– సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గురువారం ఆయన లేఖ రాశారు. 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకులు 25 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు బోధిస్తున్నారని పేర్కొన్నారు. వర్సిటీలకు న్యాక్ ఏ+ తదితర గ్రేడ్ తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించారు. వర్సిటీ పరిపాలన పదవుల్లో కీలక భూమిక నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 12 వర్సిటీల్లో 1,445 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వారికి క్రమబద్ధీకరణ అయ్యేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ పరిధిలోనే వేతనాలను చెల్లిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకులను ఏ విధంగా క్రమబద్ధీకరణ చేశారో, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను కూడా అదే పద్ధతిలో రెగ్యులరైజ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారికి యూజీసీ ఏడో వేతన సిఫారసుల ప్రకారం మూలవేతనం, డీఏ, హెచ్‌ఆర్‌ఏతోపాటు మూడు శాతం ఇంక్రిమెంట్ చెల్లించాలని కోరారు.