పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వంగవీటి

– బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పేదల హృదయాల్లో వంగవీటి మోహనరంగ చిరస్థాయిగా నిలిచిపోయారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఏపీ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం రంగ 76వ జయంతి వేడుకలను హైదారాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రంగ అట్టడుగు వర్గాల ప్రజలకు అండగా నిలచి వారి సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు. కొన్ని దుష్ట శక్తులు ప్రజల నుంచి ఆయనకు వస్తున్న ఆదరణ, రాజకీయ ఎదుగదలను చూసి ఓర్వలేక అత్యంత పాశవికంగా హత్య చేశాయని విమర్శించారు. ఆ హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా ఏర్పడ్డ విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టకుండా వైసీపీ ప్రభుత్వం ఆయన్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. రంగ పట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించిన తీరు వివక్షతకు నిదర్శనమని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలో రంగ జపం చేస్తూ కాపుల ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ, వైసీపీల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రంగ ఆశయ సాధనకు కేసీఆర్‌ సారధ్యంలో కులమతాలకతీతంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం కార్పొరేటర్‌ శేషగిరిరావు, రంగా అభిమానులు పాల్గొన్నారు.