొన్నేండ్ల తర్వాత వైకోమ్‌ పట్టణానికి వెళ్లిన పెరియార్‌కి ఘన స్వాగతం పలికిన దళిత, నిమ్న కులాల ప్రజలు పెద్ద సభ ఏర్పాటు చేసి, ఆ సభలో పెరియార్‌ను ‘వైకోమ్‌ వీరుడు’ (వైకొం వారియర్‌) అంటూ కొనియాడారు.ఇది చారిత్రకంగా భారతదేశంలో జరిగిన తొలి మానవ హక్కుల పోరాటంగా మనం చూడొచ్చు. వైకోమ్‌ పోరాటం జరిగి వందేండ్లు అవుతున్న సందర్భంగా కేరళ వామపక్ష ప్రభుత్వం, తమిళనాడు డిఎంకె సర్కార్‌ వైకోమ్‌ పోరాట శతాబ్దపు విజయోత్సవాన్ని ఘనంగా జరిపాయి. వైకోమ్‌లో పెరియార్‌ భవన్‌, పెరియార్‌ లైబ్రరీతో పాటు ఒక మ్యూజియంని కూడా ఏర్పాటు చేశాయి. పట్టుదలతో కృషి చేస్తే దేన్నయినా సాధించగలమనే ఆత్మవిశ్వాసాన్ని వైకోమ్‌ పోరాటం చాటిచెప్పింది. అందుకే ఇది కేరళ ప్రజలకే కాదు, భారత దేశ ప్రజలందరి విజయం. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం.

– జీడి సారయ్య, 9949652769