తిరిగే బంతికి విలవిల!

– స్పిన్‌కు టీమ్‌ ఇండియా దాసోహం
– 2021 నుంచీ టర్న్‌ పిచ్‌లపై ఇదే వ్యథ
ఆధునిక క్రికెట్‌లో స్పిన్‌ను బాగా ఆడే జట్టుగా టీమ్‌ ఇండియాకు పేరుంది. భారత ఆటగాళ్లు సైతం నెట్‌ సెషన్లలో పెద్దగా స్పిన్‌పై సాధన చేసేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ప్రాక్టీస్‌ సెషన్లలోనూ పేస్‌ను జాగ్రత్తగా ఎదుర్కొనేవారు. స్పిన్‌ ఆడటంలో భారత ఆటగాళ్లను మాస్టర్స్‌గా పరిగణించేవారు. గణాంకాలు సైతం అందుకు అద్దం పట్టేవి. ఫలితంగా, సొంతగడ్డపై భారత్‌ను ఓడించటం ఆసీస్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, కివీస్‌ వంటి మేటీ జట్లకు సైతం అసాధ్యంగా మారింది.
భారత ఆటగాళ్లు స్పిన్‌ మాస్టర్స్‌మనే భ్రమల నుంచి బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. 2021 నుంచి భారత క్రికెటర్లు తిరిగే బంతిని ఆడేందుకు తికమక పడుతున్నారు. భారత పిచ్‌లపై మన స్పిన్నర్లు, ప్రత్యర్థి స్పినర్లపై పైచేయి సాధించగా.. మన బ్యాటర్లపై ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు పైచేయి సాధించటం కొంపముంచింది. ఫలితంగా సొంతగడ్డ కంచుకోట బీటలువారింది.
శ్రీనివాస్‌దాస్‌ మంతటి
2017 పుణె టెస్టు. భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో గెలుపు. 2021 చెన్నై టెస్టు. 227 పరుగుల తేడాతో ఆతిథ్య భారత్‌పై ఇంగ్లాండ్‌ విజయం. 2024 హైదరాబాద్‌ టెస్టు. భారత జట్టుపై 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ పైచేయి. ఈ జాబితాలోకి మరో టెస్టు మ్యాచ్‌ చేరింది. 2024 పుణె టెస్టులో భారత్‌ను న్యూజిలాండ్‌ తిప్పేసింది. ప్రత్యర్థి కోసం టీమ్‌ ఇండియా బిగించిన ఉచ్చులో తానే చిక్కుకుని విలవిల్లాడింది. ఈ నాలుగు టెస్టుల్లోనూ టీమ్‌ ఇండియా ఓటమికి కారణం ఒకటే.. స్పిన్‌ను ఆడేందుకు భారత బ్యాటర్లు ఇబ్బందిపడటం. స్వదేశీ కంచుకోటలో వరుసగా 18 టెస్టు సిరీస్‌ విజయాలు సాధించిన భారత్‌.. స్పిన్‌ ఆడలేక కంచుకోటతో పాటు చారిత్రక రికార్డును సైతం కోల్పోయింది.
టర్న్‌కు బ్యాటర్ల తికమక
ప్రపంచ క్రికెట్‌లో స్పిన్‌కు పుట్టినిల్లు భారత్‌. స్పిన్‌ మాయజాలంతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టడంతో పాటు ప్రత్యర్ధి స్పిన్నర్లను ఊచకోత కోయటం టీమ్‌ ఇండియా ప్రత్యేకత. తీవ్రతలో కాస్త హెచ్చుతగ్గులు ఏర్పడినా.. 2020 వరకు టీమ్‌ ఇండియా ఈ రికార్డును నిలుపుకుంది. కానీ ఆ తర్వాత కథ మారింది. భారత క్రికెటర్లు స్పిన్‌ ఆడేందుకు ఆపసోపాలు పడటం మొదలెట్టారు. 2021 నుంచి గణాంకాలు మరీ దారుణంగా ఉన్నాయి. 2016-2020, 2021 నుంచి గణాంకాల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. 2016-2020 సమయంలో స్పిన్‌ భారత బ్యాటర్ల సగటు 63.36గా ఉండగా.. 2021 నుంచి 40.6కి పడిపోయింది. బ్యాటింగ్‌ సగటు ఏకంగా సుమారు 22.76 శాతం దిగజారటం ప్రస్తుత దుస్థితి కారణమైంది. 2016-2020లో పేస్‌పై బ్యాటింగ్‌ సగటు 47.36 కాగా.. 2021 నుంచి అది 36.7గా నమోదైంది.
అందరిదీ అదే వ్యథ
స్పిన్‌ను ఎదుర్కొవటంలో భారత బ్యాటర్లు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. 2021 నుంచి యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌ మినహా జట్టులోని బ్యాటర్లు అందరూ స్పిన్‌పై తేలిపోతున్నారు. 2021 నుంచి స్వదేశంలో స్పిన్‌పై గణాంకాలు చూస్తే యశస్వి 13 ఇన్నింగ్స్‌ల్లో 89.2 సగటు, రిషబ్‌ పంత్‌ 15 ఇన్నింగ్స్‌ల్లో 66 శాతం సగటు, శుభ్‌మన్‌ గిల్‌ 22 ఇన్నింగ్స్‌ల్లో 49.10 బ్యాటింగ్‌ సగటు సాధించారు. కానీ కీలక బ్యాటర్లు సగటు 40కి చేరువలో సైతం లేకపోవటం గమనార్హం. విరాట్‌ కోహ్లి 22 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 19 సార్లు స్పిన్నర్లకు వికెట్‌ కోల్పోయాడు, 30.20 సగటు మాత్రమే సాధించాడు. రోహిత్‌ శర్మ 25 ఇన్నింగ్స్‌ల్లో 19 సార్లు స్పిన్‌కు వికెట్‌ కోల్పోయి 36 సగటు సాధించాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌ (44.80), రవీంద్ర జడేజా (37.90) మెరుగైన సగటు కలిగి ఉన్నారు. కెఎల్‌ రాహుల్‌ సైతం 8 ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు టర్న్‌కు దాసోహం అయ్యాడు. 28 సగటు మాత్రమే నమోదు చేశాడు.
మార్పులు జరగాల్సిందే
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో వాషింగ్టన్‌ సుందర్‌ లేడు. పుణె టెస్టులో పిచ్‌ ఆఫ్‌ స్పిన్నర్లకు, వాషింగ్టన్‌ శైలికి అనుగుణంగా ఉంటుందని అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. నేరుగా తుది జట్టులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. పిచ్‌ స్వభాగం, జట్టు వ్యూహలకు అనుగుణంగా బౌలింగ్‌ లైనప్‌లో మార్పులు చేసినట్టే.. బ్యాటింగ్‌ విభాగంలోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. స్పిన్‌పై పిచ్‌పై ఆడుతున్నప్పుడు టర్న్‌పై బాగా ఆడే బ్యాటర్లను ఎంచుకోవాలి. స్టార్‌ క్రికెటర్ల పేర్లతో తుది జట్టు నింపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. స్పిన్‌ను అద్భుతంగా ఆడగలిగే బ్యాటర్లు దేశవాళీ క్రికెట్‌లో దండిగా ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్‌, బాబ అపరాజిత్‌ వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు ఇటువంటి పిచ్‌పై మ్యాచ్‌ను మలుపుతిప్పే ఇన్నింగ్స్‌లు ఆడగలరు. జట్టు ప్రణాళికలకు అనుగుణంగా ఉపయుక్తమైన క్రికెటర్ల సేవలను వినియోగం చేసుకో కుంటే అంతిమంగా భారత క్రికెట్‌కే నష్టం.
దేశవాళీ తప్పనిసరి!
భారత క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌కు పూర్తిగా దూరం అవుతున్నారు. ఫలితంగా, సొంతగడ్డ పరిస్థితుల్లో ప్రత్యర్థి కంటే దారుణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జాతీయ జట్టులో ఇప్పుడు వైట్‌బాల్‌, రెడ్‌బాల్‌కు ప్రత్యేకంగా జట్లు ఉన్నాయి. విరాట్‌ కోహ్లి ఇటీవల స్పిన్నర్లపై దారుణంగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లోనూ ఈ బలహీనత ఎక్కువగా కనిపిస్తుంది. మన పిచ్‌లపై సాధన, మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుంటే ప్రత్యర్థి ముంగిట తలవంచక తప్పటం లేదు. ప్రస్తుత జట్టులో యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌ మినహా ఎవరూ రాణించటం లేదు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తరం నుంచి జట్టు రూపాంతరం చెందుతున్న దశ ఇది. టెస్టు జట్టు ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్‌లో ఒకట్రెండు మ్యచులైనా ఆడేలా బీసీసీఐ నిబంధనలు తీసుకురావాలి. అప్పుడే స్పిన్‌పై మన బ్యాటర్లు సైతం అద్భుతంగా ఆడగలరు.
సైమన్‌ డల్‌, న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌
ఆధునిక క్రికెట్‌లో భారత బ్యాటర్లు స్పిన్‌ను సమర్థవంతంగా ఆడతారనే పేరుంది. వాస్తవంలో అది నిజం కాదు. ఆ రోజులు పోయారు. స్పిన్‌పై ఇతర జట్ల మాదిరిగానే భారత్‌ సైతం ఇబ్బందులు పడుతోంది. స్పిన్‌ ఫోబియాకు టీమ్‌ ఇండియా మినహాయింపు కాదు. ఇది చేదు వాస్తవం, అంగీకరించక తప్పదు.