అంతర్గత ప్రజాస్వామ్యానికి చెల్లుచీటీ

Validity of internal democracy– బీజేపీలో అధికారమంతా ఇకపై పార్లమెంటరీ బోర్డుదే జాతీయ సమావేశాల్లో కొనసాగిన మోడీ హవా
న్యూఢిల్లీ : బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం భూతద్దంతో వెతికినా కానరావడం లేదు. ఇటీవల ముగిసిన బీజేపీ జాతీయ సమావేశాల్లో ఈ విషయం తేటతెల్లమై పోయింది. పార్టీ అధ్యక్షుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే పద్ధతికి స్వస్తి చెబుతూ బీజేపీ రాజ్యాంగాన్ని సవరించారు. అధ్యక్షుని పదవీకాలం, అత్యవసర పరిస్థితుల్లో దాని పొడిగింపు వంటి విషయాలలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డుకు కట్టబెట్టారు. ఈ సవరణపై సమావేశంలో చర్చ జరిగిందా లేదా అనే విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే సమావేశానికి పాత్రికేయులను అనుమతించలేదు. పీటీఐ వార్తా సంస్థ ఇచ్చిన సమాచారాన్నే మీడియా సంస్థలు ప్రజలకు చేరవేశాయి.
‘సవరణల వివరాలను, వాటిలోని హేతుబద్ధతను బీజేపీ వివరించలేదు. భవిష్యత్తులో పార్టీ అధ్యక్ష పదవిని నియామకం ద్వారా భర్తీ చేసే పరిస్థితి రావచ్చునని మాత్రం పార్టీ వర్గాలు తెలిపాయి’ అని పీటీఐ వివరించింది. 1980లో బీజేపీ ఆవిర్భవించినప్పటి నుండి కాంగ్రెస్‌ అంతర్గత పనితీరుకు పూర్తి భిన్నమైన రీతిలో వ్యవహారాలను నడిపింది. కాంగ్రెస్‌ ఓ కుటుంబ పార్టీ అని, అంతర్గత ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కిందని బీజేపీ ఆరోపిస్తూ వస్తోంది. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియ ద్వారానే తమ అధ్యక్షులందరూ ఎన్నికయ్యారని గొప్పలు చెప్పుకుంది. అయితే ఈ వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదని బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రహసనాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.
అంతా ఏకగ్రీవమేనట
1997లో మొదటిసారి, గత సంవత్సరం రెండోసారి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. కానీ దీనికి భిన్నంగా బీజేపీ అధ్యక్షులందరూ ‘ఏకగ్రీవం’గానే ఎన్నికయ్యారు. ముందుగానే ఎంపిక చేసుకున్న వ్యక్తికి వ్యతిరేకంగా ఎవరూ నామినేషన్‌ వేసే సాహసం చేయకుండా పార్టీ పెద్దలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు జాగ్రత్తలు తీసుకునే వారు. 2014 వరకూ బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థే.
2005లో మహమ్మద్‌ అలీ జిన్నా లౌకిక విశ్వసనీయతలను ప్రశ్నించిన తర్వాత అద్వానీని పూర్తిగా విస్మరించారు. 2013లో నితిన్‌ గడ్కరీని రాత్రికి రాత్రే పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించి, రాజ్‌నాథ్‌ సింగ్‌ను నియమించడానికి కారణమేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయినప్పటికీ తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని బీజేపీ చెప్పుకుంటుంది.
2014 తర్వాత సీను మారింది
2014 తర్వాత బీజేపీకి ఓట్లు సంపాదించే నేతగా మోడీ ఆవిర్భవించారు. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ వంటి సీనియర్‌ నేతలు పూర్తిగా తెరమరుగయ్యారు. ఒకప్పుడు బీజేపీ రాజకీయాలను శాసించిన ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. 2014లో బీజేపీ అధ్యక్షుడుగా అమిత్‌ షా ఎన్నికైన తర్వాత పార్టీలో మోడీ ప్రభంజనం మొదలైంది. ఇందిరాగాంధీ మోడల్‌నే బీజేపీ అనుకరించడం ప్రారంభించింది. తాజాగా బీజేపీ రాజ్యాంగానికి చేసిన సవరణతో పార్లమెంటరీ బోర్డే సూపర్‌ పొలిట్‌బ్యూరోగా అవతరించింది. పార్లమెంటరీ బోర్డులో ఎవరు ఉండాలనేది నిర్ణయించేది అమిత్‌ షాయే. పార్టీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా ఉన్నా లేక వేరెవరు ఉన్నా పూర్తి అధికారం, పట్టు మాత్రం మోడీదే. అటల్‌ బిహారీ వాజ్‌పేయి సైతం ప్రభుత్వం పైన, పార్టీ పైన ఇలా పెత్తనం చెలాయి ంచే వారు కాదు. బీజేపీ జాతీయ సమావేశాల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌, నడ్డా, చివరికి అమిత్‌ షా కూడా డమ్మీలుగా మిగిలి పోయారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సైతం జరుగుతున్న పరిణామాలను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతోంది. ఏదేమైనా తాజా సవరణ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎదురు దెబ్బగానే భావించాలి. రాజ్యాంగం, ఏకాభిప్రాయం, ప్రజాస్వామ్యం వంటి పదాలన్నీ కంటితుడుపు మాటలుగానే మిగిలిపోయాయి.