రాష్ట్రాన్ని దోమలు కాటేస్తున్నాయి. వైరల్ జ్వరాలు చుట్టుముడు తున్నాయి. మనుషులను పీడీస్తున్నాయి. ప్రతియేటా వచ్చే తంతే కదా అని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యమే చెల్లించాల్సి రావచ్చు. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో వచ్చిన అకాల మార్పులతో సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లతో ప్రజానీకం అవస్థలు అన్నీ ఇన్నీ కావు. డయేరియా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, అతిసార వంటి వాటికి బాధితులై జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ విష జ్వరాలతో విలవిల్లాడుతోంది. చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఈ అవస్థ తప్పకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. దీంతో ఏకంగా క్యాబినెట్ సమావేశాన్నే వాయిదా వేసినట్టుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర రాజధాని సైతం ఇందుకు మినహాయింపు కాదనడానిక స్థానిక ప్రభుత్వాసుపత్రులే సాక్ష్యం. జనంతో కూడిన క్యూలు దోమల్లా గిజగిజలా డుతున్నాయి. రాజధానిలోని గాంధీ ఆస్పత్రి, కోరంటి ఫీవర్ ఆస్పత్రికి జ్వరాలతో వస్తున్న వారి సంఖ్య రోజుకు వందల్లో ఉంటున్నది. ఇది నిజం కాదంటారా ?
పదేండ్ల ప్రగతిపేరుతో ఇటీవల అనేక విజయాలను సాధించామంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నివేదిక విడుదల చేశారు. బడ్జెట్‌ను భారీగా పెంచా మనీ, బెడ్ల సంఖ్యను అధికం చేశామనీ, ప్రతి బెడ్‌కూ ఆక్సిజన్ సౌకర్యాన్ని అందు బాటులోకి తెచ్చామని చెప్పుకొచ్చారు. మంచిదే. ఇవన్నీ ఒక పార్శ్యం. కానీ, ఆరోగ్యశాఖ అంతర్గత వ్యవహారాలు రాష్ట్ర భౌతిక పరిస్థితులను చక్క బెట్టేందుకు సంసిద్ధంగా లేవనేది స్పష్టం. ఎన్ని చేసినా, కీలక సేవలు అందించే పీహెచ్‌సీల బలోపేతమేది? డాక్టర్లు, నర్సు, సిబ్బంది పోస్టుల భర్తీ అంతంతే. ఆశాలు సమ్మెలో ఉన్నారు. జీవో 142తో నాలుగు వేల పోస్టులు రద్దయ్యే ప్రమాదముందంటూ అన్నీ కేటగీరీల అధికారులు, ఉద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమైతే, బాధిత ప్రజలకు ఎలా సేవలు అందిస్తారు? ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి.
రోగులకు యుద్ధ ప్రాతికన చికిత్సను అందించడమే సర్కారు లక్ష్యం కావాలి. మెడికల్ టెస్టులను ఉచితం చేసి, త్వరిత గతిన రిపోర్టులు వచ్చేలా చూడాలి. కరోనాతో చితికిపోయిన పేద బతుకులకు ఆసరానివ్వాలి. ప్రజల ప్రాణాల కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు లక్షల రూపాయలు కుమ్మరిస్తూ ఆర్థికంగా వేదన పడుతు న్నారు. ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదే శించే సర్కారు మాటలు కోటలు దాటుతున్నా, చేతలు గడప దాటడం లేదు. దోమల నివారణకు ఫాగింగ్‌తో పాటు దోమ తెరలను ప్రజలకు అందించాలి. ఏజెన్సీకి ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణతో పాటు బృందాలనూ పెంచాలి. చెత్తను, నిలువనీటి గుంటలు లేకుండా చూడాలి. కేసుల తీవ్రత అధికంగా ఉన్న చోటనే కాదు, అన్ని జిల్లాల్లోనూ వానలు ముదరకముందే డ్రెయినేజీల మరమ్మతులన్నీ యుద్ధ ప్రాతికదిన చేసి ఉంటే ప్రస్తుత ఈ దుస్థితి దాపురించేదే కాదు. ఎక్కడా పారిశుద్య లోపాలకు తావివ్వ కూడదన్న స్పృహ ప్రభుత్వానికి లేపోవడం విచారకరం. రక్షిత తాగునీటి సరఫరాలో తీసుకునే జాగ్రత్తలే, దోమల సంతతిని నియంత్రిస్తాయి. ఈ సర్కారీ అల సత్వం కొనసాగినంత కాలం వైరల్ జ్వరాల కట్టడి ఎండమావే.
డెంగ్యూ కారక దోమ ద్వారా వచ్చే ‘జికా’ కేసులు గతంలో కేవలం గుజరాత్, తమిళనాడుకే పరిమితమయ్యేవి. ఇప్పుడవి తెలంగాణనూ తాకాయి. ప్లేట్‌లెట్ల పేరు చెప్పి రోగుల సంబం ధీకులను బెంబేలెత్తించి లక్షల రూపాయలు గుంజేస్తున్న ఆస్ప త్రుల దౌర్జన్యాలను అంచనా వేసి, వాటిని కట్టడి చేసేదెవరు? ఉపాధి హామీ చట్టం బడ్జెట్‌లాగే ఆరోగ్య రంగానికి మోడీ సర్కారు రూ.92 వేల కోట్ల నుంచి రూ.89 వేల కోట్లకు బడ్జెట్ కేటాయింపులు కుదించింది. ఇటీవల 857 రకాల మందుల ధరలను పెంచిన కేంద్రం, ప్రజారోగ్యంతో పరాచకాలాడుతు న్నది. కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించేలా బీజేపీ విధాన ముంది. రాష్ట్ర ప్రభుత్వానిది అదే దారి. కేంద్రమైనా, రాష్ట్రమైనా ప్రజా రోగ్యవ్యవస్థలో ప్రజలకు అందుబాటులో ఉండే పీహెచ్‌సీల ప్రాధాన్యతను గుర్తించాలి. మహిళలు, పిల్లల ఆరోగ్య సేవలు, మానసిక ఆరోగ్య పథకాలు, ప్రధాన ఆరోగ్య పరిశోధనా కార్యక్ర మాలు కలిగిన ప్రధాన జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రామ్‌ను బలోపేతం చేసే ప్రజారోగ్య వ్యవస్థకు నిధులు పెంచాలి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే ప్రజలకు మేలు.