బంధానికి విలువివ్వండి

Value the relationshipభాగస్వామి తీరు నచ్చకపోవడమో, తమ కోరికలకు తగ్గట్టు నడుచుకోక పోవడమో, ప్రేమ తగ్గిపోవడమో, వైవాహిక బంధంలో అసంతృప్తితోనో ఇలా అనేక కారణాలతో ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా భార్యభర్తల బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత దానికి ఒక విలువ ఇవ్వాలి. ఏదైనా సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి. అలా కాకుండా భాగస్వామిని మోసం చేయడం సరైనది కాదు. దీని వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
సాక్షికి సుమారు 40 ఏండ్లు ఉంటాయి. నవీన్‌తో పెండ్లయి 20 ఏండ్లు అవుతుంది. ఇద్దరిదీ ప్రేమ వివాహం. నవీన్‌ వాళ్ల ఇంట్లో మాట్లాడి పెద్దలను ఒప్పించి ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నాడు. సాక్షి వారి కుటుంబం మాత్రం వారి వివాహాన్ని అంగీకరించడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. అంతకు ముందు ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉండేవారు. నాలుగేండ్ల నుండి విడిగా ఉంటున్నారు. అయితే ఉండేది మాత్రం ఒకే బిల్డింగ్‌లో. అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరి సంసారం వాళ్లు నడుపుకుంటున్నారు. పండగైనా, ఫంక్షనైనా అందరూ కలిసి ఒకే దగ్గర చేసుకుంటారు. సాక్షి మామయ్య చనిపోయారు. అత్తయ్య మాత్రమే ఉంటుంది. అందరూ ఒకరికి ఒకరు సహకరించుకుంటారు. సాక్షి, నవీన్‌ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో పని చేయడానికి కూడా ఓ అమ్మాయిని పెట్టుకున్నారు. పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా అందరూ కలిసి పరిష్కరించుకుంటారు. కానీ సాక్షి సమస్యను మాత్రం అత్తయ్య పట్టించుకోవడం లేదు.
నవీన్‌ వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అత్తకు చెబితే ‘మగాడు అన్న తర్వాత సంబంధాలు పెట్టుకుంటాడు. ఎవరితో సంబంధం ఉన్నా నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా! ఇంకెందుకు గొడవ చేస్తావు. నువ్వు సరిగ్గా పట్టించుకోకనే వాడు ఇలా తయారయ్యాడు’ అంటూ తన కొడుకునే సమర్ధిస్తుంది. నవీన్‌ అన్నకు తెలిసి పిలిచి మాట్లాడితే ‘అలాంటిది ఏమీ లేదు’ అన్నాడు. తర్వాత ఆయన ఫోన్‌ తీసుకొని చెక్‌ చేస్తే విషయం అర్థమై కోప్పడ్డారు. దాంతో రెండేండ్లు బాగానే ఉన్నాడు. నవీన్‌ అన్న ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రం వెళ్ళిపోయాడు. దాంతో మళ్లీ మొదటికొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో తోటికోడలి సలహాతో సాక్షి తనకు న్యాయం చేయమంటూ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి తన సమస్య మొత్తం చెప్పుకుంది.
మేము నవీన్‌కు ఫోన్‌ చేసి పిలిపించాము. సాక్షి చెప్పిన దాని గురించి అడిగితే ‘ఆమెను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది నన్ను ఇంట్లో అందరిముందు తలదించుకునేలా చేసింది. మా వదినమ్మ నన్ను తన తమ్ముడిలా చూస్తుంది. నాకు మంచి సలహాలు ఇచ్చేది. మా పెండ్లప్పుడు కూడా ఆమే అందరితో మాట్లాడి ఒప్పించింది. ఆమంటే నాకెంతో గౌరవం. అలాంటి ఆమె దగ్గర నా పరువు పోయింది. నాకు చాలా బాధగా ఉంది. మా అన్నయ్య చెప్పిన తర్వాత నేను ఎవరితోనూ సంబంధం పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నాకు ఎవరితోనూ సంబంధం లేదు. మా అన్నయ్యకు మా బంధువుల్లో మంచి గౌరవం ఉంది. నేను దాన్ని పాడు చేయలేను. కానీ సాక్షి నన్ను అనుమానిస్తూనే ఉంది. నాతో పాటు ఉద్యోగం చేస్తున్న ఆమెతో నేను సంబంధం పెట్టుకున్నాను అనుకుంటుంది. ఆమె భర్త వేరే చోట ఉంటాడు కాబట్టి ఆమెకు ఎప్పుడైనా అవసరమైతే చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాను అంతే తప్ప ఆమెకూ నాకూ ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పుకొచ్చాడు.
‘సాయం చేస్తే ఎవరూ అనుమానించరు. ముందు నువ్వు మీ అన్నా, వదిలను ఒకసారి తీసుకొని వస్తే వాళ్లతో కూడా ఓ సారి మాట్లాడతాము’ అని చెప్పాము. ‘వాళ్లు వేరే దగ్గర ఉంటున్నారు. కావాలంటే మా అమ్మను తీసుకొస్తాను’ అన్నాడు. ‘మీ అన్నా వదినలు వస్తేనే మేము మాట్లాడతాము’ అని చెప్పాము. పైగా వాళ్ల వదినే సాక్షిని ఇక్కడకు పంపించిందనది కూడా చెప్పాము. దాంతో అతను మా వదిన ముందు మళ్లీ నా పరువు తీశావు. ఇక నువ్వు నాకు వద్దు. విడాకులు ఇచ్చేస్తాను’ అంటూ కేకలు పెట్టాడు.
సాక్షి వెంటనే తన తోటికోడలికి ఫోన్‌ చేసి నవీన్‌ మాటలు వినిపించింది. ఆమె మాతో ‘నవీన్‌ నా కొడుకు లాంటి వాడు. కొంచెం దారి తప్పుతున్నాడు. ఏది మంచి, ఏది చెడు అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. భార్యను కాదని వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. భార్య బాధ్యతలు గుర్తు చేస్తుంది. వేరే వాళ్లకు అలాంటి అవసరం ఏమీ లేదు. అందుకే ఆమె అతనికి మంచిగా కనిపిస్తుంది’ మీరే ఎలాగైనా కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి సంసారాన్ని నిలబెట్టండి. మరో ఏడాదిలో మేము తిరిగి వచ్చేస్తున్నాము. అప్పటి వరకు మీరే వాళ్లకు నచ్చజెప్పండి’ అని చెప్పి ఫోన్‌ పెట్టేసింది.
‘నవీన్‌కు నాతో ఉండటం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుంటాను. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. నా బతుకు నేను బతకగలను. నాకూ ఆత్మాభిమానం ఉంది. ఇలాంటి వ్యక్తితో నేను ఎలా కలిసి బతకాలి మేడం. అక్కా, బావ వచ్చిన తర్వాత విడాకులు ఇచ్చి వెళ్లిపోతాను’ అంటూ ఏడ్చేసింది. దానికి మేము ‘చూడు సాక్షి ఆవేశ పడొద్దు, అతనితో మేము మాట్లాడతాము కదా!’ అని సర్ది చెప్పి…
‘నవీన్‌ నువ్వు చేస్తుంది తప్పు. పైగా సాక్షినే బెదిరిస్తున్నావు. నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఇదేనా ప్రేమంటే. ప్రేమించి పెండ్లి చేసుకోవడం గొప్ప కాదు. జీవితాంతం ఆ ప్రేమను నిలబెట్టుకోవడం ముఖ్యం. మీ పిల్లలు పెద్ద వాళ్లు అయ్యారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు పెరుగుతాయి. అయినా ఒకరికోసం ఒకరు కొంత సమయం కేటాయించుకోండి. వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకొని సంసారాన్ని పాడుచేసుకోవద్దు. మీ పిల్లలకు తెలిస్తే మీ పరువు పోతుంది. వాళ్లు మీ మాట వినరు. మిమ్మల్ని అసహ్యించుకుంటారు. సాక్షితో సంతోషంగా ఉండండి. అది మీకూ, మీ కుటుంబానికి మంచిది. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మీ ఇష్టం. మీ కుటుంబాన్ని మీరు దూరం చేసుకోవల్సి వస్తుంది. తర్వాత ఎంత బాధపడ్డా ఫలితం ఉండదు. మీ భార్యకు మీరంటే ఎంతో ఇష్టం. అందుకే తన సంసారాన్ని నిలబెట్టమని మా దగ్గరకు వచ్చింది. అర్థం చేసుకోండి. ఇద్దరూ సంతోషంగా ఉండండి’ అని చెప్పాము.
అంతా విన్న తర్వాత అతను కాస్త ఆలోచించి ‘మీరు చెప్పింది నిజమే మేడం, అనవసరంగా నా భార్యను బాధపెట్టాను. వేరే మహిళ ఆకర్షణలో పడి నా కుటుంబాన్ని పక్కన పెట్టాను. మా అన్నయ్య, వదిన కూడా నన్ను అసహ్యించుకుంటున్నారు. రేపు నా పిల్లల ముందు కూడా దోషిలా నిలబడాల్సి వస్తుంది. ఇకపై ఎలాంటి తప్పు చేయను. నా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాను. బాధ్యతగా నడుచుకుంటాను’ అని చెప్పి సాక్షిని తీసుకొని వెళ్లాడు.
– వై వరలక్ష్మి,
9948794051