– హంపి, హారిక నిష్క్రమణ
– అర్జున్, ప్రజ్ఞానందకు నిరాశ
– ప్రపంచ చెస్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్
వేగం, కచ్చితత్వంతో పాటు కూసింత అదృష్టం సైతం తోడైతేనే బ్లిట్జ్ ఫార్మాట్‌లో ఎత్తులు వేయగలం. చదరంగంలో అత్యంత కఠినమైన ఫార్మాట్ బ్లిట్జ్. ఈ పోటీల్లో ప్రపంచ విజేతగా నిలిచేందుకు భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు వైశాలి ముందంజలో కొనసాగుతోంది. ఓపెన్ విభాగంలో భారత్ నుంచి ఎవరూ బ్లిట్జ్ నాకౌట్ దశకు చేరుకోలేదు.
నవతెలంగాణ-న్యూయార్క్
ఫిడె ప్రపంచ చెస్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్ తొలి రోజు పోటీల్లో 11 రౌండ్లలో ఏకంగా 9.5 పాయింట్లు సాధించిన వైశాలి స్పష్టమైన ముందంజ వేసింది. మహిళల విభాగంలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి తొమ్మిదో స్థానంలో నిలిచి నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. ఓపెన్ విభాగంలో తెలుగు తేజం అర్జున్ ఎరిగేశి సహా ఆర్. ప్రజ్ఞానంద అంచనాలను అందుకోలేదు. మహిళల విభాగం క్వార్టర్‌ఫైనల్లో జు జినర్ (చైనా)తో వైశాలి పోటీపడనుంది.
వైశాలి నం.1
మహిళల చెస్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో 107 మంది పోటీపడగా.. భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి అగ్రస్థానంలో నిలిచింది. తొలి రోజు పోటీల్లో మహిళల విభాగంలో 11 రౌండ్ల పోటీలు జరిగాయి. ఎనిమిది గేముల్లో విజయాలు సాధించిన వైశాలి.. మూడు గేములను డ్రాగా ముగించింది. తొలి రోజు ఒక్క ఓటమి చవిచూడని వైశాలి 9.5 పాయింట్లతో టాప్ లేపింది. రెండో స్థానంలో నిలిచిన చైనా గ్రాండ్‌మాస్టర్ లీ కంటే 1.0 పాయింట్ల ముందంజలో కొనసాగుతుంది. 11 రౌండ్ల పోటీల అనంతరం టాప్-8లో నిలిచిన వారు నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు. ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి ఆ మార్క్ దాటలేదు. 8 పాయింట్లు సాధించిన హంపి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఏడు పాయింట్లతో ద్రోణవల్లి హరిక 22వ స్థానంలో నిలువగా.. దివ్య దేశ్‌ముఖ్ (18), అగర్వాల్ (19)వ స్థానాలు సాధించారు.
‘బ్లిట్జ్ ఫార్మాట్‌లో నేను గొప్ప ప్లేయర్‌ను కాదు. పోటీలో ఎంతోమంది మెరుగైన ప్లేయర్స్ ఉన్నారు. ఈ రోజు నాకు కొంత అదృష్టం కలిసొచ్చిందని అనుకుంటున్నాను. నేను వేసిన ఎత్తులు పని చేశాయి. ఈ రోజు ఫలితాలతో ఎంతో సంతోషంగా ఉన్నాను. నాకౌట్ పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇటువంటి ఫలితాలను నిజంగా ఊహించలేదు’ అని తొలి రోజు పోటీల అనంతరం రమేశ్‌బాబు వైశాలి తెలిపింది.
అర్జున్ ఇంటికి
బ్లిట్జ్ ఓపెన్ విభాగం చాంపియన్‌షిప్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు తేలిపోయారు. పురుషుల విభాగంలో తొలి రోజు 13 రౌండ్ల పోటీలు జరిగాయి. 186 మంది గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు పోటీపడిగా.. టాప్-8 ప్లేయర్లు నాకౌట్ దశకు అర్హత సాధించారు. టాప్-9లో భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు. ఆర్. ప్రజ్ఞానంద 8.5 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి ప్రజ్ఞానందదే ఉత్తమ ప్రదర్శన కావటం గమనార్హం. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగేశి ఏడు పాయింట్లతో 64వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ మాగస్ కార్ల్‌సన్ 9.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇయాన్ (9.5), ఫాబియానో (9.5) పాయింట్లతో టాప్-2లో నిలిచారు. వరల్డ్ నం.3 హికారు నకముర (అమెరికా)పై అన్‌సీడెడ్ భారత గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చితాంబరం అద్భుతం చేశాడు. బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో హికారు నకమురపై విజయం సాధించాడు. ఈ ఓటమితో కంగుతిన్న నకముర.. టాప్-8లో చోటు కోల్పోయాడు. 8.5 పాయింట్లతో 21వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.