బీజేపీ ఆఫీస్‌లో వాజ్‌పేరు జయంతి

–  నివాళి అర్పించిన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, రాజాసింగ్‌, తదితరులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి జయంతిని సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా గుడ్‌ గవర్నెన్స్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా వాజ్‌పేయి అందించిన సేవలు మరువలేనివన్నారు. వాజ్‌పేయి అడుగుజాడల్లో ప్రస్తుత ప్రధాని మోడీ నీతివంతమైన పాలన అందిస్తున్నారన్నారు. వాజ్‌పేయి కలలు కన్న రామమందిరం..మోడీ పాలనలో నెరవేరుతున్నదని చెప్పారు.
శ్వేత, స్వేద పత్రాలు రెండూ అవినీతి పత్రాలే : కిషన్‌రెడ్డి
బీఆర్‌ఎస్‌ ప్రకటించిన స్వేదపత్రం, కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం రెండు కూడా అవినీతి పత్రాలేనని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఆయన చిట్‌చాట్‌ చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లవి అవినీతి, ప్రజలను మోసం చేసే పత్రాలని ఆరోపించారు. ఈ నెల 28న రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ఉందనీ, దానికి హోంమంత్రి అమిత్‌షా హాజరవుతారని తెలిపారు.ఆ సమావేశంలో పార్లమెంట్‌ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారని చెప్పారు. అసెంబ్లీ బీజేపీ ఎల్పీ నేతను కూడా ఆ సమావేశంలో ఎన్నుకుంటామన్నారు.