అమ్మాకీ విలువైన సూచ‌న‌లు

Valuable sales leadsఈ రోజుల్లో పిల్లలపై సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి సమయంలో పిల్లలకు తల్లిదండ్రుల విలువైన సూచనలు చాలా అవసరం. ముఖ్యంగా అమ్మాయిల పూర్తి స్థాయి అభివృద్ధికి తల్లిదండ్రుల గైడెన్స్‌ కీలకం. పిల్లలు తమ తప్పులు, అనుభవాల నుంచి నేర్చుకుంటారు. ఇదే సమయంలో ముఖ్యమైన జీవిత పాఠాలు తల్లిదండ్రుల నుంచే తెలుసుకుంటారు. అందుకే అమ్మాయిలకు యుక్త వయసు వచ్చినప్పటి నుంచే తల్లిదండ్రులు కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. భవిష్యత్తు గురించి అవగాహన కల్పించాలి. టీనేజ్‌కి వచ్చిన అమ్మాయిలకు ఇంట్లో పెద్దవాళ్లు ముఖ్యంగా మెన్‌స్ట్రువల్‌ హెల్త్‌, సెక్సువల్‌ ఇంటిమసీ, హెల్తీ బౌండరీస్‌ క్రియేట్‌ చేయడం.. వంటి విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. వారి జీవితాలను ప్రభావితం చేయడంలో తల్లిదండ్రులే కీలక పాత్ర పోషించాలి. నిపుణుల సూచనల ప్రకారం.. టీనేజ్‌ కుమార్తెలకు తల్లిదండ్రులు నేర్పాల్సిన విలువైన జీవిత పాఠాలు ఏవో తెలుసుకుందాం.
ఆడపిల్లలు ఓ వయసుకు వచ్చాక శారీరక మార్పులు జరుగుతాయి. అందుకే పునరుత్పత్తి ఆరోగ్యం, సెక్సువల్‌ ఇంటిమసీ గురించి వారికి అవగాహన కల్పించడం అవసరం. సెక్స్‌ గురించి మాట్లాడటానికి మన దేశంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. మీకు కష్టంగా ఉన్నప్పటికీ నిపుణుల సలహాలు తీసుకుని మీ అమ్మాయికి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. అన్‌ప్రొటెక్టెడ్‌ సెక్స్‌, ఎర్లీ ఏజ్‌ సెక్స్‌ రిస్కుల గురించి వాస్తవాలు వివరించాలి.
మెన్‌స్ట్రువల్‌ హెల్త్‌
పీరియడ్స్‌ మహిళ జీవితంలో ఓ భాగం. స్త్రీగా ఎదుగుతున్నప్పుడు, శరీరం బిడ్డను కనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మీ అమ్మాయికి చెప్పాలి. 4-5 రోజులు ప్రతి నెలా పీరియడ్స్‌ రావడం, రక్తస్రావం వంటివన్నీ వివరించాలి. ఆమెకు ప్రతి అడుగులో గైడెన్స్‌ చేయడానికి మీరున్నారనే భరోసా ఇవ్వండి.
శరీరంతో ఆరోగ్యకరమైన సంబంధం
శరీరంలో, శరీర భాగాల్లో ఏవైనా లోపాలు ఉంటే వారిపై సమాజం ఎలాంటి వివక్ష చూపుతుందో అందరికీ తెలుసు. అందానికి ప్రజలు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మీ అమ్మాయి తనను తాను ప్రేమించుకోవడం, తన శరీరాన్ని దాని లోపాలతో సహా అంగీకరించడం నేర్పండి. ఎవ్వరూ పర్ఫెక్ట్‌ కాదని గుర్తు చేయండి. కాలక్రమేణా ఎదగడానికి, మెరుగుపడటానికి ఆమెను ప్రోత్సహించండి. కానీ ఇతరులను సంతోష పెట్టడానికి ఆమెలోని మంచిని ఎప్పుడూ మార్చవద్దు. ప్రతి బాడీ టైప్‌ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. తమపై పాజిటివ్‌ వ్యూ డెవలప్‌ చేసుకోవడం అలవాటు చేయండి.
స్నేహాలు
ప్రపంచంలోని కోట్లాది మంది వ్యక్తుల్లో, మంచి స్నేహితులను ఎంచుకోవడం చాలా కష్టం. మీరు ఎంచుకున్న స్నేహితులు మీకు ముఖ్యం. వారే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తారు. అందుకే తల్లిదండ్రులు తమ ఆడపిల్లలు హెల్తీ ఫ్రెండ్‌షిప్‌ కలిగి ఉండాలే ప్రోత్సహించాలి. నిజమైన స్నేహాలు ఎలా ఉంటాయో చూపించాలి. స్నేహితులను ఇంటికి ఆహ్వానించి వారిపై అవగాహన పెంచుకోవాలి.
ప్రాక్టికల్‌గా ఉండటం
ఇతరులను సంతోషపెట్టడానికి మిమ్మల్ని మీరు ఎప్పటికీ మార్చుకోకూడదు. జెండర్‌తో సంబంధం లేకుండా అందరూ ఇది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు ప్రాక్టికల్‌గా ఆలోచించేలా మోటివేట్‌ చేయాలి. లవ్‌, రిలేషన్‌షిప్స్‌ గురించి ఆలోచించడానికి మెచ్యూరిటీ రావాలని తెలియజేయాలి.
వెనకాడవద్దు
సాధారణంగా ఏ లోటు లేకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని తల్లి ఆరాటపడుతుంది. కూతురుకి సంబంధించిన అన్ని విషయాలనూ దగ్గరుండి మరీ చూస్తుంది. కానీ లైంగిక జ్ఞానాన్ని అందివ్వడానికి ఎందుకో వెనకాడుతోంది. ఈ విషయంలో బిడ్డకు కనీస అవగాహన కల్పించకపోవడం రేపటి సమాజాన్ని కలవరపెడుతోంది. యుక్త వయసులో లైంగిక పరిజ్ఞానం లేక ఎందరో అమ్మాయిలు నయవంచకుల చేతుల్లో మోసపోతున్నారు. దీనంతటికీ కారణం తల్లితో అంతగా మాట్లాడే చనువు లేకపోవడం. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అంటే ఏంటో తెలియకపోవడం. ఎందుకంటే మీరు బతికున్నంత వరకు కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. ఆ ప్రభావం వారిపై జీవితాంతం ఉంటుందనే విషయాన్ని మరచిపోకూడదు.
ఇవి కూడా చెప్పండి
– పరిచయస్తులు, బంధువుల ఒడిలో కూర్చోవద్దని హెచ్చరించండి.
– మీ కూతురే కదా అని.. తన ఎదుట మీరు బట్టలు మార్చుకోవడం వంటివి చేయొద్దు.
-‘ఇతను నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నీ భర్త అవుతాడు’ అని చెప్పి భవిష్యత్తులో జరిగే అనర్థాలకు కారణం కావొద్దు.
– బయట పిల్లలతో ఆడుకునేటపుడు ఏమేం ఆటలు ఆడుతున్నారో గమనించండి.
– ఎవరితోనైనా అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పినపుడు వారితో వెళ్లు, కూర్చో, మాట్లాడు అని బలవంతపెట్టకండి.
– గలగల మాట్లాడే అమ్మాయి ఒక్కసారిగా మౌనం వహిస్తే కారణం ఏంటో అడిగి తెలుసుకోండి.
– సెక్స్‌ అంటే సరైన అవగాహన కల్పించండి. లేదంటే సమాజం దాని గురించి తప్పుగా చెబుతుంది.
– సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ లాంటి సాంకేతికత పరికరాలను ఉపయోగించే ముందు అందులో పేరెంట్‌ కంట్రోల్‌ మోడ్‌ ఉండేలా చూసుకోండి.
– మూడేండ్ల వయసు నుంచే శరీర శుభ్రతపై అవగాహన ఏర్పరచండి. వేరొకరితో చనువుగా ఉండే ముందు ఆలోచించమని చెప్పండి.
– హాని కలిగించే వస్తువులను, కుటుంబీకులను పిల్లల నుంచి దూరంగా పెట్టండి.
– సమూహాల మధ్య నిలబడాల్సి వస్తే ఎలా జాగ్రత్తపడాలో తెలపండి.
– ఎవరి మీదనైనా మీ పిల్లలు ఫిర్యాదు చేస్తే ఆ విషయాన్ని విస్మరించకండి.
– ఏదైనా సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా వారికి విలువలు నేర్పండి.