‘పువ్వు పుట్టగానే పరిమళించినట్లు’ అన్న మాటను చాలా సార్లు, అనేక సందర్భాల్లో మనం వింటుంటాం, చదువుతుంటాం. కానీ దాన్ని మనం మన కాలంలో అచ్చంగా చూస్తే ఎలా ఉంటుందంటే నేను చెబుతున్న పిల్లల ప్రతిభలాగా ఉంటుంది. గతంలో నేను పరిచయం చేసిన శ్రీజ లాగా ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా నేను బాల ప్రతిభావంతులైన మన పిల్లల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. వారిలో మా గరిపెలి నవీన్, వరేణ్య, కందేపి సృజన్- స్వాప్నిక్‌లతో పాటు నేడు బాలల కోసం పుస్తకాలుగా ప్రచురించబడి రచయితలు, కవులు, కళాకారులుగానే కాక అనేక రంగాల్లో ప్రతిభావంతులుగా వెలుగుతున్నారు. ఒక్క సిద్దిపేట జిల్లా నుండే పది మందికి పైగా పిల్లలు రచయితలుగా ఎదిగారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఈ పుట సరిపోదు. ఇది బాల సాహిత్య శీర్షిక కనుక మొదట మనం వారి గురించే మాట్లాడుకుందాం. వారిలో వనపర్తికి చెందిన వలిపే రామ్ చేతన్ గురించి ఇవ్వాళ్ల మాట్లాడుకుందాం.
వనపర్తి స్వస్థలమైనా హైదరాబాద్‌లో ఉంటు న్నాడు రామ్‌చేతన్. వలిపే లక్ష్మీ నరసింహరావు, సత్య నీలిమరామ్ అమ్మానాన్నలు. అమ్మ కవయిత్రి, నాన్న పురోహితులు. రామ్‌చేతన్ చెల్లెలు చిరంజీవి సాయి లిఖిత కూడా బాల కవయిత్రి.
ఆరు, ఏడు తరగతుల నుంచే అమ్మ ప్రోత్సాహంతో రచనలవైపు మళ్ళిన రామ్‌చేతన్‌కు గరిపెల్లి అశోక్, తిరునగరి వేదాంతసూరి ఆశీస్సులు లభించడంతో వెనకకు తిరిగి చూడలేదు. దీనికి తోడు లాక్‌డౌన్ రామ్‌చేతన్‌కు కథలు, గేయాలు ఇతర రూపాల్లోని బాల సాహిత్యాన్ని చదివేందుకు చక్కని అవకాశాన్ని కలిగించగా, ఆ సమయంలోనే విరివిగా రచనలు చేశాడు. ఆనాటి నుంచి సాగిన నాలుగేండ్ల రచనా ప్రస్తానంలో మూడు పుస్తకాలు అచ్చుకాగా, వందకు పైగా సాహిత్య కార్యక్రమాలు సదస్సుల్లో పాల్గొన్నాడు. అనేక పత్రికల్లో రచనలు అచ్చయ్యాయి. తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించిన బాలల కవితల పోటీ, కథల పోటీలో పాల్గొని ఏకంగా మొదటి బహుమతి అందుకున్న ఈ బాలకవి అనేక అంతర్జాల సమూహాల్లో నిర్వహించిన పోటీల్లోనూ పాల్గొని బహుమతులు అందుకున్నాడు. ‘ట్రెస్మా’ -చిన్నజీయరుస్వామివారు నిర్వహించిన వ్యాస రచన పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో చిలిచాడు. ఇవేకాదు.. మాతృసేవా, బతుకమ్మ పురస్కారం, మాడభూషి రంగాచార్య కథల పోట బహుమతి, కాళోజి సాహితీ పురస్కారం, బాల రత్న, మదర్ థెరిసా కళారత్నతో పాటు ఇటీవల మాచిరాజు సాహిత్య పీఠం వారి పురస్కారాలతో పాటు వివిధ అంతర్జాల సంస్థలు యిచ్చే బిరుదులు అందుకున్నాడు రామ్‌చేతన్.
రచయితగా అచ్చయిన రామ్‌చేతన్ పుస్తకాల్లో మొదటిది ‘అక్షర చైతన్యం’. ఇది సరళ శతకం. బుర్ర వెంకటేశం ఐ.ఎ.ఎస్ ఒక ఉద్యమస్ఫూర్తితో ప్రారంభించిన ఈ రూపంలో ఒక్క ఏడాదిలోనే యాభైకి పైగా రచనలు వెలువడ్డాయి. తర్వాత ‘పచ్చ పచ్చని కథలు’ పేర బాలల కథలను ప్రచురించాడు. కవిగా తన తొలి రచనను ‘తొలి అడుగు’ వచన కవితా సంపుటిగా తెచ్చాడు. ఇవేకాక మరో మూడు పుస్తకాలు అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి. పదవ తరగతి పరీక్షల కోసం తయారవుతున్న రామ్‌చేతన్ వాటిని పక్కకు పెట్టాడు. అవి 1) కథా చైతన్యం, 2) రామాయణం, 3) ప్రస్థానం పుస్తకాలు. ‘అందుకోలేని గమ్మానికి / అమృతాన్ని అందుకోవడానికి / మనిషిలో మనిషిని గుర్తించడానికి / వేసాను తొలి అడుగు ఇలా /… ఆయుధాలు లేకున్నా / కలాన్ని అస్త్రంగా మార్చి’ అంటూ తన సాహిత్య ప్రస్థానం గురించి తానే చెప్పుకున్నాడు రామ్ చేతన్ తన వచన కవితా సంపుటిలో. రామ్‌చేతన్ బాల సాహిత్యం ‘పచ్చపచ్చని కథలు’ పుస్తకం. అచ్చంగా ఇరవై ఐదు కథల సంపుటి. తొలి కథ ‘ఫలించిన వ్యూహం’ నుంచి చివరిదైన ‘కనువిప్పు’ వరకు రామ్‌చేతన్ తాను బాల్యం నుంచి, విన్నవి, తాను చూసినవి, చదివినవి అయిన అనేక అంశాలతో పాటు తనకు తోచినవి, ఊహకు అందినవి కథలుగా మలిచాడు. వీటిలో చాలా కథలు పత్రికల్లో వచ్చాయి, ఇంకొన్ని అంతర్జాల వేదికల్లో మెరిసాయి. ఫలించిన వ్యూహం చిన్న కథ, కానీ బాల రచయిత ఆలోచనల్లోంచి మొలిచిన పెద్ద కథే. అది కూడా ప్రకృతి, పర్యావరణకు సంబంధించిన చేతన్యానికి సంబంధిం చింది. ప్రకృతిని విధ్వంసం చేస్తున్న మానవుడి మీద ఆ ప్రకృతిలో భాగమైన జీవ జంతుజాలమంతా ఏకమై తిరుగబడితే మానవుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇందులో రామ్‌చేతన్ చెప్పాడు. నిజానికి రచయిత దీనిని పిల్లల కోసం రాసినా మొదటగా పెద్దలు చదవాలి. ప్రకృతికి సంబంధించిందే మరోకథ ‘పొదుపు’, ఇందులో ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలైన గాలి, నీరు, చెట్టూ, పుట్టా, పురుగూ మొదలైనవి. అందులోని నీరు విలువను, వృధా చేయడం వల్ల జరిగే అనర్థాలను చక్కగా చెప్పాడు. పిల్లలకు జంతువులంటే ఇష్టం కదా! సామర్ధ్యం కథ అలా జంతువుల నేపథ్యంలో సాగిన కథ. అత్యాశ కథ సహాయ పడిన స్నేహితుని సంపదను కాజేయాలని చేసిన వీరయ్య మోసాలను గురించి చెప్పే కథ. చివరికి అతని మోసం ఎలా బట్టబయలు అయింది. నిజాయితీ, మంచి ఎలా గెలిచిందో చెబుతాడు రామ్‌చేతన్. ‘తెలుసుకున్న తప్పు’ కథ చెడు ఆలోచనలు, స్వార్థం కలిగిన తమ్ముడిని అన్నయ్య తన బాటలతో ఎలా మార్చాడో చెప్పే కథ. రామ్ చేతన్ అందం కథలో అందం కాదు, మంచి మనసు ముఖ్యం అని రాస్తే, గర్వం కథలో ఎదుటివారి బలహీనతలతో ఎప్పుడూ ఆడుకోవద్దు అని అంటాడు. ‘ప్రకృతే మనకు దైవం’ కథలో ప్రకృతి పట్ల మనకు ఉండాల్సిన ప్రేమ, బాధ్యతలతో పాటు చేయాల్సిన పనులను చెబుతాడు. ఈ కథ పర్యావరణం పట్ల మనకు ఉండాల్సిన దృష్టిని, బాధ్యతను చెబుతుంది. ఉదీయమాన దశలోనే పరిణత చేతనతో వ్రాసిన రామ్ చేతన్ భవిష్యత్తులో మంచి కథకుడుగా, బాల సాహితీవేత్తగా ఎదగగలడు. తన అక్షరాలతో బలమైన వాగ్ధాన సంతకాన్ని చేస్తున్న ఈ బుజ్జికవి తెలంగాణ బాల సాహిత్య చరిత్ర, బాలల రచనా సాహిత్య చరిత్రలో ఒక కొత్త పుటగా నిలవగలడు. నన్ను ఆత్మీయంగా ‘అన్నా’ పిలిచే సోదరి సత్యనీలిమకు, నరసింహరావులకు అభినందనలు. చిరంజీవి వలిపే రామ్‌చేతన్‌కు ఆశీరభినందనలు.
డా|| పత్తిపాక మోహన్
9966229548