నొప్పి.. నొప్పి బాబోరు నా చేతులు నొప్పి అని బంటిగాడు కుయ్యో, మొర్రో అంటూ ఏడుస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా పరుగున బంటి గాడి దగ్గరకు చేరుకున్నారు. ఏమైంది అంటూ ఆరా తీయగా భవిష్యత్‌లో మీకు రాబోయే అతిపెద్ద ప్రమాదాన్ని తొలగించే ప్రయత్నంలో నా రెండు చేతులు ఇదిగో ఇలా కందిపోయాయి చూడండీ.. అంటూ రెండు చేతులు చూపించాడు. అవి బాగా ఎర్రగా కందిపోయి బొబ్బలు వచ్చాయి.
ఒక అవ్వ బంటిని దగ్గరకు తీసుకొని ప్రేమగా తల నిమురుతూ ఏంటి బాబు మనకు రాబోయే ఆ ప్రమాదం? అని అడిగింది. దానికి బంటి అవ్వ చెయ్యి పట్టుకొని ఎండిపోయిన చెట్లు, చెరువులు చూపిస్తూ, చూడు అవ్వా! వానలు లేక ఆ మొక్కలు, ఈ చెరువులు ఎలా ఎండిపోయాయో. నీళ్ళు లేక ఈ చెరువులు ఎండిపోతే మనకు తాగడానికి నీరు ఎక్కడనుండి వస్తుంది? మన పరిస్థితి ఏమిటి? అన్నాడు. జవాబు లేని ఆ ప్రశ్నకు ఆ అవ్వ ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా బంటి కళ్ళలోకి చూస్తూ వాడు చెప్పేది వింటూ ఉంది.
నిన్న మా బడిలో పంతులుగారు పర్యావరణ పరిరక్షణ అనే పాఠం చెబుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి, ప్రకృతిని కాపాడే విషయంలో బాధ్యతగా ఉండాలని, చెట్లను విచక్షణా రహితంగా కొట్టి వేస్తే మనుషులే కాక సకల జీవకోటికి నీరు, ఆహారం దొరకదని చెప్పారు. ఇంట్లో తాగడానికి నీరు కొంటున్నాం, భవిష్యత్తులో ఆక్సిజన్ కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదవారు ఆకలితో ఇప్పటికే అల్లాడిపోతున్నారని చెప్పారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు విధిగా చేయాలన్నారు. మొక్కలు నాటడం వలన మానవాళికే కాక పశు, పక్ష్యాదులకు కూడా ఆహారం, నీరు, ఆవాసం దొరుకుతుందన్నారు. మొక్కలలోని ఔషధ గుణాల గురించి చెప్పారు. మొక్కలు నాటడం అంటే ఇతరులకు సహాయ పడటం లాంటిదేనని, దానిలోనే నిజమైన ఆనందం ఉందని చెప్పారు. మొక్కలతో స్నేహం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటుతామని మా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. నేను, నా స్నేహితులం మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాం. అందుకే మన పరిసరాలలో నా వంతుగా మొక్కలు నాటుతున్నాను. నేల గట్టిగా ఉండటం వలన మట్టి తవ్వి నా చేతులు నొప్పెడుతున్నాయి అన్నాడు.
అప్పుడు అవ్వ బంటిని గట్టిగా హత్తుకొని, మా రోజులలో ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేది. సాయంత్రం అయ్యేసరికి అందరం ఆ చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ చెట్టు నుండి వచ్చే గాలితో హాయిగా సేద తీరి, చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. కానీ మనం ఇప్పుడు ప్రకృతిని వెలివేస్తూ భావితరాల భవిష్యత్తును బలి పెడుతున్నాం. చేజేతులా జీవం పోసే మొక్కలను కొట్టి, ఇప్పుడు ఆరోగ్యం కోసం ఆరాట పడుతున్నాం. చిన్నపిల్లలు దేవుడితో సమానం అనే మాట నిజం చేస్తూ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. నేను కూడా నాకు చేతనైనంత వరకు నువ్వు నాటిన చెట్లకు నీళ్ళు పోస్తూ వాటికి రక్షగా ఉంటాను. అక్కడున్నవారితో చిన్నవాడైనా వీడు చాలా గొప్ప పని చేస్తున్నాడు. మనందరం కూడా బంటితో కలిసి మొక్కలు నాటుదాం, మన ప్రకృతిని సంరక్షించుకుందాం అంది అవ్వ. కలసిమెలసి పనిచేయటంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ అందరూ ఉత్సాహంగా మొక్కలు నాటారు. చిన్న వయసులోనే ఇంత సామాజిక బాధ్యత ఉన్న బంటీని అందరూ చుట్టూ చేరి అభినందించారు. బంటి చాలా సంతోషంతో తను నాటిన మొక్క దగ్గర కూర్చొని దాని వైపు చూశాడు. అది కృతజ్ఞతాపూర్వకంగా ఆకులు ఊపుతూ బంటి ముఖాన్ని ప్రేమగా తాకింది.
– ధూళిపాళ్ళ మాధవికిషోర్, 9949735253