– స్వతంత్ర సంస్థపై పట్టు బిగించిన మోడీ ప్రభుత్వం
– అక్రమాల నిగ్గు తేలిస్తే బదిలీ వేటు
– విధేయులకు పదవుల పందారం
ప్రభుత్వ సంస్థల పనితీరులోని లోపాలను ఎండగట్టడం కాగ్ పని. తద్వారా తాను ఆడిట్ చేసిన సంస్థల వ్యవహారాలలో ఆర్థిక జవాబుదారీతనం, పారదర్శకత పెంచేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తుంది. అయితే కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి స్వతంత్ర సంస్థలపై తనదైన శైలిలో పట్టు బిగించారు. దీంతో వాటి పనితీరు మందగిస్తోంది. ఇలాంటి సంస్థల్లో కాగ్ కూడా ఉండడం ఆందోళన కలిగించే విషయమే. కాగ్ సమర్ధవంతంగా పనిచేయకుండా అధికారంలో ఉన్న వారే అడ్డుకుంటున్నారని అనేకరుజువులు కన్పిస్తున్నాయి
అస్మదీయులకు అందలం
కాగ్‌లో మోడీ విధేయు డిగా పేరున్న గుజరాత్ కేడర్ అధికారి గిరీష్ ముర్ము తన బాస్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపవద్దంటూ సీనియర్ అధికారులను బెదిరించారు. దీనికి సంబంధించిన టేపు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. గిరీష్ బెదిరింపులను అనేక మంది సీనియర్ అధికారులు బాహాటంగా బయటపెట్టినా ఆయనపై ఎలాంటి చర్యలు లేవు. గుజరాత్ అల్లర్లపై విచారణ జరిపిన నానావతి కమిషన్ ఎదుట సాక్ష్యమిచ్చిన అధికారులను కూడా ఆయన బెదిరించారు. దీనికి ప్రతిఫలంగా మోడీ ఆయన్ని జమ్మూకాశ్మీర్‌కు గవర్నరును చేశారు. ఆ తర్వాత కాగ్‌లో నియమించారు.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి 2015లో కాగ్ 55 నివేదికలు అందజేయగా 2020లో ఆ సంఖ్య 14కు తగ్గిపోయింది. అంటే నివేదికలు 75% తగ్గాయన్న మాట. 2015లో కాగ్ నుండి 55 నివేదికలు వస్తే ఆ తర్వాత సంవత్సరాలలో వాటి సంఖ్య 42, 45, 23, 21, 14కు తగ్గుతూ వచ్చింది. రక్షణ ఆడిట్ నివేదికలు 2017లో ఏడు అందగా 2020లో ఒక్కటీ రాలేదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కాగ్ తన నివేదికల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. 2జీ వేలం, బొగ్గు గనుల వేలం, కామన్వెల్త్ క్రీడలు వంటి ఎన్నో ఉదంతాలపై కాగ్ మన్మోహన్ ప్రభుత్వ వైఖరిని తూర్పార పట్టింది.
‘బదిలీ’ బహుమతి
అయితే ఇటీవలి కాలంలో కాగ్‌లో ఆ వాడి కన్పించడం లేదు. కాగ్‌ను స్వతంత్ర సంస్థగా పనిచేయించేందుకు కొందరు ఉద్యోగులు ప్రయత్నించగా వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. కొద్ది వారాల క్రితం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రజా ప్రతినిధులకు 12 కాగ్ నివేదికలు అందజేశారు. ఆయా ప్రభుత్వ సంస్థల్లో అవినీతి జరిగిందంటూ వెల్లడించిన ఆడిట్ అధికారులు కొద్ది రోజులకే బదిలీ అయ్యారు.
అవకతవకలు బయటపెడితే…
బదిలీ అయిన అధికారుల్లో దత్తప్రసాద్ సూర్యకాంత్ షిర్‌సాత్ ఒకరు. ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పనితీరుపై ఆడిట్ జరిపిన విభాగానికి ఆయన ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. 28 రాష్ట్రాల్లోని 161 జిల్లాల్లో ఉన్న 964 ఆస్పత్రుల రికార్డులను ఆయన తనిఖీ చేశారు. 2.25 లక్షల కేసుల్లో ఆపరేషన్ చేసిన తేదీ కంటే ముందే డిశ్చార్జ్ చేసిన తేదీని నమోదు చేయడాన్ని ఆయన గమనించారు. వీటిలో 1.79 లక్షల కేసులు ఒక్క మహారాష్ట్రలోనే వెలుగు చూశాయి. ఆ రాష్ట్రంలో రూ.300 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగింది.
ఈ వ్యవహారాన్ని ఓ వెబ్ పోర్టల్ బయటపెట్టింది. చనిపోయిన వారి పేరిట కూడా లక్షలాది క్లయిములు వచ్చాయని తెలిపింది. లక్షన్నరకు పైగా నకిలీ లబ్దిదారులు నమోదయ్యారని తనిఖీల్లో కూడా తేలింది. జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఆడిట్ చేసిన అతూర్వా సిన్హాకు కూడా బదిలీ బహుమతి లభించింది. ద్వారక ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులో వ్యయాన్ని ఎక్కువ చేసి చూపారని తనిఖీలో తేలింది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కిలోమీటరుకు రూ.18 కోట్లకు అనుమతి ఇవ్వగా దానిని పెంచి రూ.250 ఖర్చయిందని చూపారు. ఈ అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి కానీ ప్రభుత్వం తన వైఫల్యాలను అంగీకరించలేదు. ప్రభుత్వాన్ని దోషిగా నిలిపేందుకు మీడియా కూడా ఆసక్తి చూపలేదు.