వరుణ్‌ మ్యాజిక్‌

Varun is magic– రాజ్‌కోట్‌లో ఐదు వికెట్ల మాయజాలం
– రాణించిన బెన్‌ డకెట్‌, లివింగ్‌స్టోన్‌
వరుణ్‌ చక్రవర్తి (5/24) మాయ కొనసాగుతుంది. ఈడెన్‌లో ఇంగ్లాండ్‌ను వణికించిన వరుణ్‌.. రాజ్‌కోట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో అదే మాయ పునరావృతం చేశాడు. బెన్‌ డకెట్‌ (51), లివింగ్‌స్టోన్‌ (43) రాణించటంతో భారత్‌తో మూడో టీ20లో తొలుత ఇంగ్లాండ్‌ 171/9 పరుగులు చేసింది.
నవతెలంగాణ-రాజ్‌కోట్‌
వరుణ్‌ చక్రవర్తి (5/24) మాయజాలంతో మరోసారి ఇంగ్లాండ్‌ను విలవిల్లాడించాడు. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (51, 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోశ్‌ బట్లర్‌ (24, 22 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), లివింగ్‌స్టోన్‌ (43, 24 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు) రాణించటంతో ఇంగ్లాండ్‌ భారీ స్కోరు దిశగా సాగింది. వరుణ్‌ చక్రవర్తి మాయజాలంతో ఇంగ్లాండ్‌ మిడిల్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్య (2/33), రవి బిష్ణోరు (1/46), అక్షర్‌ పటేల్‌ (1/19) రాణించారు.
డకెట్‌ అర్థ సెంచరీ :
మంచు ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అర్షదీప్‌ సింగ్‌కు విశ్రాంతి దక్కగా.. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి తుది జట్టులో నిలిచాడు. షమితో కొత్త బంతిని పంచుకున్న హార్దిక్‌ పాండ్య.. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (5) వికెట్‌తో బ్రేక్‌ అందించాడు. మరో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (51), జోశ్‌ బట్లర్‌ (24) రెండో వికెట్‌కు 45 బంతుల్లో 76 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 26 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన బెన్‌ డకెట్‌.. ఆ తర్వాత మాయలో పడ్డాడు. ఓ ఫోర్‌, సిక్సర్‌తో ప్రమాదకరంగా మారుతున్న బట్లర్‌ను వరుణ్‌ చక్రవర్తి సాగనంపగా.. డకెట్‌ను అక్షర్‌ పటేల్‌ అవుట్‌ చేశాడు. హ్యారీ బ్రూక్‌ (8), స్మిత్‌ (6), ఓవర్టన్‌ (0), బ్రైడన్‌ (3), ఆర్చర్‌ (0)లు స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. కానీ లియాం లివింగ్‌స్టోన్‌ (43) ధనాధన్‌ మెరుపులతో దంచికొట్టాడు. రవి బిష్ణోరు ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు కొట్టాడు. కానీ హార్దిక్‌ పాండ్య అతడి కథను ముగించాడు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు ఇంగ్లాండ్‌ 171 పరుగులు చేసింది.